Monday, May 6, 2024

Highest runs | ప్ర‌పంచక‌ప్ లో సెంచ‌రీల మోత‌.. కోహ్లీని దాటేసిన రచిన్ రవీంద్ర

ఐసీసీ వన్డే ప్రపంచకప్ లో బ్యాటర్లు జోరు క‌న‌బ‌రుస్తున్నారు.. స్టార్ ప్లేయర్లు శతకాల మీద శతకాలు బాదుతున్నారు. అత్యధిక పరుగుల రికార్డును సాధించేందుకు బ్యాటర్ల మధ్య తీవ్ర పోటీ నెలకొని ఉంది. ఇక తన కెరీర్ లోనే తొలి వన్డే ప్రపంచకప్ ఆడుతున్న న్యూజిలాండ్ బ్యాటర్ రచిన్ రవీంద్ర అయితే అంచనాలకు మించి రాణిస్తున్నాడు. తాజాగా ఇవ్వాల (శ‌నివారం) ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో మరోసారి సెంచ‌రీతో (116 పరుగులు) చెలరేగిపోయాడు. ఈ టోర్నీలో ఇప్పటి వరకు 6 మ్యాచ్ లు ఆడిన రచిన్ రవీంద్ర 2 సెంచరీలు.. 2 అర్ధ సెంచరీలతో 406 పరుగులు చేశాడు.

ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీని దాటేసి ముంద‌డుగు వేశాడు ర‌చిన్ ర‌వీంద్ర‌. టోర్నీలో ఇప్పటి వరకు విరాట్ కోహ్లీ 5 మ్యాచ్ ల్లో 354 పరుగులు (ఒక సెంచరీ.. 3 అర్ధ సెంచరీలు) చేసి వన్డే ప్రపంచకప్ లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో కోహ్లీ 4వ స్థానంలో ఉండ‌గా.. ప్రస్తుతం కోహ్లీ అత్యధిక పరుగులు చేసిన జాబితాలో ఐదో స్థానానికి పడిపోయాడు.

ఇక‌, ఈ టోర్నీ లో మంచి ఫామ్ ను కొనసాగిస్తున్న‌ సౌతాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డికాక్ 6 మ్యాచ్ ల్లో 431 పరుగులతో తొలి స్థానంలో ఉన్నాడు. ఇందులో డికాక్ ఏకంగా మూడు సెంచరీలు చేయడం విశేషం. రెండో స్థానంలో ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఉన్నాడు. వార్నర్ 6 మ్యాచ్ ల్లో 413 పరుగులు చేశాడు. రచిన్ రవీంద్ర మూడో స్థానంలో ఉన్నాడు. నాలుగో స్థానంలో సౌతాఫ్రికా బ్యాటర్ ఎయిడెన్ మార్క్రమ్ (356 పరుగులు) ఉన్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement