Saturday, May 25, 2024

అప్పుల ఊబిలో దేశం, కేంద్ర వైఖరిపై ధ్వజం.. లోక్‌సభలో చర్చలో పాల్గొన్న ఎంపీ నామా

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : తెలంగాణ ప్రభుత్వం కొత్త ఆస్తులను సృష్టిస్తుంటే కేంద్రం మాత్రం ఉన్న ఆస్తులను తెగనమ్మి దేశాన్ని అప్పుల ఊబిలోకి నెడుతోందని టీఆర్ఎస్ లోక్‌సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. ధరల పెరుగుదల అంశంపై సోమవారం లోక్‌సభలో జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. తీసుకున్న రుణాలతో తెలంగాణ ప్రభుత్వం సాగునీ టి ప్రాజెక్టులు, పవర్ ప్లాంట్లు, తాగునీటి ప్రాజెక్టులు చేపట్టి ప్రజా శ్రేయస్సుకు పాటు పడుతున్నామన్నారు. తెలంగాణ ప్రభుత్వ లావాదేవీలన్నీ ఆర్బీఐ నిబంధనల ప్రకారమే జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు. తెలంగాణ ఒక్క రూపాయి కూడా డీఫాల్ట్ లేదని స్పష్టం చేశారు. 2014లో దేశం అప్పులు రూ.56 లక్షల కోట్లు ఉంటే ఇప్పుడది వంద లక్షల కోట్లకు పెరిగిందని వివరించారు. ఈ అప్పుతో ఎలాంటి సాగునీటి ప్రాజెక్టులు కొత్తగా కట్టిందో, ఏఏ ప్రాజెక్టులు కొత్తగా చేపట్టిందో ప్రజలకు తెలపాలని డిమాండ్ చేశారు. ఈ ఎనిమిదేళ్లలో దేశంలో నిత్యావసర వస్తువులు, పెట్రో ఉత్పత్తుల ధరలు గణనీయంగా పెరిగాయని అన్నారు. ధరల పెరుగుదల వల్ల పేదలు మరింత పేదలుగా మారుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు.

నిత్యావసర సరుకులు, పెట్రో గ్యాస్ ధరలు ఎడాపెడా పెంచారని, నేడు గ్యాస్ సిలెండర్ ధర రూ .1100 దాటడంతో పేదలు ఉక్కిరిబిక్కిరవుతున్నారని ఎంపీ నామా ఆందోళన వ్యక్తం చేశారు. ఆఖరికి రోగులు తినే బ్రెడ్, పాలు, పాల పదార్థాలు, పిల్లలు వాడే పెన్సిల్, రబ్బర్ వంటి వాటిని కూడా వదలకుండా పన్నులు వేయడం శోచనీయమన్నారు. పెట్రో, డీజిల్, ఎరువుల ధరలు పెరగడంతో దేశానికి వెన్నెముక అయిన రైతులపై భారం పడుతోందని వాపోయారు. ఎకరాకు పెట్టుబడి ఖర్చు రూ. 2 వేలకు పైగా పెరిగిందని పేర్కొన్నారు. చేనేతపై పన్ను పెంచడం వల్ల నేతన్నలు మరిన్ని కష్టాల్లో కూరుకుపోతున్నారని నామా నాగేశ్వరరావు చెప్పుకొచ్చారు.

ప్రపంచవ్యాప్తంగా గోధుమ, బియ్యం ఉత్పత్తి తగ్గినా తెలంగాణలో వంద శాతం ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగిందని ఆయన వివరించారు. వరి ఉత్పత్తి ప్రపంచవ్యాప్తంగా 0.5 శాతం తగ్గిందని ఎంపీ వివరించారు. కానీ దేశంలో బియ్యం ఉత్పత్తి వంద శాతం పెరిగిందని, అది కూడా తెలంగాణ రాష్ట్రం నుంచే పెరిగిందని తెలిపారు. వంద శాతం బియ్యం ఉత్పత్తి పెరిగినా దాన్ని కేంద్రం కొనడం లేదని ఆయన ఆరోపించారు. రైతుల నుంచి బియ్యం కొనకపోవడం వల్లే తెలంగాణ రైతులు ఆవేదన చెందుతున్నారని నామా సభ దృష్టికి తీసుకొచ్చారు. సంసద్ ఆదర్శ్ యోజనకి సంబంధించి తెలంగాణ పల్లెలు సత్తా చాటుతున్నాయని అన్నారు. తెలంగాణ పల్లెలే టాప్ టెన్‌లో ఆదర్శంగా నిలిచాయని హర్షం వ్యక్తం చేశారు. టాప్ 20లో కూడా 19 గ్రామాలు తెలంగాణ నుంచే ఉన్నాయని చెప్పారు. నిత్యావసర వస్తువుల ధరలు తగ్గిస్తే తాము కూడా చప్పట్లు కొట్టి స్వాగతిస్తామని నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement