Friday, May 3, 2024

కోటి మెట్రిక్‌ టన్నుల దిగుబడి అంచనా.. ప్రతి వడ్ల గింజను కొనేలా సీఎం కేసీఆర్​ ప్లాన్​

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఈ వానాకాలంలో పండిన ప్రతి ధాన్యం గింజను రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ ప్రకటించారు. రెండు, మూడు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు చేపడతామని, అందుకు అవసరమైన నిధులను సీఎం కేసీఆర్‌ ఇప్పటికే సమకూర్చారని తెలిపారు. వానాకాలం ధాన్యం సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఈ విషయమై ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. కోటి మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనాల్సి ఉందని తెలిపారు. దాదాపు 7100కు పైగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, అవసరమైతే మరో వంద వరకు ఏర్పాటు చేసుకునేందుకు కలెక్టర్లకు అధికారం కల్పించామన్నారు. ఈ ఖరీఫ్‌లో ధాన్యం కొనుగోళ్లకు 25కోట్ల గన్నీ బ్యాగులు అవసరం ఉండగా… ఇప్పటికే 14 కోట్ల గన్నీ బ్యాగులను సేకరించామన్నారు. కొనుగోలు కేంద్రాలకు అవసరమైన తేమ మిషన్లు, పాడీ క్లీనర్లు, టార్పాలిన్‌లు తదితర సామాగ్రి అందుబాటులో ఉందన్నారు.

రాబోయే రెండున్నర నెలలు ధాన్యం కొనుగోళ్లపై పౌరసరఫరాల శాఖ నిరంతరం అప్రమత్తంగా ఉంటుందని, ఎక్కడ ఎలాంటి అవసరమున్నా తక్షణం స్పందించే విధంగా యంత్రాంగాన్ని సిద్ధం చేశామన్నారు. చరిత్రలో తొలిసారి అత్యధిక ధాన్యం కొనుగోలు చేసిన రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుందని తెలిపారు. తెలంగాణ రాకముందు 2200 కొనుగోలు కేంద్రాలు మాత్రమే ఉండేవని, ఉమ్మడి రాష్ట్రంలో కేవలం 25లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేసేవారని గుర్తు చేశారు. రైతుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం పూర్తిస్థాయిలో ధాన్యాన్ని కొనుగోలు చేస్తోందన్నారు. వానాకాలం పంట ఎఫ్‌సీఐకి అందజేస్తామన్నారు. తాలు సమస్య రాకుండా ఆరిన ధాన్యాన్ని మూడు రోజుల తర్వాత రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement