Sunday, May 5, 2024

Delhi | మణిపూర్ హింసపై వాస్తవాలు చెప్పాలి.. పార్లమెంట్‌లో బీఆర్‌ఎస్ వాయిదా తీర్మానం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : మణిపూర్ హింసపై వాస్తవాలను వెల్లడించాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ ఎంపీలు పార్లమెంట్‌లో వాయిదా తీర్మానం ఇచ్చారు. గురువారం సమావేశాలు ప్రారంభమయ్యాక రాజ్యసభలో పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు, ఇటు లోక్‌సభలో లోక్‌సభా పక్ష నేత నామ నాగేశ్వరరావు వాయిదా తీర్మానాలు ఇచ్చి మణిపూర్ దారుణకాండపై చర్చ జరపాలని పట్టుబట్టారు. బీఆర్‌ఎస్ ఎంపీలంతా పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ నామ మాట్లాడుతూ మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి, కొందరు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడడం అమానవీయమన్నారు.

కేంద్రప్రభుత్వ చేతగానితనం వల్లే మణిపూర్ రావణకాష్టంలా మండుతోందని, మృత్యుఘోష కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల గౌరవాన్ని కాపాడడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ఆయన ధ్వజమెత్తారు. ఇంత జరుగుతున్నా ప్రధాని నరేంద్రమోదీ ఎందుకు పట్టించుకోవడంలేదని నామ ప్రశ్నించారు. మణిపూర్ అల్లర్లు, ఉ ద్రిక్తలు, తాజా ఘటనలపై పార్లమెంట్‌లో చర్చించాలని డిమాండ్ చేశారు. మణిపూర్ మహిళల ఘటనను సుప్రీంకోర్టు కూడా తీవ్రంగా పరిగణించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కానీ నేరస్తులపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో సభకు వివరించాల్సిన బాధ్యత ప్రధానిపై ఉందన్నారు.
మణిపూర్ అంశాన్ని చర్చించాలని ముందే బీఆర్ఎస్ పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చినా చర్చించకుండా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌ను ఉద్దేశపూర్వకంగానే శుక్రవారానికి వాయిదా వేసి తప్పించుకుందని నామ నాగేశ్వరరావు మండిపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement