Monday, April 29, 2024

ఐసీఐసీఐ బ్యాంక్‌ క్యు4 లాభం 7018కోట్లు… 59.4 శాతం పెరిగిన ప్రాఫిట్‌..

ప్రైవేట్‌ సెక్టార్‌లో అతిపెద్ద బ్యాంక్‌గా ఉంటోన్న ఇండస్ట్రియల్‌ క్రెడిట్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఐసీఐ) తన నాలుగో త్రైమాసికానికి సంబంధించిన ఆర్థిక ఫలితాలను శనివారం వెల్లడించింది.అంచనాలకు మించి రాణించింది. బ్యాంక్‌ నికర లాభాలు భారీగా పెరిగాయి. ఈ ఏడాది మార్చి 31వ తేదీనాటికి ముగిసిన గత ఆర్థిక సంవత్సరంలో 59.4 శాతం మేర నికర లాభాన్ని నమోదు చేసుకుంది. దీని విలువ రూ.7,018.70 కోట్లు ఉంటుందని తెలిపింది. వాస్తవానికి ఐసీఐసీఐ నాల్గో త్రైమాసికం ప్రివ్యూ అంచనాలు రూ.6,450 కోట్లుగా నమోదయ్యాయి. దీనికి మించి రాణించడం విశేషం. రూ.7,018.70 కోట్ల నెట్‌ ప్రాఫిట్‌ను ఆర్జించింది. అంతకుముందు సంవత్సరంలో ఐసీఐసీఐ బ్యాంక్‌ నికర లాభాలు రూ.4,403 కోట్లుగా ఉండింది. ఇక నికర వడ్డీ ఆదాయం కూడా 21 శాతం మేర పెరిగింది. రూ.12,605 కోట్లుగా నమోదైంది. గతేడాది క్యు4 కాలంలో ఇది రూ.10,431 కోట్లుగా ఉంది.

భారీగా పెరిగిన బ్యాంక్‌ అడ్వాన్స్‌లు..

నిరర్ధక ఆస్తుల విలువ కూడా స్వల్పంగా క్షీణించింది. 53 బేసిస్‌ పాయింట్లు అంటే.. 3.60 శాతం మేర తగ్గింది. గతేడాది క్యు4 కాలంలో నిరర్ధక ఆస్తుల విలువ 4.96 శాతంగా ఉండింది. నికర నిరర్ధక ఆస్తుల విలువ సైతం తగ్గింది. 0.76 శాతంతో తొమ్మిది బేసిస్‌ పాయింట్లు మేర క్షీణత నమోదైంది. గతేడాది క్యు4లో నికర నిరర్ధక ఆస్తుల విలువ 1.14 శాతంగా ఉండింది. నాల్గో త్రైమాసికంలో గ్రాస్‌ ఎన్‌పీఏ రూ.4,204 కోట్లుగా రికార్డయ్యింది. అక్టోబర్‌-నవంబర్‌-డిసెంబర్‌ మధ్య కాలంలో ఈ మొత్తం రూ.4,018 కోట్లుగా ఉండింది. బ్యాంక్‌ అడ్వాన్స్‌లు భారీగా పెరిగాయి. 17 శాతం వృద్ధి నమోదైంది. గ్రామీణ ప్రాంతాలకు ఇచ్చిన రుణాలను మినహాయించి.. రిటైల్‌ లోన్‌ పోర్ట్‌ ఫోలియోలో 20 శాతం పెరుగుదల కనిపించింది. ఐసీఐసీఐ బ్యాంక్‌ డిపాజిట్లపై 14 శాతం మేర పెరిగాయి. దీంతో రూ.10.64 లక్షల కోట్లు. మొత్తం టర్‌ ్మ డిపాజిట్లల్లో తొమ్మిది శాతం మేర పెరుగుదల నమోదైంది. దీని విలువ రూ.5.46 లక్షల కోట్లు. మొత్తంగా ఐసీఐసీఐ బ్యాంక్‌ గత ఆర్థిక సంవత్సరంలో మంచి పురోగతిని రికార్డు చేసింది. దీంతో తన షేర్‌ హోల్డర్లకు శుభవార్త వినిపించింది. ఒక్కో షేర్‌పై రూ.5 డివిడెంట్‌ను ప్రకటించింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై బోర్డు ఆఫ్‌ డైరెక్టర్లు ఆమోదం తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement