Thursday, May 9, 2024

ఏఐసీసీ అధ్యక్షుడిగా 26న ఖర్గే ప్రమాణ స్వీకారం.. హాజరుకానున్న గాంధీ పరివారం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన మల్లికార్జున ఖర్గే నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. న్యూఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఉదయం గం. 10.30 కు జరగనున్న ఈ కార్యక్రమానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రా హాజరవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి. ‘భారత్ జోడో’ యాత్రలో ఉన్న రాహుల్ గాంధీ 3 రోజుల విరామం తీసుకుని ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న విషయం తెలిసిందే. ఏఐసీసీ అధ్యక్ష బాధ్యతలను గాంధీ కుటుంబేతర వ్యక్తికి అప్పగించే కీలక ఘట్టానికి హాజరవడం కోసం రాహుల్ గాంధీ యాత్రకు తాత్కాలిక విరామం ప్రకటించినట్టు తెలిసింది.

గాంధీ పరివారంతో పాటు కాంగ్రెస్ పార్టీలో అత్యున్నత నిర్ణయాత్మక విభాగం ‘కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ’ (సీడబ్ల్యూసీ) సభ్యులు, పీసీసీ అధ్యక్షులు, వర్కింగ్ ప్రెసిడెంట్లు, సీఎల్పీ నేతలు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఖర్గే ప్రమాణస్వీకారోత్సవానికి హాజరుకానున్నారు. ఈ మేరకు వారందరికీ ఇప్పటికే ఏఐసీసీ నుంచి ఆహ్వనాలు అందాయి. కొందరు మంగళవారం సాయంత్రానికే ఢిల్లీ చేరుకోగా, మరికొందరు బుధవారం ఉదయం చేరుకోనున్నారు.

24 ఏళ్ల తర్వాత గాంధీ-నెహ్రూయేతర కుటుంబం నుంచి కాంగ్రెస్ అధ్యక్షులుగా ఎన్నిక మల్లికార్జున ఖర్గే 1942 జులై 21న కర్నాటకలోని బీదర్ జిల్లా వరవట్టి గ్రామంలో ఓ నిరుపేద దళిత కుటుంబంలో జన్మించారు. బీఏ, లా చదివిన ఖర్గే కొంతకాలం లాయర్ గా ప్రాక్టీస్ చేశారు. విద్యార్థి దశ నుంచే స్టూడెంట్ యూనియన్ లీడర్‌గా పేరు తెచ్చుకున్నారు. 1969లో కాంగ్రెస్‌‌లో చేరిన ఆయన 1972లో తొలిసారిగా గుర్మిట్కల్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆపై వరుసగా 9 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1976లో తొలిసారి మంత్రి అయ్యారు.

- Advertisement -

2005 నుంచి 2008 వరకు కర్నాటక పీసీసీ చీఫ్గా బాధ్యతలు చేపట్టారు. మూడు సార్లు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాన్ని కోల్పోయినా సరే ఆయన గాంధీ కుటుంబానికి నమ్మిన బంటుగానే కొనసాగారు. 2009లో గుల్బర్గా నుంచి ఎంపీగా గెలిచారు. మన్మోహన్ కేబినెట్లో కేంద్రంలో కార్మిక శాఖ, రైల్వే శాఖ, న్యాయ శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2014లో లోక్ సభలో ప్రతిపక్ష నేతగా నియమితులయ్యారు. ఓటమి ఎరుగని నాయకుడిగా పేరున్న ఖర్గే 2019లో తొలిసారిగా (గుల్బర్గా ఎంపీ సీటులో) ఓడిపోయారు.

2021 ఫిబ్రవరిలో ఆయనను కాంగ్రెస్ రాజ్యసభకు నామినేట్ చేసింది. అప్పటి నుంచి ఆయన రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్నారు. తాజాగా ఈ నెల 17న జరిగిన కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోలైన 9,385 ఓట్లలో 7,897 ఓట్లు పొంది ఘన విజయం సాధించారు. ఆయనపై పోటీ చేసిన శశి థరూర్ కేవలం 1,072 ఓట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో మల్లికార్జున ఖర్గే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రమాణస్వీకారం కోసం ఏఐసీసీ కార్యాలయం చేరుకునే ముందు ఆయన బుధవారం ఉదయం గం. 8.00కు రాజ్‌ఘాట్‌లోని మహాత్ముడి సమాధి వద్ద నివాళులు అర్పించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement