Sunday, May 19, 2024

ఎస్‌పీ అధికారంలోకొస్తే అల్లర్లు ఖాయం, ఇంటింటి ప్రచారంలో అమిత్‌ షా

యూపీలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. సమాజ్‌వాదీ పార్టీ అధికారంలోకి వస్తే.. గతంలో ముజఫర్‌నగర్‌లో జరిగిన ఘర్షణలు మళ్లి జరుగుతాయని, ఆజం ఖాన్‌ మంత్రి అవుతాడని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా విమర్శించారు. అధికారం చేజిక్కించుకున్న తరువాత.. ఆర్‌ఎల్‌డీని దూరం పెడ్తాడని చెప్పుకొచ్చారు. శనివారం ఇంటింటి ప్రచారంలో అమిత్‌ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ముజఫర్‌ నగర్‌లో రైతులు అధికంగా ఉన్నారని, ఆలోచించి ఓటేయాలని సూచించారు. ముజఫర్‌నగర్‌లో జరిగిన ఘర్షణలను గుర్తు చేస్తూ.. బాధితులను దోషులుగా చేశారని, దోషులను బాధితులుగా చేశారని మండిపడ్డారు. పోలీసులు కూడా ఓటు బ్యాంకును దృష్టిలో పెట్టుకుని విచారణ చేపట్టిందని విమర్శించారు. వేలాది తప్పుడు కేసులు నమోదు చేశారని, ముజఫర్‌నగర్‌ బాధితుల తరఫున బీజేపీ ఎంతో పోరాడిందన్నారు. అఖిలేష్‌ యాదవ్‌ హయాంలోనే ఈ ఘోరం జరిగిందన్నారు. అతను మళ్లి సీఎం అయితే అవే పరిస్థితులు మళ్లి వస్తాయని ఆరోపించారు.

బీజేపీదే అధికారం
పశ్చిమ ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రజలను ఒకే ప్రశ్న అడిగేందుకు వచ్చానని షా అన్నారు. ముజఫర్‌నగర్‌ మారణ హోమం మరిచిపోయారా..? అని ప్రశ్నించారు. ఒకవేళ మరిచిపోకపోతే.. ఆలోచించి ఓటేయాలన్నారు. ఎస్‌పీకి ఓటేసి మళ్లి.. గతంలో చేసిన తప్పును మళ్లి చేయవద్దని సూచించారు. మరిచిపోయి ఎస్‌పీకి ఓటేస్తే.. మళ్లి దారుణమైన పరిస్థితులు వస్తాయని అన్నారు. బీజేపీ పాలనలో ఇప్పటి వరకు ముజఫర్‌నగర్‌లో ఎలాంటి ఘర్షణలు జరగలేవన్నారు. ఘర్షణలకు పాల్పడేవారు జైల్లో ఉన్నారని, గతంలో యూపీలో గూండాయిజం ఉండేదని, ఇప్పుడు చట్ట ప్రకారం పనులు జరుగుతున్నాయని తెలిపారు. అఖిలేష్‌ యాదవ్‌కు సిగ్గులేదన్నారు. ఇక్కడ చట్ట వ్యవస్థ సరిగ్గా లేదని అన్నారని, దమ్ముంటే.. అఖిలేష్‌ హయాంలో, యోగీ హయాంలో జరిగిన మార్పులను సంఖ్యాపరంగా చూసుకోవాలని సవాల్‌ విసిరారు. యూపీలో సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్‌ సమాజ్‌ పార్టీ అధికారంలోకి వస్తే.. మాఫియా రాజ్యం వస్తుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement