Monday, May 6, 2024

మధ్య తరగతి ప్రజలకు తీపి కబురే.. వంట నూనె.. ధరలు తగ్గుతాయ్‌..!

ముడి పామాయిల్‌ ధరలు తగ్గనున్నాయి. ఆ దిశగా కేంద్రం నిర్ణయం తీసుకుంది. దిగుమతిపై 5శాతం సుంకం తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. గత కొన్ని రోజులుగా వంట నూనెల ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పేద ప్రజలకు సుంకం తగ్గింపు కొంత ఊరట ఇచ్చే అంశంగా మారింది. తాజాగా దిగుమతి చేసుకున్న ముడి పామాయిల్‌పై వ్యవసాయ మౌలిక సదుపాయాలు, అభివృద్ధి సెస్‌ను కేంద్ర ప్రభుత్వం మరింత తగ్గించింది. గత అక్టోబర్‌లో ఎడిబుల్‌ ఆయిల్‌లపై ప్రకటించిన కస్టమ్స్‌ డ్యూటీ, సెస్‌ రిలీఫ్‌ను సెప్టెంబర్‌, 2022 చివరి వరకు పొడగించింది. ఈ నిర్ణయంతో.. దేశ వ్యాప్తంగా వంట నూనె ధరలు నియంత్రించడంతో పాటు దేశీయ ప్రాసెసింగ్‌ కంపెనీలకు మద్దతు ఇస్తోందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

కంది పప్పుపై నో దిగుమతి సెస్‌..

సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇన్‌ డైరెక్ట్‌ ట్యాక్సెస్‌ కస్టమ్స్‌ (సీబీఐసీ) నుంచి అధికారిక ఉత్తర్వు ప్రకారం.. గత అక్టోబర్‌లో ప్రకటించిన ప్రాథమిక కస్టమ్స్‌ డ్యూటీ రిలీఫ్‌ 2022 మార్చి చివరి నాటికి ముగుస్తుంది. అయితే దాన్ని పొడగించింది. ఇప్పుడు ఇది సెప్టెంబర్‌ వరకు అందుబాటులో ఉంటుంది. దిగుమతి చేసుకున్న ముడి పామాయిల్‌పై వ్యవసాయ మౌలిక సదుపాయాలు, అభివృద్ది సెస్‌ను 20 శాతం నుంచి 7.5 శాతానికి తగ్గించారు. ఆదివారం నుంచి 5 శాతానికి తగ్గించారు. కందిపప్పు దిగుమతిపై సెస్‌ ఉండదు. డిసెంబర్‌లో నివేదించిన నూనెల విషయంలో సంవత్సరానికి 24 శాతం పైగా ద్రవ్యోల్బణం నేపథ్యంలో.. ఎడిబుల్‌ ఆయిల్స్‌పై సుంకం రాయితీని పొడగించడం, పామాయిల్‌ దిగుమతులపై వ్యవసాయ సెస్‌ను తగ్గించడం జరిగింది. గత డిసెంబర్‌లో మొత్తం వినియోగదారుల ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం 5.59 శాతం ఉంది. నవంబర్‌లో 4.91 శాతంతో పోలిస్తే.. ఎక్కువగా ఉంది.

రిటైల్‌ వినియోగదారులకు ఊరట..

క్రూడ్‌ పామాయిల్‌, క్రూడ్‌ సోయాబీన్‌ ఆయిల్‌, క్రూడ్‌ సన్‌ ఫ్లవర్‌ సీడ్‌ ఆయిల్‌పై గతేడాది ప్రకటించిన ప్రాథమిక కస్టమ్స్‌ డ్యూటీ రిలీఫ్‌ 2.5 శాతం నుంచి సున్నాకు చేసిన తగ్గింపు, ఇప్పుడు సెప్టెంబర్‌ వరకు కొనసాగుతుంది. ప్రభుత్వం డిసెంబర్‌లో శుద్ధి చేసిన పామాయిల్‌, దాని భిన్నాలపై ప్రాథమిక కస్టమ్స్‌ సుంకాన్ని 17.5 శాతం నుంచి 12.5 శాతానికి తగ్గించింది. ఇది కూడా సెప్టెంబర్‌ చివరి వరకు కొనసాగుతుంది. ముడి సోయా బీన్‌ నూనె, ముడి పొద్దు తిరుగుడు నూనె రెండింటిపై వ్యవసాయ సెస్‌పై ఊరట 20 శాతం నుంచి 5 శాతం వరకు తగ్గింపు ఇచ్చింది. ఇది సెప్టెంబర్‌ చివరి వరకు అమల్లో ఉంటుంది. ఈ చర్య దేశీయ రిటైల్‌ ధరలను తగ్గించి వినియోగదారులకు ఉపశమనాన్ని కలిగిస్తుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఎడిబుల్‌ ఆయిల్‌ ధరలు అధికంగా ఉంటే దేశీయ వంట నూనెల ధరలపై గణనీయమైన ప్రభావం చూపుతాయి.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement