Thursday, May 2, 2024

వింబుల్డన్‌లో సానియాకు నిరాశ.. 21 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణానికి తెర

ప్రతిష్టాత్మక వింబుల్డన్‌ టెన్నిస్‌ టోర్నీ సెమీఫైనల్‌లో భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా ఓటమిపాలైంది. దీంతో సానియా కల చెదిరింది. ప్రతిష్టాత్మక వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నీస్‌ చాంపియన్‌షిప్‌లో మిక్స్‌డ్‌ డబుల్స్‌ విజేతగా నిలవాలన్న ఆమె కోరిక నెరవేరలేదు. మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో సెమీఫైనల్‌లో క్రొయేషియా ఆటగాడు మేట్‌ పావిచ్‌తో కలిసి బరిలోకి దిగిన సానియా అమెరికన్‌- బ్రిటిస్‌ జంట డెసిరే క్రాజిక్‌, నీల్‌ స్కుష్క్యీ చేతిలో 6-4, 5-7, 4-6తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో తొలి సెట్‌ను సులువుగా నెగ్గిన సానియా-పవిచ్‌ ద్వయం రెండో సెట్‌లో 2-0తో ఆధిక్యం సాధించి సులభంగా మ్యాచ్‌ గెలిచేలా కనిపించినా, తదుపరి ప్రత్యర్థి జోడీ దాటికి తట్టుకోలేక చేతులెత్తేసింది. ఈ ఓటమితో 21ఏళ్ల టెన్నీస్‌ సుదీర్ఘ ప్రయాణానికి సానియా ముగింపు పలికింది. ప్రతిష్టాత్మక వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నీస్‌ చాంపియన్‌షిప్‌లో మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ఒక్క మిక్స్‌డ్‌ డబుల్స్‌ టైటిల్‌ కూడా గెలవకుండానే కెరీర్‌కు ముగింపు పలకడం బాధాకరం.

ఈ ఏడాది ప్రారంభంలో ఆస్ట్రేలియా ఓపెన్‌లో తొలి రౌండ్‌లోనే ఓటమి పాలైన తర్వాత సానియా తన రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సీజన్‌ తర్వాత తాను రిటైరవుతున్నట్లు ఆమె వెల్లడించింది. 19ఏళ్ల వయసులోనే టెన్నిస్‌ రాకెట్‌ పట్టిన సానియామీర్జా… ఒక రకంగా భారత మహిళల టెన్నిస్‌కు ముఖచిత్రంగా ఉంది. 2001లో టెన్నిస్‌ రాకెట్‌ పట్టిన ఈ హైదరాబాదీ… కెరీర్‌ ఆరంభంలో సింగిల్స్‌లో మెరిసినా తర్వాత డబుల్స్‌కు పరిమితమైంది. సింగిల్స్‌లో 2007 మిడ్‌ సీజన్‌లో ఆమె ప్రపంచ మహిళల ర్యాంకింగ్స్‌లో 27వ స్థానానికి చేరింది. సింగిల్స్‌ కెరీర్‌లో ఆమెకు అదే ఉత్తమ ర్యాంకు. 2001లో కెరీర్‌ ప్రారంభించిన సానియా మీర్జా… మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో 2009 ఆస్ట్రేలియా ఓపెన్‌, 2012 ఫ్రెంచ్‌ ఓపెన్‌, 2014 యూఎస్‌ ఓపెన్‌ టైటిళ్లు గెలుచుకుంది. 2008, 2014, 2017 ఆస్ట్రేలియా ఓపెన్‌తోపాటు 2016 ఫ్రెంచ్‌ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచింది. మహిళల డబుల్స్‌ విభాగంలో మూడు గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు గెలుచుకుంది. 2011 ఫ్రెంచ్‌ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచిన సానియా… 2015 వింబుల్డన్‌, యూఎస్‌ ఓపెన్‌, 2016 ఆస్ట్రేలియా ఓపెన్‌లో డబుల్స్‌ టైటిళ్లు గెలిచింది. అయితే ఒక్క వింబుల్డన్‌ మిక్స్‌డ్‌ టైటిల్‌ మాత్రమే ఆమెకు ఇప్పటిదాకా అందలేదు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement