Friday, May 3, 2024

Karimnagar – సమాజంలో మార్పు కోసం న్యాయవాదులు కృషి చేయాలి – జస్టిస్ ఇ.వి వేణుగోపాల్

క‌రీంన‌గ‌ర్ – సమాజంలో అభివృద్ధి, మార్పు కోసం న్యాయవాదులు కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఇవి వేణుగోపాల్ అన్నారు. ఆదివారం కరీంనగర్ లో ‘జస్టిస్ కుమారయ్య కాలేజీ ఆఫ్ లా’ లో చదివి న్యాయవాదులైన వారు ఏర్పాటు చేసుకున్న ‘ ఆత్మీయ సమ్మేళనం’ నకు ఆయన ముఖ్య అతిథిగా హాజరైనారు. ఈ సందర్భంగా వేణు గోపాల్ మాట్లాడుతూ న్యాయవాద వృత్తిని ఎంచుకొని స్థిరపడాలని అనుకునే వారు ప్రతి సవాళ్లు ఎదుర్కోవాలని పేర్కొన్నారు. న్యాయవాద వృత్తిలోని అనుభవాన్ని గడించుకుంటూ ముందుకు సాగాలని అన్నారు.

న్యాయవాదులు అణగారిన వర్గాల అభివృద్ధికి, సమాజ చైతన్యానికి తమవంతుగా చేయూతను అందించాలని కోరారు. దేశం కొరకు, రాష్ట్రం కొరకు, ప్రజల అభివృద్ధికి త్యాగం చేసిన మహనీయుల జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోని ముందుకు వెళ్లాలని తెలిపారు. న్యాయవాదిగా సామాజిక న్యాయదృక్పథంతో పాటుపడుతూ, సమాజ హితం కోసం పాటు పడాలని చెప్పారు. ప్రజలకు సత్వర న్యాయం చేకూర్చే బాధ్యత న్యాయవాదులపై ఉంటుందని, న్యాయవ్యవస్థపై విశ్వాసం కోల్పోతే ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదమని ఆయన అన్నారు. న్యాయవాదులందరు ఐకమత్యంతో ఉంటేనే సమాజంలో మార్పు, అభివృద్ధి చాలా సులువుగా జరుగుతుందని అన్నారు.

ప్రసంగo అనంతరం జస్టిస్ వేణుగోపాల్ చేతుల మీదుగా న్యాయవాదులకు జ్ఞాపికలను బహుకరించారు. ఈ కార్యక్రమంలో జస్టిస్ కుమారయ్యా కాలేజ్ ఆఫ్ లా ప్రిన్సిపల్, కరస్పాండెంట్ డా. కే. జలజ, డైరెక్టర్ జి కృష్ణ ప్రసాద్, ఆత్మీయ సమ్మేళన కన్వీనర్ న్యాయవాది ఏ. కిరణ్ కుమార్, సీనియర్ న్యాయవాది ఏ.వి.రమణ, డిఎల్ఎస్ఎ జడ్జి కే. వెంకటేష్, న్యాయవాదులు గుండా భవాని, పొన్నం రజిత, మంతెన సురేష్ కుమార్ లు గాదం స్వామి తేజ, బొంకూరి మోహన్, బండారు గాయత్రి దేవి, యండి. నావజ్, పత్తి శివ ప్రసాద్, వంకాయల రాజ్ కుమార్, అట్ల ధీరజ్, సావుల రాజమౌళి, ఆడెపు దినేష్, అతికం రాజశేఖర్ గౌడ్, ఎన్నం మమత, తడూరి స్వాతి, బత్తిని స్వప్న తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement