Monday, May 6, 2024

జంతు వధ, అక్రమ రవాణాకు చెక్‌.. అమల్లోకి హైకోర్టు ఆదేశాలు

అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో పశు సంరక్షణకు పోలీ సు యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. జంతువుల అక్రమ రవాణా, గోవధకు చెక్‌ పెడుతూ హైకోర్టు ఆదేశాలను అమలు చేస్తోంది. నిబంధనలు ఉల్లంఘిస్తే ఇక కఠిన చర్యలు తప్పవని పోలీసుశాఖ హెచ్చరికలు జారీ చేసింది. జంతు సంరక్షణకు సంబంధించి ప్రత్యేక పర్యవేక్షకులుగా డిఎస్పీలు వ్యవహరించనున్నారు. ఇందుకోసం జిల్లాల వారీగా ప్రతి పోలీసు యూనిట్‌లో ఓ డిఎస్పీని నోడల్‌ అధికారిగా నియమించింది. జంతు హింస, రవాణాకు సంబంధించి ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు, సమాచారం ఎప్పటికప్పుడు సేకరించి వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకునేలా జిల్లాల ఎస్పీలు నోడల్‌ అధికారులకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. జంతు సంరక్షణకు సంబంధించి ప్రత్యేక చట్టం ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో అమలవుతోంది. ఉత్తర ప్రదేశ్‌ తదితర రాష్ట్రాల్లో జాతీయ భద్రత చట్టం కింద పరిగణించి అమలు చేయడం జరుగుతోంది. పశు సరంక్షణను విస్మరించి జీవ హింసకు పాల్పడే వారిపై ఈ చట్టం కింద కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతోంది.

ఈక్రమంలో మన రాష్ట్రంలో ఇటీవల కాలంలో జంతు వధ, అక్రమ రవాణాకు సంబంధించిన కేసులు అధికంగా నమోదవుతున్న నేపధ్యంలో జంతు ప్రేమికులు, గో సంరక్షకులు, వివిధ స్వచ్చంధ సంస్దలు జంతు వధ, అక్రమ రవాణా నిరోధక చట్టాన్ని కఠినంగా అమలు చేయాలంటూ కొద్దిరోజులుగా ఆందోళన కొనసాగిస్తున్నారు. వివిధ సందర్భాల్లో పలు వేదికల వద్ద గళం వినిపిస్తున్నారు. దీనిలో భాగంగా బక్రీద్‌ సందర్భంగా జంతు వధను, అక్రమ రవాణాను అడ్డుకునేందుకు తగిన చర్యలు తీసుకునేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ యానిమల్‌ రెస్క్యూ ఆర్గనైజేషన్‌తోపాటు మరో ఇద్దరు వ్యక్తిగతంగా కూడా హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేశారు.

కోర్టు ఆదేశాలు ఇలా..

- Advertisement -

జంతు వధ, అక్రమ రవాణాపై దాఖలైన పిల్‌ పై ఇటీవల జరిగిన హైకోర్టు విచారణలో ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. గోవధ నిరోధానికి ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని పోలీసులకు, గుంటూరు మునిసిపల్‌ కమిషనర్‌ను ఆదేశించింది. జంతు అక్రమ రవాణా, గోవధ నిషేధం విషయంలో చట్ట నిబంధనలను అధికారులు పట్టించుకోవడం లేదని, దీంతో యథేచ్ఛగా గోవధ జరుగుతోందని పిటిషనర్లు హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీంతో జంతు అక్రమ రవాణా, గోవధ నిరోధానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియచేయాలని గుంటూరు మునిసిపల్‌ కమిషనర్‌ను హైకోర్టు ఆదేశిస్తూ పూర్తి వివరాలు కోరింది.

జంతు వధ, అక్రమ రవాణాను నిరోధించేందుకు చట్టప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని, ప్రజల్లో అవగాహన కల్పించేందుకు, ఫిర్యాదులు చేసేందుకు వీలుగా నోడల్‌ అధికారులను నియమించాలని పోలీసుశాఖకు సూచించింది. ఈ ప్రక్రియను మూడురోజుల్లో పూర్తి చేయాలని నిర్దేశించింది. నోడల్‌ అధికారుల ఫోన్‌ నంబర్లను, జంతు సంక్షేమ బోర్డు మార్గదర్శకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళేలా చర్యలు తీసుకోవాలని న్యాయస్ధానం ఆదేశించింది.

నోడల్‌ అధికారుల నియామకం..

దీంతో నిర్ణీత సమయంలోగా ప్రక్రియ పూర్తి చేయాలన్న హైకోర్టు ఆదేశాలతో రాష్ట్ర పోలీసు యంత్రాంగం కదిలింది. జంతు వధ, అక్రమ రవాణా నిషేధ చట్టానికి పదును పెడుతూ కార్యాచరణకు సిద్ధమైంది. దీనిలో భాగంగా జిల్లాల ఎస్పీలు డిఎస్పీ స్ధాయి అధికారిని జిల్లాకో నోడల్‌ అధికారిగా నియమించారు. ఆంధ్ర ప్రదేశ్‌ నిషేదిత గోవధ, జంతుసంరక్షణ చట్టం-1977, జంతు రవాణా నిబంధల చట్టం-1970, జంతు రవాణా (సవరణ) నిబంధనలు-2001, జంతువధశాలలు నిబంధనలు- 2001 మేరకు ఎవరైనా జంతువుల అక్రమ రవాణ, వాటి వధ విషయంలో నిబంధనలను ఉల్లంఘిస్తే ఆయా చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్పీలు హెచ్చరించారు.

అదేవిధంగా జంతు రవాణా, వధకు పాల్పడినా, నిబంధనలు ఉల్లంఘించినా అందుకు సంబంధించిన సమాచారం నోడల్‌ అధికారి అయిన డిఎస్పీకి తెలియచేయాల ని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ప్రకటించారు. దీనిలో భాగంగా తిరుపతి జిల్లా నోడల్‌ అధికారిగా అదనపు ఎస్పీ కులశేఖర్‌, ఫోన్‌ నెం. 9491361257ను ఆ జిల్లా ఎస్పీ పరమేశ్వరన్‌ నియమించారు. ఏలూరు జిల్లా నోడల్‌ ఆఫీసర్‌ కె .ప్రభాకర్‌ రావు ఫోన్‌ నెంబర్‌ 919440404010ను జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి నియమించారు.

బాపట్ల జిల్లా నోడల్‌ ఆఫీసర్‌గా బాపట్ల డిఎస్పీ టి.వెంకటేశ్వర్లు 9440796165ని జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ నియమించారు. ఎన్‌.టి.ఆర్‌. జిల్లా విజయవాడ పోలీస్‌ కమిషనరేట్‌కు సంబంధించి నోడల్‌ అధికారిగా ఏసీపీ డా.కె.హనుమంతరావు ఫోన్‌ నెంబర్‌: 9440627090ను పోలీసు కమిషనర్‌ కాంతి రానా టాటా నియమించారు. అనకాపల్లి జిల్లా నోడల్‌ ఆఫీసర్‌గా అదనపు ఎస్పీ పి సత్యనారాయణరావు ఫోన్‌ నెంబర్‌ 9440904392ను జిల్లా ఎస్పీ మురళీకృష్ణ నియమించారు. ఈ క్రమంలోనే విశాఖతోపాటు అన్ని జిల్లాల ఎస్పీలు నోడల్‌ అధికారుల నియామకానికి చర్యలు చేపడుతున్నారు. తొలి ఏకాదశి, బక్రీద్‌ పర్వదినాలను పురస్కరించుకుని హైకోర్టు ఆదేశాలు కఠినంగా అమలు చేయడం జరుగుతుందని పోలీసు యంత్రాంగం స్పష్టం చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement