Thursday, April 25, 2024

ఏరోస్పేస్‌ వ్యాలీగా హైదరాబాద్‌.. రూ.1200 కోట్లతో పెట్టుబ‌డి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : హైదరాబాద్‌ నగరం దేశంలోనే ఉత్తమ ఏరోస్పేస్‌ వ్యాలీగా మారుతోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్న సాఫ్రాన్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ ఎమ్మార్వో(మెయింటెనెన్స్‌, రిపేర్‌, ఓవర్‌హాల్‌) ప్రపంచంలోనే అతి పెద్దదవుతుందని తెలిపారు. హైదరాబాద్‌ శంషాబాద్‌లో సాఫ్రాన్‌ ఏరో ఇంజిన్‌ ఫెసిలిటీని గురువారం మంత్రి ప్రారంభించారు. సాఫ్రాన్‌ రాకతో ఇక్కడ ఏవియేషన్‌కు అనుకూల ఎకోసిస్టం ఏర్పడి రాష్ట్రంలోకి మరిన్ని ఏరోస్పేస్‌ సంస్థలు వస్తాయన్న విశ్వాసాన్ని కేటీఆర్‌ వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పరిశ్రమ వర్గాలతో కలిసి ఏరోస్పేస్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఉన్నామని తెలిపారు. ప్రభుత్వం తరఫున అన్ని విధాలా సహకరిస్తామని కేటీఆర్‌ వెల్లడించారు. విమాన ఇంజిన్‌ల నిర్వహణ కేంద్రాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ ప్రాజెక్టుకు జాతీయంగా ఎంతో ప్రాధాన్యం ఉందన్నారు. సాఫ్రాన్‌ ప్రపంచంలోనే తన మూడో పెద్ద ప్రాజెక్టుగా శంషాబాద్‌ ఎమ్మార్వో ఫెసిలిటీని ప్రకటించడం సంతోషకరంగా ఉందన్నారు. తెలంగాణలో టీఎస్‌ ఐపాస్‌ పాలసీ ద్వారా మెగా ప్రాజెక్టులకు ప్రోత్సాహకాలు కల్పిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

35 భేటీలు, 400లకు పైగా మెయిల్స్‌…
హైదరాబాద్‌, ఢిల్లిd, ప్యారిస్‌లో 35 సమావేశాలు, 400లపైగా మెయిల్స్‌, నాలుగేళ్ల నిరంతర శ్రమ కారణంగానే రాష్ట్రంలో సాఫ్రాన్‌ సంస్థ భారీ పెట్టుబడులు సాధ్యమయ్యాయని వివరించారు. ఈ సంస్థ ద్వారా వచ్చే రూ.1200 కోట్ల పెట్టుబడులతో వెయ్యి మందికి ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు. హైదరాబాద్‌ ఏరోస్పేస్‌, ఏవియేషన్‌ ఎకోసిస్టం రోజురోజుకూ వృద్ధి చెందుతోందని హర్షం వ్యక్తం చేశారు. 2025లో ఎమార్వో పూర్తయితే ప్రపంచంలోనే అతి పెద్దదిగా నిలుస్తుందన్నారు. ఇది దేశానికే గర్వకారణంగా అభివర్ణించారు. హైదరాబాద్‌లో ఎమ్మార్వో ఏర్పాటు చేసి సాఫ్రాన్‌ సంస్థ పెట్టుడిదారులకు నమ్మకం కలిగించిందన్నారు. దక్షిణాసియాలోని చాలా విమాన రంగ సంస్థలు ఈ సౌకర్యాలను ఉపయోగించుకుంటాయని నమ్ముతున్నానన్నారు. ఏరోస్పేస్‌ రంగంలో ఈ పెట్టుబడులు చాలా మార్పులు తెస్తాయని భావిస్తున్నట్లు చెప్పారు. ఇది ఇతర విమాన, రక్షణరంగ సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి ఉపయోగపడుతుందన్నారు. హైదరాబాద్‌ ప్రపంచంలోనే ప్రత్యేక ఏవియేషన్‌ హబ్‌గా రూపొందిందన్నారు. ‘ఇక్కడున్న పెట్టుబడిదారులే రాష్ట్రానికి బ్రాండ్‌ అంబాసిడర్లని సీఎం కేసీఆర్‌ ఎప్పుడు చెబుతుంటారు. వారు సంతోషంగా ఉంటే వ్యాపారాన్ని విస్తరిస్తుంటారు. వారే రాష్ట్రంలో వ్యాపార అవకాశాలను ప్రపంచం నలుమూలలా చాటుతుంటారు. హైదరాబాద్‌లో వేలాది చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఏరోస్పేస్‌, ఏవియేషన్‌ రంగాలకు అనుసంధానమయ్యాయ’ని కేటీఆర్‌ వివరించారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌, సాఫ్రాన్‌ కంపెనీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

డిసెంబరుకల్లా శంషాబాద్‌ విమానాశ్రయ టెర్మినల్‌ విస్తరణ పూర్తి….
కేంద్ర పౌర విమానయాన శాఖ నుంచి హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నిరంతరం అవార్డులు పొందుతోందని తెలిపారు. జీఎమ్మార్‌ చేపట్టిన విమానాశ్రయ టెర్మినల్‌ విస్తరణ పనులు డిసెంబరు నెలాఖరు నాటికి పూర్తవుతాయని భావిస్తున్నట్లు చెప్పారు. పెరుగుతున్న ఎయిర్‌ ట్రాఫిక్‌కు అనుగుణంగా మరిన్ని టెర్మినల్స్‌ కూడా అవసరమవుతాయని అంచనా వేస్తున్నట్లు కేటీఆర్‌ తెలిపారు. హైదరాబాద్‌ నుంచి యూరప్‌, యూఎస్‌కు మరిన్ని డైరెక్ట్‌ ఫైట్లు నడుతామన్న హామీ నెరవేర్చాలని కేంద్ర పౌర విమానయాన శాఖను కేటీఆర్‌ కోరారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement