Wednesday, December 6, 2023

ధాన్యం కొనుగోళ్లపై అలసత్వం వహించొద్దు.. హరీశ్ రావు

ధాన్యం కొనుగోళ్ల కేంద్రాల్లో అధికారులు అలసత్వం వహించరాదని అధికార వర్గాలకు రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు సూచించారు. ఈ యాసంగి ధాన్యం కొనుగోళ్లలో దురదృష్టవశాత్తూ అకాల వర్షాలు పడటంతో రైతులకు నష్టం వాటిల్లిందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో రైతులకు ప్రజాప్రతినిధులు, జిల్లా అధికార యంత్రాంగం సమన్వయంతో మనమంతా అండగా నిలుద్దామని మంత్రి హరీశ్ రావు దిశానిర్దేశం చేశారు. శనివారం యాసంగి ధాన్యం కొనుగోళ్లు, ముందస్తు తుఫాను దృష్ట్యా రైతులకు అండగా నిలిచేలా ఎప్పటికప్పుడు ధాన్యం కొనుగోళ్లు సజావుగా జరిగే అంశంపై జిల్లా అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు మొత్తం 2300 మందితో కలిసి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ టెలీ కాన్ఫరెన్స్ లో ఏంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు సతీశ్, ముత్తిరెడ్డి యాదిరెడ్డి, జెడ్పీ చైర్మన్ రోజాశర్మ, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, ఎమ్మెల్సీలు, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, అడిషనల్ కలెక్టర్ ముజమ్మీల్ ఖాన్, శ్రీనివాస్ రెడ్డి, జిల్లాలోని ఎంపీపీ, జెడ్పీటీసీ, సర్పంచ్, ఏంపీటీసీ, మార్కెట్ కమిటీ చైర్మన్లు, పీఏసీఎస్ చైర్మన్లు, కో ఆపరేటీవ్, మార్కెట్ కమిటీ, రెవెన్యూ, ఐకేపీ తదితర ధాన్యం కొనుగోళ్ల అధికార సిబ్బంది, రైతుబంధు సమితి ప్రజాప్రతినిధులతో టెలీ కాన్ఫరెన్స్ లో సమీక్షించారు. జిల్లా వ్యాప్తంగా 415 కొనుగోళ్ల కేంద్రాలు ప్రారంభించినట్లు, ఇప్పటిదాకా 7304 మంది రైతుల వద్ద నుంచి 32,508 మెట్రిక్ టన్నుల ధాన్యం రూ.67 కోట్లతో ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు.

- Advertisement -
   


కొనుగోలు చేసిన ధాన్యం అంశంపై పరిశీలిస్తే ట్యాబ్ ఎంట్రీలో జాప్యం జరుగుతుందని, పీఏసీఎస్, ఐకేపీ సిబ్బంది నిర్వహణలో రూ.67 కోట్ల రూపాయల ధాన్యం కొనుగోలు చేస్తే రూ.45 కోట్లు మాత్రమే ట్యాబ్ ఎంట్రీ జరిగిందని ఏ రోజుకారోజు ఎప్పటికప్పుడు ట్యాబ్ ఎంట్రీ జరగాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే ట్రక్ షీట్ జనరేట్ చేయడం విషయంలో మిల్లర్లు సహకరించాలని, ట్రక్ షీట్ జనరేట్ రూ.32 కోట్లు, మిల్లర్లు ఆకనాలేడ్జ్ మెంట్ రూ.29 కోట్లు, డబ్బు చెల్లింపులు రూ.17 కోట్లకు ఇవ్వడంతో ఎంతో గ్యాప్ ఉన్నదని, ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యే వరకూ మిల్లర్లు రైతులకు సహకారం అందించాలని కోరారు. గన్నీ బ్యాగులు, ప్యాడీ క్లీనర్లు, టార్ఫాలిన్ కవర్లు ధాన్యం కేంద్రాలలో అందుబాటులో నిలపాలని సూచించారు. ధాన్యం కొనుగోళ్లలో భాగంగా ఏ గ్రేడ్, బీ గ్రేడ్ గ్యాప్ రావొద్దని, తాలు, మాయిశ్చరైజ్ ఉన్నదని వివిధ కారణాలతో రైతు ధాన్యం కొనమనే పరిస్థితి ఉండొద్దని, తప్పనిసరిగా ఏఈఓలు, తహశీల్దార్లు, స్థానిక ప్రజాప్రతినిధులు నిత్యం ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దకు వెళ్లి పర్యవేక్షణ చేయాలని సూచించారు. కొనుగోళు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలులో అలసత్వం వహించకుండా ఎప్పటికప్పుడు కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు ఎగుమతి చేయాలని, అందుకు ట్రాన్స్ పోర్ట్ సక్రమంగా కొనుగోలు కేంద్రాల వద్ద అందుబాటులో ఉంచాలని, రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా చూడాలని అధికార వర్గాలను మంత్రి ఆదేశించారు. ఇటీవల వడగళ్ళ వర్షంతో పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఎకరాకు రూ.10వేలు ఆర్థిక సాయం అందిస్తుందని భారోసానిచ్చారు. ఈ వారంలో మరో తుఫాను ఉంటుందన్న దృష్ట్యా ఏ రోజుకారోజు ధాన్యం కొనుగోళ్ల పై కేంద్రాలు, మిల్లర్లు, అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ రైతులకు అండగా నిలవాలని మంత్రి సూచించారు. ఈ మేరకు ఏంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే సతీశ్, జెడ్పీ రోజాశర్మ, జిల్లాలోని మార్కెట్ కమిటీ చైర్మన్లు, ఇతర మండల, గ్రామ స్థాయి ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయి కొనుగోళ్ల అంశాలపై మంత్రితో చర్చించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement