Sunday, April 28, 2024

TS: దానంపై అన‌ర్హ‌త వేటు వేయండి… బీఆర్ఎస్

హైద‌రాబాద్ : ఖైర‌తాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్‌పై అన‌ర్హ‌త వేటు వేయాల‌ని శాస‌న‌స‌భ స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. స్పీక‌ర్‌కు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేల్లో పాడి కౌశిక్ రెడ్డి, కాలేరు వెంక‌టేశ్, ముఠా గోపాల్, బండారు ల‌క్ష్మారెడ్డితో పాటు ప‌లువురు నాయ‌కులు ఉన్నారు.


ఈ సంద‌ర్భంగా పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ త‌ర‌పున గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన దానం నాగేంద‌ర్‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని స్పీక‌ర్‌ను కోరామ‌ని తెలిపారు. యాక్ష‌న్ తీసుకుంటామ‌ని స్పీక‌ర్ చెప్పిన‌ట్లు పేర్కొన్నారు. ఒక పార్టీ త‌ర‌పున గెలిచి మ‌రో పార్టీలో చేరే ఎమ్మెల్యేల‌ను రాళ్ల‌తో కొట్టి చంపాల‌ని మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇప్పుడు తమ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేల‌ను ఎలా తీసుకుంటారని ప్ర‌శ్నించారు. నోటికొచ్చిన‌ట్లు మాట్లాడ‌టం స‌రికాద‌ని రేవంత్‌పై కౌశిక్ మండిప‌డ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement