Saturday, May 11, 2024

Delhi | దేశంలో కొందరు మేథావులు.. ఇప్పటికీ బ్రిటిష్ మనస్తత్వానికి బానిసలు: కె.లక్ష్మణ్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: దేశంలో కొందరు మేథావులుగా చెప్పుకుంటూ బ్రిటిష్ మనస్తత్వానికి బానిసలుగా ఉంటారని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షులు, ఎంపీ డా. కే. లక్ష్మణ్ అన్నారు. దేశాన్ని దోచుకున్న మొఘలులు, బ్రిటీష్‌వారిని హీరోలుగా చిత్రీకరించిన మెకాలే విద్యావిధానాన్ని వారు సమర్థిస్తారని మండిపడ్డారు. గురువారం ఢిల్లీలోని ఫారిన్ కరెస్పాండెంట్స్ క్లబ్ (ఎఫ్‌సీసీ)లో ‘లేపాక్షి’ పేరుతో విజయనగర సామ్రాజ్య వైభవంపై జర్నలిస్ట్, రచయిత, చరిత్రకారులు అయిన మైనాస్వామి ఇంగ్లిషులో రచించిన పుస్తకాన్ని డా. లక్ష్మణ్ ఆవిష్కరించారు. ఎఫ్‌సీసీ ప్రెసిడెంట్ వెంకట నారాయణ, పద్మభూషణ్ రాజారెడ్డి సతీమణి కౌసల్యారెడ్డి, చరిత్రకారులు అజిత్ పాఠక్, జగన్నాథ్ జోడిదార్, ఎస్వీబీసీ డైరెక్టర్ వసంత కవిత, ఏపీ భవన్ మాజీ ఓఎస్డీ గణపతిరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన కుహానా మేథావుల తీరును తీవ్రంగా తప్పుబట్టారు. దేశంలో ఎంతో గొప్ప చారిత్రక, సాంస్కృతిక వైభవంతో పాటు ఎన్నో రంగాల్లో బాహ్య ప్రపంచం కంటే మెరుగైన విధానాలు అమల్లో ఉండేవని చెప్పుకొచ్చారు. అందులో విజయనగర సామ్రాజ్యం ఒకటని, శ్రీకృష్ణదేవరాయలు సహా ఆ సామ్రాజ్యంలో అనేక మంది రాజులు నిర్మించిన అద్భుత ఆలయాలు, కట్టడాలు నేటి ఆధునిక సమాజంలో కూడా సాధ్యం కావని అన్నారు. ఎలాంటి ఆధునిక పనిముట్లు, యంత్ర పరికరాలు లేని సమయంలో నిర్మించిన అద్భుత కట్టడాల గురించి లేపాక్షి పుస్తకంలో సవివరంగా పొందుపరిచారని పుస్తక రచయిత మైనాస్వామిని ప్రశంసించారు. కేవలం తెలుగు భాషలోనే కాకుండా, విజయనగర సామ్రాజ్య వైభవం గురించి యావత్ ప్రపంచానికి తెలిసేలా ఇంగ్లిష్‌లో కూడా పుస్తకాన్ని ముద్రించారని లక్ష్మణ్ తెలిపారు.

- Advertisement -

ఆ పుస్తకాన్ని తన చేతుల మీదుగా విడుదల చేయడం చాలా సంతోషంగా ఉందని డా. లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. ఈ పుస్తకం ద్వారా విజయనగర సామ్రాజ్య వైభవం, గొప్ప నిర్మాణ శైలి, నాటి సంస్కృతి, సంప్రదాయాల గురించి ప్రపంచానికి తెలుస్తుందని అన్నారు. ఈ పుస్తకంలోని అంశాలు పాఠ్యాంశాల్లో భాగంగా ఉండాలని ఆయన వ్యాఖ్యానించారు. ఎంతో గొప్ప సంస్కృతి, చారిత్రక వారసత్వం కలిగిన మన దేశంలో 2020లో ప్రధాన మంత్రి కొత్త విద్యావిధానాన్ని తీసుకొచ్చి గత వైభవాన్ని వెలుగులోకి తెస్తున్నారని, అలాగే కాశీ-తమిళ సంగమం వంటి కార్యక్రమాల ద్వారా విభిన్న సంస్కృుతుల, సంప్రదాయాలను కలిపే ప్రయత్నం చేస్తున్నారని డా. లక్ష్మణ్ అన్నారు. భారతీయ భాషలను ప్రోత్సహిస్తూ తీసుకొచ్చిన సరికొత్త విద్యా విధానాన్ని కుహానా మేథావులు విమర్శించడం సిగ్గుచేటు అన్నారు.

పుస్తక రచయిత మైనాస్వామి మాట్లాడుతూ.. విజయనగర సామ్రాజ్యంలో అద్భుత నిర్మాణాల గురించి వివరించారు. భారీ ఏకశిలా నంది విగ్రహం, వేలాడే స్తంభం సహా ఆసియాలోనే ఎక్కడా లేని కుడ్యచిత్రాలు వంటివి ఎన్నో ఉన్నాయని తెలిపారు. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదలో చోటుదక్కించుకున్న హంపిలోని కట్టడాల విశేషాల గురించి ఎంత చెప్పినా తక్కువేనని అన్నారు. కేవలం నిర్మాణాలు మాత్రమే కాదని, ఆనాటి సామాజిక, ఆర్థిక స్థితిగతులు, పాలనలో సంస్కరణలు సహా అనేకాంశాలను ఆయన తన పుస్తకంలో పొందుపరిచినట్టు చెప్పారు. లేపాక్షి ఆలయ నిర్మాణ శైలి, విజయనగర కళా వైభవం భారతీయ సంస్కృతికి అద్దం పడుతుందని కొనియాడారు. విజయనగర సామ్రాజ్య సాంస్కృతిక వైభవానికి ప్రతీక అయిన లేపాక్షి పుస్తకాన్ని మొదట తెలుగులో రాసినా, ప్రపంచవ్యాప్తంగా అందరూ లేపాక్షి గొప్పతనాన్ని తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఎన్నో వ్యయప్రయాసలకోర్చి ఇంగ్లిషులోనూ ఈ పుస్తకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చానని మైనాస్వామి వెల్లడించారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement