Sunday, May 12, 2024

గుప్తనిధుల వేటలో వెలుగు చూసిన అత్తర్‌ మహల్‌.. పురావ‌స్తుశాఖ‌ పరిశోధనలు షురూ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: గుప్తనిధుల అన్వేషణలో సుప్రసిద్ధ వారసత్వ కట్టడం వెలుగుచూసింది. హైదరాబాద్‌లో గతకొద్ది రోజులుగా గుప్తనిధుల అన్వేషణ జోరందుకుంది. అనేక ప్రాంతాల్లో తవ్వకాలు జరిపినట్లు ఆధారాలు లభ్యమవుతున్నాయి. ప్రధానంగా విష్ణుకుండిన ఏలుబడిలోని కీసర. హైదరాబాద్‌లో నిధుల అన్వేషణలో వాడిన గుణపాల దెబ్బలకు ప్రాచీన కట్టడాలు శిథిలమవుతున్నాయి. అయితే నిధుతే వివాదాలు, సంఘటనలు వెలుగుచూడటంతో అనేక రహస్య సొరంగమార్గాలు, ప్రాచీన వారసత్వ కట్టడాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఇలాంటి సంఘటన రాజేంద్రనగర్‌ పరిధిలోని అత్తాపూర్‌లో అనూహ్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ కట్టడం హైదరాబాద్‌ చరిత్ర అందాలకు మరిన్ని నగిషీలు దిద్దుతుంది. హైదరాబాద్‌లో అగుపించే అనేక ప్రాచీన కట్టడాలు నిజాం రాజుల (ఆసఫ్‌జాహీలు) కట్టడాలే.

అయితే అరుదుగా కుతుబ్‌ షాహీల చెక్కుచెదరని కట్టడం వెలుగుచూసింది. ఈ కట్టడంలోని సొరంగంలోకి కొంతమంది నిధుల అన్వేషణకు వెళ్లగా లోపల అతిపెద్ద నల్లత్రాచు పాము కనిపించడంతో బయటకు పరుగులు తీశారు. వీరిని తరుముతూ వచ్చిన పాము అక్కడి పొదల్లోకి వెళ్లింది. ఈ విషయం తెలుసుకున్న స్థానికుల ద్వారా ప్రచారంలోకి రావడంతో ప్రభుత్వం ఈ కట్టడం వైపు దృష్టి సారించంది. శుక్రవారం పూరావస్తు, జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ, హెచ్‌ఎండీసీ అధికారులు ఈ కట్టడాన్ని పరిశీలించారు. చెక్కుచెదరక ఉన్న ఈ కట్టడానికి కొద్దిపాటి మరమత్తులుచేసి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. అయితే పురావస్తు, ఎన్‌ఎండీసీ శాఖల ఆధ్వర్యంలో భూగర్భ పరిశోధనలు చేసి గుప్తనిధుల వివరాలను సేకరించేందుకుఏర్పాట్లు చేస్తున్నారు.

అయితే ఈ పరిశోధన గోప్యంగా చేయాలని అధికారులు ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం ఈ కట్టడం దగ్గరకు ఎవరీని అనుమతించకుండా భద్రతా ఏర్పాటు చేశారు. సుమారు ఆరు ఎకరాల స్థలంలో రెండు అంతస్తులుగా నిర్మించిన ఈ కట్టడాన్ని అత్తర్‌ మహల్‌గా పురావస్తు శాఖ గుర్తించింది. చరిత్రలో ఉన్న అత్తర్‌ మహల్‌ ఇదేనని తెలుస్తుంది. ఈ మహల్‌ను ముషక్‌ మహల్‌గా ఇప్పటికే స్థానికంగా పేరుంది. మహల్‌ లోపల అనేక గదులు, అంతపురం, నీటి బావి ఆనవాళ్లు, నాలుగువైపుల నుంచి భూగర్భ సొరంగాలు ఉన్నాయి. అయితే ఈ సొరంగాలు నాలుగు దిక్కుల్లో భూగర్భంలో నిర్మించిన రహస్య కట్టడానికి మార్గాలుగా భావిస్తున్నారు. నాలుగు సొరంగ మార్గాల పై పురావస్తు శాఖ పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి నివేదికను రూపొందించనుంది. అయితే అనేక సంవత్సరాల నుంచి జనావాసాల మధ్యలో ఉన్న ఈ కట్టడాన్ని వారసత్వ కట్టడాల జాబితాలో చేర్చారే కానీ అభివృద్ధి చేయకపోవడంతో పరిసరాల్లోని విలువైన చారిత్రకఆనవాళ్లు ఉన్న భూములు కబ్జాలకు గురయ్యాయి.

- Advertisement -

వారసత్వసంపంద గుర్తులను,ఆనవాళ్లను చెెరిపివేయవద్దనీ, వాటిని పరిరక్షించాలని రాజ్యంగంలోని ఆర్టికల్‌ 21వ నిబంధన చెపుతున్నా అమల్లో జరుగుతున్న జాప్యానికి ఇలాంటి అరుదైన కట్టడాలు కనుమరుగు అవుతున్నాయి. చార్మినార్‌ నిర్మాణం అనంతరం 16వ శతాబ్దంలో నవాబ్‌ మిషామిష్క్‌ ఈ మహల్‌ను నిర్మించినట్లు ఆధారాలు లభ్యం అవుతున్నాయి. టర్కీ రాజవంశానికి చెందిన మిషామిష్క్‌ అంతర్జాతీయ స్థాయిలో ఆనాడు సుగంధద్రవ్యాలు, అత్తర్‌ వ్యాపారం చేసేవారు. ఈ కట్టడం నిర్మాణంలో అత్తర్‌ వాడటంతో అత్తర్‌ మహాల్‌ పేరు వచ్చిందని పురావస్తు అధికారులు చెప్పుతున్నారు.

అత్తర్‌తో పునాదుల నిర్మాణాలు..

దక్కన్‌ హెరిటేజ్‌ ట్రస్టు మేనేజింగ్‌ ట్రస్టీ మహ్మద్‌ షఫీ ఉల్లా మాట్లాడుతూ అబ్దుల్లా కుతుబ్‌ షాహీ కాలం నిర్మించిన ఈ మహల్‌ ఎంతో అరుదైన కట్టడమని చెప్పారు. కస్తూరి మృగాలు, కృష్ణ జింకల నుంచి సుగంధ ద్రావ్యాలకు సంబంధించినవి పునాదిలో వేసి ఈ కట్టడాన్ని నిర్మించారనీ, అలాగే అత్యంత విలువైన అత్తర్‌ను మహల్‌ నిర్మాణంలో వాడటంతో కిలోమీటర్ల పరిధిలో సుగంధ పరిమళాలు వెదజల్లేదని చెప్పారు. అయితే ఈ అరుదైన కట్టడాన్ని కాపాడాలని అనేక పర్యాయాలు దక్కన్‌ హెరిటేజ్‌ ట్రస్టు కోరినా ఫలితం లేదని విచారం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ కట్టడాన్ని పరిరక్షిస్తే గొప్ప పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement