Monday, April 29, 2024

సికింద్రాబాద్‌-తిరుపతి వందేభారత్‌ రైలుకు విశేష స్పందన.. అదనంగా మరో 8 కోచ్‌లు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : సికింద్రాబాద్‌-తిరుపతి మధ్య నడుస్తున్న వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు కోచ్‌ల సంఖ్య పెరగనుంది. ఈ రైలుకు ప్రయాణికుల నుంచి వస్తున్న విశేష స్పందన దృష్ట్యా బుధవారం నుంచి అదనంగా మరో 8 కోచ్‌లను ఏర్పాటు చేయనున్నారు. దీంతో ఈ రైలు కోచ్‌ల సంఖ్య 16కు చేరుకోనుండగా, 530గా ఉన్న సీట్ల సంఖ్య అదనపు కోచ్‌ల ఏర్పాటుతో 1128కి చేరనుంది. దీంతో పాటు సికింద్రాబాద్‌-తిరుపతి, తిరుపతి-సికింద్రాబాద్‌ మధ్య రెండు వైపులా ప్రయాణ సమయం కూడా 15 నిమిషాల వరకు తగ్గనుంది. ప్రస్తుతం ఈ రైలు 8-30 గంటల వ్యవధిలో గమ్యస్థానం చేరుకుంటుండగా, బుధవారం నుంచి 8-15 నిమిషాలకే చేరుకోనుంది.

కాగా, ప్రతీ రోజూ వందలాది మంది భక్తులు హైదరాబాద్‌ నుంచి తిరుపతి పుణ్యక్షేత్రాన్ని సందర్శించేందుకు తరలి వెళతారు.దీంతో తిరుపతికి వెళ్లే అన్ని రైళ్లకు విపరీతమైన డిమాండ్‌ ఉంది. గత నెల 8న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సికింద్రాబాద్‌ స్టేషన్‌ నుంచి వందేభారత్‌ రైలును ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి వంద శాతానికి పైగా ఆక్యుపెన్సీతో నడుస్తోంది. అయితే, కోచ్‌లు, సీట్లు పరిమితంగా ఉన్న కారణంగా చాలా మంది వందేభారత్‌ రైలులో ప్రయాణించలేకపోతున్నారు. వందేభారత్‌ రైలును ప్రారంభించినప్పుడు ఎగ్జిక్యూటివ్‌ క్లాస్‌తో పాటు 7 చైర్‌ కార్లు మాత్రమే ఉన్నాయి.

ఇప్పటి వరకు ఈ రైలులో మొత్తం 44,922 మంది ప్రయాణించినట్లు ద.మ.రైల్వే అధికారులు పేర్కొంటున్నారు. సికింద్రాబాద్‌ నుంచి తిరుపతికి 21,798 మంది, తిరుపతి నుంచి సికింద్రాబాద్‌కు 23194 మంది ప్రయాణించారు. కాగా, బుధవారం నుంచి కొత్తగా అందుబాటులోకి రానున్న 16 కోచ్‌లలో 14 చైర్‌కార్‌లు ఉంటాయనీ, వీటిలో 1024 మంది ప్రయాణం చేస్తారని ద.మ.రైల్వే జీఎం అరుణ్‌ కుమార్‌ జైన్‌ వెల్లడించారు. దీంతో ప్రయాణికుల సంఖ్య 1128కి పెరగనుందనీ, కోచ్‌ల సంఖ్యను పెంచడం వల్ల ఎక్కువ మంది ప్రయాణం చేయగలుగుతారని పేర్కొన్నారు. ప్రస్తుతం వేసవి సెలవుల దృష్ట్యా ప్రయాణికుల డిమాండ్‌ కూడా ఎక్కవగానే ఉందని ఈ సందర్భంగా జైన్‌ వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement