Thursday, May 23, 2024

చందమామ పెరట్లో రోవర్‌ ఆటలు.. వీడియో షేర్‌ చేసిన ఇస్రో

జాబిల్లి ఉపరితలంపై దిగిన చంద్రయాన్‌-3లోని ప్రజ్ఞాన్‌ రోవర్‌ నిరంతర పరిశోధనల్లో నిమగ్నమైంది. 14రోజుల కాలవ్యవధిలో వీలైనన్ని ఎక్కువ పరిశోధనలు చేయాలనే లక్ష్యంతో చంద్రుడి ఉపరితలంపై అటూ ఇటూ తిరుగుతూ అన్వేషణలు సాగిస్తోంది. మూన్‌ మిషన్‌ సమాచారాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఎప్పటికప్పుడు అందిస్తున్నది. తాజాగా రోవర్‌ ప్రజ్ఞాన్‌ మూన్‌పై చక్కర్లు కొడుతున్న వీడియో క్లిప్‌ను ఎక్స్‌లో షేర్‌ చేసింది. చంద్రుడిపై వాక్‌ చేస్తున్న రోవర్‌ సురక్షిత మార్గాన్ని ఎంచుకుని ప్రయాణిస్తున్నది.

ఈ క్రమంలో దాని ముందు గొయ్యి, రాళ్లు వంటివి ఉండటాన్ని గుర్తించినప్పుడు తిరిగి వెనక్కి మళ్లుతున్నది. ఇస్రో శాస్త్రవేత్తలు బెంగళూరులోని కమాండ్‌ సెంటర్‌ నుంచి రిమోట్‌గా రోవర్‌ను ఆపరేట్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రుడి ఉపరితలంపై రోవర్‌ చక్కర్లు కొట్టడాన్ని విక్రమ్‌ ల్యాండర్‌ వీడియో తీసింది. ఈ వీడియో క్లిప్‌ను ఎక్స్‌లో ఇస్రో పోస్ట్‌ చేసింది. విక్రమ్‌లోని ల్యాండర్‌ ఇమేజ్‌ కెమెరా ద్వారా ఈ వీడియోను చిత్రీకరించినట్లు ఇస్రో పేర్కొంది.

- Advertisement -


ఒక చంటి పిల్లాడు తన తల్లి ముందు ఎలా చిలిపి పనులు చేస్తాడో.. ల్యాండర్‌ ముందు రోవర్‌ కూడా అలాగే చేస్తూ ఈ వీడియోలో కనిపించింది. తన చుట్టూ తానే చక్కర్లు కొడుతూ.. సరదాగా ఆడుకుంటుండడాన్ని ఈ వీడియోలో మనం చూడొచ్చు. ఈ వీడియోని ఇస్రో షేర్‌ చేస్తూ.. ”సురక్షితమైన మార్గాన్ని ఎంపిక చేసుకోవడంలో భాగంగా ప్రజ్ఞాన్‌ రోవర్‌ తన చుట్టూ తానే చక్కర్లు తిరుగుతోంది. ప్రజ్ఞాన్‌ భ్రమణాన్ని ల్యాండర్‌ ఇమేజర్‌ కెమెరా బంధించింది. చందమామ పెరట్లో చిన్న చిన్నారి (రోవర్‌) ఉల్లాసంగా ఆడుకుంటుంటే.. తల్లి (ల్యాండర్‌) ఆప్యాయంగా చూస్తున్నట్లు ఉంది కదూ” అంటూ ఇస్రో రాసుకొచ్చింది.

జాబిల్లిపై సల్ఫర్‌..

చంద్రుడి దక్షిణ ధ్రువానికి చేరువలోని ఉపరితలంపై మొట్టమొదటిసారిగా జరిపిన పరిశోధనల్లో సల్ఫర్‌ ఉనికిని రోవర్‌లోని కీలమైన లేజర్‌ ఇండ్యూస్డ్‌ బ్రేక్‌డౌన్‌ స్పెక్ట్రోస్కోప్‌ (లిబ్స్‌) గుర్తించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ప్రజ్ఞాన్‌లోని మరో పరికరం కూడా దీన్ని ధ్రువీకరించింది. మరో టెక్నిక్‌తో జాబిల్లి ఉపరితలంపై సల్ఫర్‌ ఉన్నట్లు గుర్తించింది. ఆల్ఫా పార్టికల్‌ ఎక్స్‌రే స్పెక్ట్రోస్కోప్‌ దీన్ని ధ్రువీకరించినట్లు ఇస్రో తెలిపింది.

”జాబిల్లి ఉపరితలంపై సల్ఫర్‌ ఎలా వచ్చింది..? అంతర్గతంగానే ఉందా? అగ్విపర్వతం లేదా ఉల్కల వల్లనా? వంటి అంశాలను పరిశోధించేందుకు తాజా శాస్త్రవేత్తలు అధ్యయనం చేయాల్సి ఉంది” అని ఇస్రో తెలిపింది. ఆల్ఫా పార్టికల్‌ ఎక్స్‌రే-స్పెక్ట్రోస్కోప్‌ చర్యను ప్రదర్శించే మనోహరమైన వీడియోను కూడా ఇస్రో పోస్టు చేసింది. 18 సెం.మీ ఎత్తులో ఉన్న ఈ క్లిష్టమైన పరికరం, చంద్రుని ఉపరితలం నుండి సుమారు 5 సెం.మీ దూరంలో దాని డిటెక్టర్‌ హెడ్‌ను సమలేఖనం చేయడానికి ఆటోమేటెడ్‌ కీలు యంత్రాంగాన్ని ఉపయోగిస్తుంది. ఈ సాంకేతికత చంద్రుని వంటి కనిష్ట వాతావరణంతో గ్రహాల శరీరాలపై నేల-రాళ్ల మూలక కూర్పు ఇన్‌సిటు విశ్లేషణను అనుమతిస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement