Monday, April 29, 2024

వైమానిక దళం ఘనత.. కార్గిల్‌ ఎయిర్‌స్ట్రిప్‌లో వాయుసేన బాహుబలి

పర్వత ప్రాంతాల్లో యుద్ధం చేయడంలో ఆరితేరిన భారత వాయుసేన ఇప్పుడు కొత్త సామర్థ్యాన్ని సంతరించుకుంది. 8,800 అడుగుల ఎత్తులో హిమాలయ పర్వతాలపై ఉన్న జమ్ముకశ్మీర్‌లోని కార్గిల్‌ ఎయిర్‌స్ట్రిప్‌పై రాత్రి వేళ సీ-130జే విమానాన్ని ల్యాండ్‌ చేసింది. అత్యంత కఠినమైన వాతావరణం ఉండే కార్గిల్‌ పర్వత ప్రాంతాల్లో ఒకవైపు దట్టంగా మంచుతో ఏమీ కనిపించని పరిస్థితి, మరోవైపు కొండ ప్రాంతాల వంటి సవాళ్లను ఐఏఎఫ్‌ పైలట్లు అధిగమించారు. సీ-130జే విమానాన్ని రాత్రి వేళ కార్గిల్‌ ఎయిర్‌స్ట్రిప్‌లో చరిత్రాత్మకంగా ల్యాండింగ్‌ చేశారు.

ఇక్కడి చిన్న రన్‌వేపై సీ-130జే విమానాన్ని విజయవంతంగా దింపింది. హిమాలయ పర్వత సానువుల్లో సాధారణంగా పగటిపూట కూడా వాతావరణం ఏమాత్రం అనుకూలించదు. అలాంటిది, రాత్రివేత ఒక భారీ విమానాన్ని ల్యాండింగ్‌ చేయడం పైలెట్ల నైపుణ్యానికి, తెగువకు పరీక్ష అని చెప్పాలి. ఇప్పుడీ ఘనతను భారత వాయుసేన పైలెట్లు సాధించారు. గరుడ్‌ కమాండో ట్రైనింగ్‌లో భాగంగా ఈ నైట్‌ ల్యాండింగ్‌ చేపట్టారు. వైమానిక దళానికి ఇది చారిత్రాత్మక విజయంగా పరిగణించబడుతుంది.

కాగా, ఆదివారం తెల్లవారుజామున ఈ విన్యాసం నిర్వహించినట్లు భారత వైమానిక దళం (ఐఏఎఫ్‌) తెలిపింది. సవాళ్లతో కూడిన వాతావరణం, ఎత్తైన కొండ ప్రాంతాలు వంటి పరిస్థితుల్లో టెర్రైన్‌ మాస్కింగ్‌ టెక్నిక్‌ల ద్వారా ఐఏఎఫ్‌ సామర్థ్యాలను ప్రదర్శించినట్లు పేర్కొంది. కార్గిల్‌ ఎయిర్‌స్ట్రిప్‌లో నైట్‌ ల్యాండింగ్‌ మిషన్‌తో మరో మైలురాయిని సాధించినట్లు వెల్లడించింది. ‘ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ (ఐఏఎఫ్‌)కు చెందిన సీ-130జే విమానం తొలిసారి కార్గిల్‌ ఎయిర్‌స్ట్రిప్‌లో రాత్రి పూట ల్యాండ్‌ అయ్యింది. గార్డ్స్‌కు శిక్షణ కూడా ఈ మిషన్‌ కూడుకున్నది’ అని ఎక్స్‌లో పోస్ట్‌ చేసింది. ఈ మిషన్‌కు సంబంధించిన వీడియో క్లిప్‌ను ఐఏఎఫ్‌ షేర్‌ చేసింది. ఈ సైనిక విమానానికి నాలుగు టర్బోప్రాప్‌ ఇంజిన్లు ఉంటాయి. గరుడ్‌ కమాండోల శిక్షణలో భాగంగా ఈ విన్యాసం చేసింది. టెర్రైన్‌ మాస్కింగ్‌ను ఉపయోగించినట్లు వెల్లడించింది.

ఇటీవల ఉత్తరాఖండ్‌లో కార్మికులు సొరంగంలో చిక్కుకుపోయిన సందర్భంగా కూడా సీ-130జే రవాణా విమానాలను భారత వాయుసేన స్థానిక ఎయిర్‌ స్ట్రిప్‌పై ల్యాండింగ్‌ చేసింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో సైతం ఈ కార్గో విమానాలు సేవలు అందించగలవు. వాయుసేన మొత్తం 12 సి-130జే విమానాలను వాడుతోంది. ఇవి హిండన్‌లోని 77 స్క్వాడ్రన్‌, 87 స్క్వాడ్రన్‌లో విధులు నిర్వహిస్తున్నాయి. బలగాలు, సామగ్రి తరలింపులో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. చైనాతో వాస్తవాధీన రేఖ వద్ద మోహరింపుల్లో ఇవే కీలకం.

Advertisement

తాజా వార్తలు

Advertisement