Sunday, May 5, 2024

దీపావళి వేడుకల్లో అపశృతి.. సరోజినిదేవి కంటి ఆస్పత్రికి క్యూకట్టిన బాధితులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : దీపావళి వేడుకల్లో రాష్ట్రంలో పలు చోట్ల అపశృతులు చోటు చేసుకున్నాయి. బాణసంచా కాలుస్తూ పలువురు చిన్నారులు గాయపడ్డారు. హైదరాబాద్‌లోని ఉస్మానియా, సరోజిని దేవీ , గాంధీ తదితర ఆసుపత్రుల్లో కనీసం 10మంది చొప్పున బాధితులు చేరారు. ఒక్క సరోజిని దేవీ కంటి ఆసుపత్రికే దాదాపు 50దాకా టపాసులతో గాయపడిన పేషెంట్లు వచ్చారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. టపాసులు కాలుస్తున్న సమయంలో అయిన గాయాలతో ఆసుపత్రుల్లో చేరిన వారిలో చిన్నారులే ఎక్కువగా ఉన్నారని వైద్యులు చెబుతున్నారు. గాయపడిన వారిలో చాలా మందిని అడ్మిట్‌ చేసుకుని చికిత్స అందించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. సరోజిని దేవీ కంటి ఆసుపత్రిలో నలుగురికి ఆపరేషన్‌ చేయాల్సి వచ్చిందని ఆసుపత్రి సూపరిండెంట్‌ తెలిపారు.

చికిత్స పొందుతున్న వారిలో అయిదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో ఎక్కువ మంది చిన్నారులే ఉండడం ఆందోళన కలిగిస్తోంది. దీపావళి వేడుకల్లో గాయపడిన వారికి చికిత్స అందించేందుకు సరోజిని దేవీ కంటి ఆసుపత్రి ప్రత్యేక వైద్య బృందాలను ఏర్పాటు చేసింది. ఉస్మానియా ఆసుపత్రిలోనూ దీపావళి బాణసంచా కాలుస్తూ గాయపడిన వారు పదుల సంఖ్యలో చేరారు. బాణా సాంచా కాల్చే సమయంలో జాగ్రత్తలను విస్మరించడం మూలాన్నే గాయాలపాలై పెద్ద సంఖ్యలో పేషెంట్లు ఆసుపత్రిలో చేరుతున్నారని వైద్యులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement