Monday, April 29, 2024

డబుల్‌ డెక్కర్‌ బస్సులు మరింత ఆలస్యం.. టెండర్ల ప్రక్రియ పూర్తయినా రోడ్డెక్కని బస్సులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న జనాభాను తట్టుకునేందుకు టీఎస్‌ ఆర్టీసీ ప్రారంభించ తలపెట్టిన డబుల్‌ డెక్కర్‌ బస్సులు మరింత ఆలస్యం కానున్నాయి. నగర ప్రయాణికులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ బస్సులు రోడ్డెక్కడానికి మరో రెండు మూడు నెలల సమయం పట్టే అవకాశం ఉంది. ఈ బస్సులను గత ఏడాదే ప్రయోగాత్మకంగా నగరంలోని పటాన్‌చెరు-కోఠి, జీడిమెట్ల-సీబీఎస్‌, అఫ్జల్‌గంజ్‌-మెహిదీపట్నం వంటి ప్రధాన రూట్లలో నడపాలని ఆర్టీసీ ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసింది. అయితే, గతంలో 25 డబుల్‌ డెక్కర్‌ బస్సులు అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేసినప్పటికీ టెండర్ల ప్రక్రియకు ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు.

దీంతో ఆ బస్సుల సంఖ్యను 10కి తగ్గించారు. ఆర్టీసీకి రోజురోజుకు గుదిబండగా తయారవుతున్న డీజిల్‌ భారం నుంచి బయటపడేందుకు 550 ఎలక్ట్ర్రిక్‌ బస్సులతో పాటు 10 డబుల్‌ డెక్కర్‌ బస్సులకు కూడా టెండర్లు ఆహ్వానించింది. ఈ టెండర్లను ముంబైకి చెందిన ఓ సంస్థ దక్కించుకుంది. టెండర్‌ నిబంధనల ప్రకారం ఈ నెలలోనే ఆ సంస్థ టీఎస్‌ ఆర్టీసీకి డబుల్‌ డెక్కర్‌ బస్సులు అప్పగించాల్సి ఉన్నప్పటికీ ఆ బస్సులు ఇంకా తయారీ దశలోనే ఉన్నట్లు సమాచారం. దీంతో టీఎస్‌ ఆర్టీసీ అధికారులు తయారీ ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి బస్సులను అప్పగించాలని సంస్థ యాజమాన్యానికి స్పష్టం చేసినట్లు తెలిసింది.

- Advertisement -

ఇదిలా ఉండగా, హెచ్‌ఎండిఏ కూడా గత జనవరిలో కాలుష్యరహిత ఎలక్ట్రిక్‌ బస్సులను ప్రారంభించింది. ఖైరతాబాద్‌ నక్లెస్‌రోడ్‌లో ఈ రేస్‌ సందర్భంగా, మరో మూడు బస్సులను నగరంలోని పర్యాటక ప్రాంతాలకు కొద్ది రోజులు నడిపించారు. హైదరాబాద్‌ అందాలు, చారిత్రక కట్టడాలను వీక్షించేందుకు పర్యాటకులకు అవకాశం కల్పిస్తూ ప్రారంభించిన ఈ బస్సులను కొద్ది రోజులు మాత్రమే నడిపి హెచ్‌ఎండిఏ కూడా నిలిపివేసింది. అయితే, ఈ బస్సులకు సైతం ఆశించిన స్థాయిలో ప్రయాణికులు లేకపోవడంతో అవి కూడా మధ్యలోనే నిలిచిపోయాయి. దీంతో టీఎస్‌ ఆర్టీసీ ప్రారంభించ తలపెట్టిన డబుల్‌ డెక్కర్‌, హెచ్‌ఎండిఏ ఎలక్ట్రిక్‌ డబుల్‌ డెక్కర్‌ బస్సులు ప్రస్తుతానికి పూర్తిగా నిలిచిపోయాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement