Tuesday, May 7, 2024

ఆషాఢ‌ మాస బోనాలకు విస్త్రతంగా ఏర్పాట్లు.. 30న గోల్కొండలో ప్రారంభం..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పే రీతిలో ఈ ఏడాది ఆషాడ మాసం బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈనెల 30వ తేదీ నుంచి బోనాలు ప్రారంభం కానున్నాయి. బోనాల నిర్వణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.15 కోట్ల నిధులను కేటాయించింది. బోనాల నిర్వహణ ఏర్పాట్లకు సంబంధించి సోమవారం హైదరాబాద్‌లోని ఎంసిహెచ్‌ఆర్డీలో పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్ష జరిగింది. ఈ సమావేశంలో హోంమంత్రి మహముద్‌ అలీ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌ రెడ్డి, హైదరాబాద్‌ నగర మేయర్‌ విజయలక్ష్మి, ప్రభుత్వ విప్‌ ప్రభాకర్‌, హైదరాబాద్‌ నగరానికి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఆయా ఆలయ కమిటీల సభ్యులు, పోలీసు అధికారులతో పాటు పలు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బోనాలకు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్‌ మార్గదర్శకంలో బోనాల పండుగను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని ఆయన గుర్తు చేశారు. గత రెండేళ్ళుగా కరోనా కారణంగా బోనాలను ఘనంగా నిర్వహించలేదని చెప్పారు. ఈ సంవత్సరం సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు బోనాల పండుగను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని, దీనిలో భాగంగా రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆధ్వర్యంలోని మూడు వేలకు పైగా దేవాలయాలకు రూ.15 కోట్లు ఆర్ధిక సాయం అందజేస్తున్నామని ఆయన తెలిపారు. ఈనెల 30 నుంచి గోల్కొండలో బోనాలు ప్రారంభమవుతాయని, జూలై 17న సికింద్రాబాద్‌ మహాంకాళీ బోనాలు, 24న హైదరాబాద్‌ బోనాలను నిర్వహిస్తామన్నారు. ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా బోనాల ఉత్సవాలను జరుపుకునేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున సుమారు 26 ఆలయాల్లోని అమ్మవార్లకు పట్టువస్త్రాలను సమర్పిస్తామన్నారు.

అలాగే అమ్మవారి ఊరేగింపు కోసం అంబారీలను ఏర్పాటు చేసి ప్రభుత్వమే పూర్తి ఖర్చును భరిస్తుందన్నారు. భక్తుల సౌకర్యార్ధం పలు ప్రాంతాల్లో ఎల్‌ఈడి స్క్రీన్‌లు, త్రీడీ మ్యాపింగ్‌లు ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు. పలు ఆలయాల్లో తెలంగాణ సంప్రదాయ సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తాన్నారు. ప్రశాంత వాతావరణంలో బోనాలు జరిగేలా పోలీసు బందోబస్తు, సీసీ కెమెరాల నిఘా పెడతామన్నారు. హైదరాబాద్‌ పరిధిలో రహదారుల మరమ్మతులు, దేవాలయాల పరిసరాలలో పారిశుద్ధ్య కార్యక్రమాలను చేపడతామన్నారు. వైద్యఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరాలు, అంబులెన్స్‌లను అందుబాటులో ఉండాలే చర్యలు తీసుకుంటామని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ వెల్లడించారుల‌

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement