Friday, May 10, 2024

Big Story: ఓటు బ్యాంకుగానే మహిళలు.. పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో నో చాన్స్​..

మహిళా సాధికారత.. యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా పంజాబ్‌లో అన్నీ పార్టీలు ఎన్నికల కదన రంగంలో దూకాయి. ఈ రెండు అంశాలనే ఎక్కువగా ప్రచారం చేస్తున్నాయి. ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పిస్తూ ముందుకు వెళ్తున్నాయి. అయితే పంజాబ్‌లో మహిళా అభ్యర్థులకు మాత్రం ఏ పార్టీ కూడా సముచిత స్థానం కల్పించలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహిళలను ప్రసన్నం చేసుకునేందుకే పార్టీలన్నీ ప్రయత్నిస్తున్నాయి. కానీ వారికే టికెట్లు మాత్రం కేటాయించడంలో విఫలం అయ్యాయి. పంజాబ్‌లో 2.12 కోట్ల మహిళా ఓటర్లు ఉన్నారు. వారి సంఖ్య ఆధారంగా చూసుకుంటే.. మహిళా అభ్యర్థులు మాత్రం చాలా తక్కువ. పంజాబ్‌లో 117 అసెంబ్లిd స్థానాలు ఉన్నాయి. ఫిబ్రవరి 20న ఎన్నికలు జరుగుతాయి. దాదాపు అన్ని పార్టీలు.. అభ్యర్థులను ప్రకటించేశాయి. కానీ మహిళా అభ్యర్థులు మాత్రం చాలా తక్కువగా ఉన్నారు.

మాట తప్పిన కాంగ్రెస్‌
కాంగ్రెస్‌ కొన్ని రోజుల ముందు వరకు మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ.. ప్రచారం చేసింది. వారికే ఎక్కువ టికెట్లు కేటాయిస్తామని కూడా కాంగ్రెస్‌ ప్రకటించింది. అయితే ఆచరణలో మాత్రం అమలు కాలేదు. 10 శాతం సీట్లు కూడా కేటాయించలేదు. 109 మంది అభ్యర్థులను కాంగ్రెస్‌ ప్రకటించింది. ఇందులో కేవలం 11 మంది మహిళలు మాత్రమే ఉన్నారు. శిరోమణి అకాలీ దళ్‌, బహుజన్‌ సమాజ్‌ పార్టీలు కలిసి కూటమిగా ఏర్పాడ్డాయి. 117 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఇందులో కేవలం 5గురు మహిళా అభ్యర్థులే ఉన్నారు. ఇందులో నలుగురు అకాలీ దళ్‌ నుంచి ఉండగా.. మరొకరు బీఎస్‌పీ నుంచి బరిలో నిల్చున్నారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ 117 స్థానాల్లో 12 సీట్లు మాత్రమే మహిళలకు కేటాయించింది. బీజేపీతో పాటు కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ పార్టీ పంజాబ్‌ లోక్‌ కాంగ్రెస్‌ కూటమిగా ఉన్నాయి. 106 సీట్లకు అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో కేవలం 8 మంది మహిళలు మాత్రమే ఉన్నారు. అంటే.. 7.5 శాతం మాత్రమే..

హామీలు ఫుల్‌.. సీట్లు నిల్‌
మహిళా ఓటర్లను దృష్టిలో పెట్టుకుని.. అన్ని రాజకీయ పార్టీలు ఎన్నో హామీలు ఇచ్చింది. నెలకు రూ.2000, ఏడాదిలో 8 గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని కాంగ్రెస్‌ ప్రకటించింది. విద్యార్థులకు కూడా ఎన్నో హామీలు ఇచ్చింది. ఆప్‌ కూడా.. మహిళలను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నించింది. నెలకు రూ.1000 ఇచ్చేందుకు హామీ ఇచ్చింది. వృద్ధ మహిళలకు అదనంగా రూ.1000 ఇస్తామని ఆప్‌ తెలిపింది. అకాలీ దళ్‌, ప్రతీ మహిళకు రూ.2000 ఇచ్చేందుకు నిర్ణయించింది. ఉద్యోగాల్లో 50 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తామని వివరించింది. ఇలా ఎన్ని ప్రకటనలు చేసినా.. అభ్యర్థుల ఎంపికల్లో మాత్రం మహిళకు సముచిత స్థానం కల్పించలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement