Friday, May 3, 2024

Delhi | మద్యం కేసులో బాబును ఇరికించడం దుర్మార్గం : కనకమేడల

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : మద్యం కేసులో చంద్రబాబు నాయుణ్ని ఏ3గా చేర్చడం దుర్మార్గమని టీడీపీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్ అన్నారు. ఆరోగ్య కారణాలరీత్యా బాబుకి మధ్యంతర బెయిల్ రావడం శుభ పరిణామమని సంతోషం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన న్యూఢిల్లీలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ వైసీపీ నాయకులకు బెయిల్ వస్తే న్యాయం గెలిచిందని, మా పార్టీ వారికి బెయిల్ వస్తే డబ్బులు ఖర్చు పెట్టారనడం సబబు కాదన్నారు.

- Advertisement -

దురుద్దేశపూరితంగా చంద్రబాబుపై కేసులు పెడుతున్నారని కనకమేడల ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసు అధికారులు తమ పరిధి దాటి వ్యవహరిస్తున్నారని, ఏపీలో పోలీస్ వ్యవస్థను వైఎస్సార్సీపీ అనుబంధ సంస్థగా మార్చేశారని విమర్శించారు. స్కిల్ కేసులో రూ. 371 కోట్ల అవినీతి ఆరోపణల కేసులో ఆధారాలు లేకుండా  53 రోజులు బాబును జైల్లో పెట్టారని మండిపడ్డారు. ఆరోపణలు నిరూపించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఇన్ని సంవత్సరాలు ఏం చేసిందని ప్రశ్నించారు.

శిక్షకు, జ్యుడిషియల్ రిమాండ్‌కు తేడా తెలియని వాళ్ళు మంత్రివర్గంలో, రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉండటానికి అనర్హులని రవీంద్రకుమార్ అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతూ న్యాయస్థానాల ఖర్చుల పేరుతో వందల కోట్లు ఖర్చు చేస్తోందని ఆరోపించారు. న్యాయవాదులకు, కేసులు పెట్టడానికి, అధికార దుర్వినియోగానికి వందల కోట్లు ఖర్చు పెడుతున్నారని ఆయన చెప్పుకొచ్చారు.

న్యాయవాదులకు పెడుతున్న ఖర్చులపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని కనకమేడల డిమాండ్ చేశారు. లిక్కర్ కేసులో వైఎస్సార్సీపీ నేతలకు సంబందం ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి కేంద్ర హోంమంత్రికి ఫిర్యాదు చేస్తే ఆమెపై వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డారని ఆయన గుర్తు చేశారు. వైఎస్సార్సీపీ నేతలు అనేక కుంభకోణాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement