Friday, April 26, 2024

అమెరికాలో ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌.. కోట్లు కొల్లగొట్టిన తెలుగు టెకీలు

అగ్రరాజ్యం అమెరికాలోనే ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ పాల్పడ్డారు.. ఏకంగా కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. వారెవరో కాదు.. భారతీయ సంతతికి చెందిన తెలుగు టెకీలు.. దీంతో క్షేత్ర స్థాయిలో విచారించిన ఫెడరల్‌ అధికారులు.. ఏడుగురిపై అభియోగాలు నమోదు చేశారు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ద్వారా.. మిలియన్‌ డాలర్ల లాభం పొందినట్టు దర్యాప్తులో స్పష్టమైంది. అయితే విశేషం ఏమిటంటే.. ఈ మోసం రెండేళ్ల క్రితం జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ మిషన్‌ (ఎస్‌ఈసీ) అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. హరిప్రసాద్‌ సూరే (34), లోకేశ్‌ లగుడు (31), చోటు ప్రభుతేజ్‌ పులగం (29)లు స్నేహితులు. వీరంతా సాంకేతిక రంగంలో ఆరితేరిన వారు. శాన్‌ఫ్రాన్సికోకు చెందిన క్లౌడ్‌ కంప్యూటింగ్‌ కమ్యూనికేషన్‌ కంపెనీ ట్విలియోలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లుగా పని చేస్తున్నారు.

సన్నిహితులకు కంపెనీ కీలక సమాచారం..

ఈ ముగ్గురు తమ స్నేహితులకు తాము పని చేసే సంస్థ స్కీంల గురించి సమాచారం అందజేసి ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. హరిప్రసాద్‌ సూరే తన సన్నిహిత మిత్రుడు దిలీప్‌ కుమార్‌ రెడ్డి కామోజుల (35)కు, లోకేశ్‌ తన గర్ల్‌ ఫ్రెండ్‌ సాయి నెక్కలపూడి (30)కి, తన మాజీ రూమ్‌ మేట్‌ అభిషేక్‌ ధర్మపురికర్‌ (33)లకు, ప్రభు తేజ్‌ తన సోదరుడు చేతన్‌ ప్రభు (31)లకు సంస్థ నిబంధనలను ఉల్లంఘించి వ్యాపార రహస్యాలను అందజేశారని అభియోగాలు నమోదయ్యాయి. వీరంతా కాలిఫోర్నియాలోనే నివాసం ఉంటున్నారని ఎస్‌ఈసీ స్పష్టం చేసింది. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ద్వారా.. ఒక మిలియన్‌ డాలర్లకు పైగా ఆర్జించినట్టు ఎస్‌ఈసీ ఆరోపించింది. 2020, మే 6న ట్విలియో మొదటి త్రైమాసిక 2020 ఆదాయాల ప్రకటనకు ముందు ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ద్వారా ఒక్క మిలియన్‌ డాలర్ల కంటే ఎక్కువ సామూహిక లాభాలు పొందినందుకు ఏడుగురు వ్యక్తులపై ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ అభియోగాలను నమోదు చేశామని ఎస్‌ఈసీ ప్రకటించింది.

డేటాబేస్‌ యాక్సెస్‌ అధికారం..

ఎస్‌ఈసీ ఫిర్యాదు ప్రకారం.. హరిప్రసాద్‌ సూరే, లోకేశ్‌ లగుడు, చోటు ప్రభు పులగం టిలియో ఆదాయ రిపోర్టింగ్‌కు సంబంధించిన వివిధ డేటాబేస్‌ల యాక్సెస్‌ను కలిగి ఉన్నారు. మార్చి 2020 నాటికి కరోనా మహమ్మారి వ్యాప్తిలోకి వచ్చిన సమయంలో ఆరోగ్య చర్యలకు ప్రతిస్పందనగా టిలియో కస్టమర్లు తమ కంపెనీ ఉత్పత్తులు, సేవల వినియోగాన్ని పెంచారని డేటాబేస్‌ల ద్వారా తెలుసుకున్నారు. ట్విలియో స్టాక్‌ ధర కచ్చితంగా పెరుగుతుందని వీరి మధ్య ఉమ్మడి చాట్‌లో చర్చించుకున్నారు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ను నిషేధించే కంపెనీ పాలసీని ఉల్లంఘించి ఈ ముగ్గురూ వ్యాపారం చేయడానికి తన స్నేహితుల బ్రోకరేజ్‌ ఖాతాలను ఉపయోగించారని ఆరోపించారు. 2020, మే 6న ఆదాయాల ప్రకటనకు ముందే ఎంపికలు, స్టాక్‌ విషయంలో కస్టమర్‌ వినియోగానికి సంబంధించిన రహస్య సమాచారాన్ని సేకరించారని తెలిపంది. హరిప్రసాద్‌, లోకేశ్‌లు భారతీయ భాష తెలుగులో మాట్లాడుకున్నట్టు ఎస్‌ఈసీ పేర్కొంది.

- Advertisement -

తెలుగులోనే చాటింగ్‌.

మార్చి చివరి నుంచి మే 2020 ప్రారంభంలో అనేక సందర్భాల్లో టిలియో పబ్లిక్‌ ఎర్నింగ్స్‌ ప్రకటనకు ముందు హరిప్రసాద్‌ సూరే, లోకేశ్‌ లగుడు, తేజ్‌ ప్రభు పులగం.. టిలియో త్రైమాసిక ఆదాయ నివేదికలో మార్కెట్‌ అంచనాలను మించిపోతుందా.. లేదా.. అని తమ అంతర్గత చాటింగ్‌ సమయంలో తెలుగులో చర్చించుకున్నారని ఎస్‌ఈసీ వివరించింది. ఆర్థిక ఫలితాలను సానుకూలంగా వస్తాయని ముందే తెలియడంతో ట్విలియో ఆప్షన్లు, స్టాక్స్‌లో భారీ పెట్టుబడులు పెట్టారు. అనుకున్నట్టుగానే కంపెనీ షేర్లు అమాంతం ఎగిశాయి. ప్రధానంగా ఈ ఏడుగురిపై సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ అధికారులకు అనుమానం వచ్చింది. పెట్టుబడులు పెట్టిన వెంటనే భారీ లాభాలు పొందడంతో ఏడుగురికి మధ్య ఉన్న లింక్‌ను తెలుసుకున్నారు. వీరంతా ఒకరితో ఒకరు పరిచయం ఉన్నట్టు విచారణలో తేలింది. దీంతో తీగలాగితే డొంక కదిలినట్టు ఈ ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌ భాగోతం బయటపడింది. ఏడుగురు ఈ స్టాక్స్‌, ఆప్షన్ల విషయమై చర్చించేందుకు ఓ ప్రత్యేకంగా చాట్‌ ఛానల్‌ను తెరిచినట్టు నిరూపితమైంది. కమిషన్‌ ఫిర్యాదు మేరకు ఫెడరల్‌ అధికారులు వీరిపై అభియోగాలు నమోదు చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement