Monday, April 29, 2024

న‌టుడిని చిక్కుల్లో ప‌డేసిన హోంటూర్ వీడియో.. రూ.రెండు ల‌క్ష‌లు జ‌రిమానా

ఈ మ‌ధ్య కాలంలో హోంటూర్ అని..ఫ్రిజ్ టూర్ ల‌ని ఎక్కువ‌య్యాయి. కాగా హోం టూర్’ పేరుతో వీడియో తీసి.. దానిని సోషల్ మీడియాలో షేర్ చేసిన తమిళ నటుడు రోబో శంకర్ అందుకు త‌గిన మూల్యం చెల్లించుకున్నాడు. ఆ వీడియోలో చిలుకలు ఉండడం చూసిన అటవీశాఖ అధికారులు వెంటనే ఆయన ఇంటికి చేరుకుని చిలుకలను స్వాధీనం చేసుకున్నారు. నటుడికి చెన్నై సాలిగ్రామంలో ఇల్లు ఉంది. ‘హోం టూర్’ పేరుతో ఇంటిని వీడియో తీసిన శంకర్ దానిని సోషల్ మీడియాలో పెట్టాడు.
ఈ వీడియో బాగా వైరల్ అయింది. అదే ఆయనకు చిక్కులు తెచ్చిపెట్టింది. అలెంగ్జాండ్రిన్ పారాకీట్ అనే రెండు చిలుకలు పంజరంలో ఉండడాన్ని గుర్తించిన అటవీశాఖ అధికారులు వెంటనే నటుడి ఇంటికి చేరుకున్నారు.

వాటిని స్వాధీనం చేసుకుని గిండీలోని పార్కులో అప్పగించారు. ఆ సమయంలో రోబో శంకర్, ఆయన భార్య శ్రీలంకలో ఉండడంతో దర్యాప్తుకు హాజరు కావాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన అటవీశాఖ అధికారుల ఎదుట హాజరై వివరణ ఇచ్చుకున్నాడు. మూడేళ్ల క్రితం తన భార్య స్నేహితురాలు ఆ చిలుకలను తెచ్చి ఇవ్వడంతో పెంచుకుంటున్నామని, అయితే వాటిని పెంచుకునేందుకు అటవీశాఖ అనుమతి తీసుకోవాలన్న విషయం తనకు తెలియదని పేర్కొన్నాడు. తనను క్షమించాలని కోరాడు. దీంతో అధికారులు కేసు నమోదు చేయకుండా రెండున్నర లక్షల రూపాయల జరిమానా విధించి వదిలేయ‌డంతో కాస్త ఉప‌శ‌మ‌నం క‌లిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement