Thursday, May 2, 2024

నయా ఓటర్లపై నజర్‌.. యువతే భవిష్యత్‌ బలం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : అధికార భారాస పార్టీ మరోసారి గెలుపు దిశగా అడుగులు వేస్తోంది. అన్ని వర్గాలను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఆత్మీయ సమ్మేళనాలతో పార్టీలో జోష్‌ను నింపింది. అన్ని కులాలకు పెద్ద పీట వేసేలా పదవులు, పార్టీ గుర్తింపులను ఇస్తూ ముందుకు వెళ్తోంది. ఇప్పటి వరకు సబ్బండ వర్గాల వారిని ఆకట్టుకునే ప్రయత్నాన్ని చేస్తూ వస్తోంది. కానీ కొత్తగా చేరిన ఓటర్లు, యువకులను ఆకట్టుకునేందుకు గత రెండు సీజన్‌లలో ఎలాంటి పెద్ద కార్యక్రమాలను చేపట్టలేదు. కానీ ఈ పదేళ్లలో కొత్తగా చేరిన యువత చేజారకుండా కాపాడుకునేందుకు పక్కా ప్లాన్‌తో ముందుకు వెళ్తోంది.

ప్రధానంగా యూత్‌ ఏ విషయాల్లో పార్టీకి అండగా నిలుస్తారో తెలుసుకున్న అధిష్టానం ఆయా అంశాలను అస్త్రంగా చేసుకుంది. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో గేమ్స్‌ను నిర్వహిస్తోంది. ముఖ్యంగా యూత్‌ ఎక్కువగా ఆసక్తిని చూపించే గేమ్స్‌ ఆడేంచే ఆట షురూ చేసింది. దాదాపు అన్ని మండలాలు, జిల్లాలు, రాష్ట్ర స్థాయి వరకు సీఎం కప్‌ పోటీలను ఏర్పాటు చేసింది. పండగలా ఈ గేమ్స్‌ను జరిపించడమే కాకుండా యువత బీఆర్‌ఎస్‌ వైపు ఉన్నారన్న ప్రచారాన్ని చేస్తోంది. వారి సేవలను పార్టీకి ఉపయోగడేలా చూస్తోంది. భవిష్యత్‌ తరం వారే అన్న భావనతో బీఆర్‌ఎస్‌ ముందుకు వెళ్తోంది.

- Advertisement -

కారుకు కలిసిరానున్న ఆటలు..

గ్రామ స్థాయి నుంచే యువత పార్టీకి అండగా నిలిచేలా గులాబీ అధినేత వ్యూహాలను సిద్ధం చేశారు. యూత్‌లో ఉడుకు రక్తం ప్రతిపక్షాల చేతికి చిక్కకుండా జాగ్రత్త పడుతున్నారు. రాజకీయాలు ఇంట్రెస్ట్‌ ఉన్న వారే కాకుండా లేని వారు కూడా బీజేపీ, కాంగ్రెస్‌ వైపు చూపు మళ్లకుండా ప్రయత్నిస్తున్నారు. కొత్త ఓటర్లు ప్రచారం నిర్వహించడం దగ్గర నుంచి పార్టీల్లో చురుగ్గా తిరిగుతుంటారు. వారిని కారులో తిప్పేందుకు ఇప్పటికే గ్రామస్థాయిలో ఆ ప్రయత్నాలు ఫలించాయి. కొన్ని చోట్ల ఇప్పుడిప్పుడే యువత గులాబీ వైపు మళ్లేందుకు చూస్తున్నారు.

సీఎం కప్‌ గేమ్స్‌తో ఇప్పుడూ పూర్తిగా భారాస వైపు వచ్చేలా చేసే అవకాశాలున్నాయి. ప్రధానంగా పార్టీ, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం యువతకు అండగా ఉంటుందని చాటి చెప్పే ప్రయత్నాన్ని చేస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలైనా పార్టీకి ఎంతో ఉపయోగపడతాయన్న భావనలో గులాబీ లీడర్లు ఉన్నారు. యువతకు ఎమ్మెల్యేలు దగ్గరయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. త్వరలోనే ఎన్నికలు రానుండటంతో ఈ సీఎం కప్‌ గేమ్స్‌ కలిసి వచ్చే అవకాశం ఉన్నట్లు పార్టీలో చర్చ సాగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement