Friday, April 26, 2024

ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలి : కర్నూలు కలెక్టర్ కోటేశ్వర రావు

కర్నూలు : కడప – అనంతపురం – కర్నూలు పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు, కర్నూలు లోకల్ అథారిటీస్ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు ఎన్నికల నియమావళిని ఖచ్చితంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు ఎన్నికల నోడల్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కడప-అనంతపురం-కర్నూలు పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, కర్నూలు లోకల్ అథారిటీస్ ఎన్నికల పటిష్ట నిర్వహణపై జాయింట్ కలెక్టర్ ఎస్.రామ్ సుందర్ రెడ్డితో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు నోడల్ అధికారులను నియమించామన్నారు. శాంతి భద్రతలు, ఎన్నికల నియమావళి అమలు, మ్యాన్ పవర్ మేనేజ్మెంట్, ఎన్నికల సిబ్బందికి శిక్షణ, పోలింగ్ మెటీరియల్, బ్యాలెట్ పేపర్ మేనేజ్మెంట్, బ్యాలెట్ బాక్స్ ల సేకరణ, ఎక్స్పెండిచర్ మానిటరింగ్, స్ట్రాంగ్ రూమ్స్, కౌంటింగ్ సెంటర్స్, మైక్రో అబ్జర్వర్ ల నియామకం తదితర అంశాలకు సంబంధించి నోడల్ అధికారులు నిర్దేశించిన విధంగా ప్రణాళికా బద్ధంగా విధులు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. ఎన్నికల నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించారు.

పోలింగ్ స్టేషన్ల వివరాలు..
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి 74 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. ఫిబ్రవరి 7 వ తేదీ నాటికి 61 వేల 684 మంది ఓటర్లు ఉన్నారన్నారు. అలాగే టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి 27 పోలింగ్ స్టేషన్ లు ఏర్పాటు చేయడం జరిగిందని, ఫిబ్రవరి 7వ తేదీ నాటికి 5 వేల 364 మంది ఓటర్లు ఉన్నారన్నారు. కర్నూలు లోకల్ అథారిటీస్ కు సంబంధించి కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని ఆరు ఆర్డీవో కార్యాలయాల్లో పోలింగ్ స్టేషన్ లను ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్ వివరించారు. జాయింట్ కలెక్టర్ రామ సుందర్ రెడ్డి మాట్లాడుతూ… ఎన్నికల నియమావళి పక్కాగా అమలు పరిచేందుకు , ఫ్లయింగ్ స్క్వాడ్, స్టాటిక్ సర్వెలెన్స్ టీమ్స్, జోనల్, సెక్టోరల్ అధికారులను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పోలింగ్ కేంద్రాలలో సర్వే సిబ్బంది సహకారంతో ఎంట్రీ, ఎగ్జిట్ మార్కింగ్ చేయించాలని, కాంపౌండ్ వాల్, వెంటిలేషన్, త్రాగు నీరు, ర్యాంప్ తదితర మౌలిక వసతులు ఉండేలా చూడాలన్నారు. అలాగే ప్రభుత్వ కార్యాలయాల నుండి సిబ్బంది వివరాలు తెప్పించుకొని ఎన్నికల విధులు కేటాయించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టరేట్ ఏఓను కలెక్టర్ ఆదేశించారు. పోలింగ్ సరళిపై సిబ్బందికి మాస్టర్ ట్రైనర్ల ద్వారా శిక్షణ ఇప్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. స్ట్రాంగ్ రూము, డిస్ట్రిబ్యూషన్ సెంటర్, రిసెప్షన్ కౌంటర్లు, ఎన్నికల ప్రక్రియకు సంబంధించి పోలింగ్ మెటీరియల్, బ్యాలెట్ పేపర్ ల ప్రింటింగ్, బ్యాలెట్ బాక్స్ లు అన్నీ సిద్ధం చేసుకోవాలని సూచించారు.

కలెక్టరేట్ సిబ్బందితో ఎన్నికల నిర్వహణ పై సమావేశం
అనంతరం కలెక్టరేట్ సెక్షన్ సూపరింటెండెంట్ లు, ఇతర సిబ్బందితో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ సమావేశం అయ్యారు. ఎన్నికల విధుల నిర్వహణపై సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు. సమావేశంలో కర్నూలు డిఆర్ఓ నాగేశ్వర రావు, నంద్యాల డీఆర్ఓ పుల్లయ్య, నంద్యాల, కర్నూలు జిల్లాల ఆర్డీవోలు, నోడల్ అధికారులు జిల్లా పరిషత్ సిఈఓ నాసర రెడ్డి, డ్వామా పిడి అమర్నాథ్ రెడ్డి, డిపిఓ నాగరాజు నాయుడు, పంచాయతీ రాజ్ ఎస్ఈ సుబ్రమణ్యం, మల్లిఖార్జునుడు, ఎస్డిసి రమ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement