Monday, May 6, 2024

Followup | ఓ అద్భుతం చూశాను .. అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం కేసీఆర్‌ కే సాధ్యం: విజయేంద్ర ప్రసాద్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : అసాధ్యాలను సుసాధ్యం చేయడం.. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుకే సాధ్యమని రాజ్యసభ సభ్యుడు, ప్రసిద్ధ సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్‌ వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ తెలంగాణ సచివాలయాన్ని శుక్రవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, అతి తక్కువ సమయంలో ఇంత గొప్ప సచివాలయాన్ని నిర్మించడం అద్భుతమని హర్షం వ్యక్తం చేశారు.

వారసత్వం, సాంస్కృతిక వైభవం, ఆధునికతల కలబోతకు నిలువెత్తు నిదర్శనంగా సచివాలయం ఉందని ప్రశంసించారు. కేసీఆర్‌ పట్టుదల, అకుంఠిత దీక్షతో అద్భుతమైన దేవాలయాలను, ప్రజా నిర్మాణాలను విజయవంతంగా చేపడుతున్నారని కొనియాడారు. మనుషులు రుషులవుతారనే నానుడిని తెలంగాణ ముఖ్యమంత్రి నిజం చేస్తున్నారని విజయేంద్ర ప్రసాద్‌ పేర్కొన్నారు. తన కలంతో ప్రపంచం మెచ్చిన బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్‌ వంటి పాన్‌ వరల్డ్‌ సినిమాలను అందించిన విజయేంద్ర ప్రసాద్‌.. కేసీఆర్‌ నాయకత్వంపై హర్షం వ్యక్తం చేశారు.

పది నెలల సమయంలో 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహ నిర్మాణం, అంతకు మించిన ప్రజా సచివాలయాన్ని నిర్మించడం చాలా గొప్ప విషయమని అన్నారు. అసాధ్యాలను సుసాధ్యం చేయడం ముఖ్యమంత్రి కేసీఆర్‌కే సాధ్యమని ఆయన పదేపదే వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధిలో జెట్‌ స్పీడ్‌తో పరుగులు పెడుతోందన్నారు. ఈ అభివృద్ధి పట్ల తెలంగాణ బిడ్డగా చాలా సంతోషంగా ఉందంటూ విజయేంద్ర ప్రసాద్‌ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement