Tuesday, May 7, 2024

టీ బీజేపీలో అసంతృప్తి జ్వాలలు.. అయోమయంలో నాయకత్వం, పార్టీ శ్రేణులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : నాలుగు నెలల్లో అసెంబ్లి ఎన్నికలు జరగనున్న తరుణంలో ముఖ్యనేతల నేతల్లో అసంతృప్తులు, నేతల మధ్య విభేదాలు బీజేపీ నాయకత్వంతోపాటు శ్రేణులను అయోమయానికి గురిచేస్తున్నాయి. రోజుకో నేత అసంతృప్తితో అలకబూనుతుండడం పార్టీ రాష్ట్ర, జాతీయనాయకత్వానికి కొత్త తలనొప్పి తెచ్చిపెడుతోంది. ఎన్నికలు సమీపించిన వేళ నేతలు బాహాటంగా అసంతృప్తిని , విభేదాలను బహిర్గతపరుస్తుండడం పార్టీకి తీవ్ర నష్టాన్ని చేకూరుస్తుందన్నా ఆందోళన ఇప్పుడు బీజేపీ నాయకత్వంతోపాటు కార్యకర్తలను వేధిస్తోంది. ఎప్పుడు ఏ నేత, ఏ విధంగా తన అసంతృప్తిని వ్యక్తం చేసి పార్టీకి నష్టం చేకూరుస్తాడోనన్న టెన్షన్‌తో కూడిన పరిస్థితులు ఇప్పుడు తెలంగాణ బీజేపీలో నెలకొన్నాయి. కొద్ది రోజులుగా పార్టీలోని కొందరు ముఖ్యనేతలు నేతలు అధిష్టానంపై అసంతృప్తితో ఉంటే మరికొందరు నేతలు పార్టీ రాష్ట్ర నాయకత్వంపై, ఇంకొందరు నేతలు తమకు సరైన గుర్తింపు లేదని ఇలా నేతల అసంతృప్త జ్వాలలు ఎగిసిపడుతున్నాయి.

ఇవి చాలవన్నట్లు ముఖ్యనేతల మధ్య విభేదాలు పార్టీ కేడర్‌లో అయోమయాన్ని, గందరగోళాన్ని మరింత పెంచుతున్నాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు అనుకూలంగా ఓవర్గం, వ్యతిరేకంగా ఓ వర్గం గా నేతలు చీలిపోయిన పరిస్థితులు బీజేపీలో నెలకొన్నాయి. రోజు కో నేత అసంతృప్తి స్వరం వినిపిస్తుండడంతో టీ. బీజేపీలో గందరగోళ పరిస్థితులు నెలకొంది. చాలా కాలంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై పనితీరుపై ముఖ్యనేతలు తీవ్ర అసంతృప్తితో ఉండడం, ఆయనపై అధిష్టానానికి ఫిర్యాదులమీద ఫిర్యాదుల చేస్తున్న విషయం తెలిసిందే. ఈ అంశమే కాకుండా లిక్కర్‌ స్కాంలో అధికార బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ, సీఎం కేసీఆర్‌ కూతురు కల్వకుంట్ల కవితను అరెస్టు చేయకపోవడంపై కేంద్ర ప్రభుత్వం, అధిష్టానంపై కీలక నేతలు కోమటిరె డ్డి రాజగోపాల్‌రెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తదితరులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

- Advertisement -

ఇదే విషయాన్ని ఇటీవల అమిత్‌ షా, నడ్డాను కలిసిన సమయంలోనూ రాజగోపాల్‌రెడ్డి, ఈటల రాజేందర్‌ అధిష్టానానికి తేల్చి చెప్పారు. రాజగోపాల్‌రెడ్డి, ఈటల రాజేందర్‌ను ఢిల్లికి పిలిపించి వారితో ప్రత్యేకంగా చర్చించిన అధిష్టానం వారి వ్యవహారాన్ని కొలిక్కి తీసుకొచ్చామనుకుంటున్న తరుణంలోనే బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి చేసిన దున్నపోతు ట్రిట్‌మెంట్‌ ట్వీట్‌ నేతల మధ్య అభిప్రాయ భేదాలను బహిర్గతం చేశాయి. ఆ ట్వీట్‌ను జితేందర్‌రెడ్డి అగ్రనేత అమిత్‌ షాతోపాటు పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్‌. సంతోష్‌కు ట్యాగ్‌ చేయడంతో పార్టీలోని కీలక నేతల మధ్య విభేదాలు మరోసారి అధిష్టానం దృష్టికి వెళ్లాయి. పార్టీలో అంతా సవ్యంగానే ఉందని, నేతలం దరం కలిసికట్టుగా ఉన్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రకటించి రెండు రోజులు గడవకముందే కీలక నేత జితేందర్‌రెడ్డి చేసిన ట్వీట్‌తో పార్టీలో నేతల మధ్య సమన్వయం కొరవడిందన్న విషయాన్ని తేటతెల్లం చేశాయి.

అదే సమయంలో కీలక నేత, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు తననకు పార్టీలో సరైన గుర్తింపు ఇవ్వడం లేదని, తన విషయంలో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ స్పందిస్తున్న తీరు సరిగా లేదని తన అసంతృప్తిని వెళ్లగక్కారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో తదుపరి ఏ కీలక నేత అధిష్టానంపై, రాష్ట్ర నాయకత్వంపై అసంతృప్తి వెళ్లగక్కనున్నారోనన్న చర్చ పార్టీ వర్గాల్లో విస్తృతంగా కొనసాగుతోంది. ఇటీవల పార్టీలో చేరిన కీలక నేతల వ్యవహారతీరును చూస్తున్న బీజేపీ సంస్థాగత నేతలు ఇది బీజేపీ సంస్కృతి కాదంటున్నారు. నేతల వ్యక్తిగత అజెండా పార్టీపై రుద్దొద్దని అసంతృప్త నేతలకు హితవు చెబుతున్నారు. బీజేపీ క్రమశిక్షణ ఉన్న పార్టీ అని, ఇలా బహిరంగంగా అసంతృప్తితో కూడిన ప్రకటనలు వెలువరించడం ద్వారా నేతలు లక్ష్మణ్‌ రేఖను దాటుతున్నారని, ఇకనైనా తీరు మార్చుకోవాలని హితవు చెబుతున్నారు. అసంతృప్తి ఏమైనా ఉంటే పార్టీ అధిష్టానం ముందు , క్రమశిక్షణా కమిటీ ముందు చెప్పుకోవాలేకాని మీడియాకెక్కి పార్టీ శ్రేణుల్లో గందరగోళం సృష్టించొద్దని సూచిస్తున్నారు.

వయసు, అనుభవం ఉన్నవారు జాగ్రత్తగా మాట్లాడాలి: జితేందర్‌రెడ్డికి ఈటల కౌంటర్‌

ఃవయసు, అనుభవం ఉన్న వారు రాజకీయాల్లో జాగ్రత్తగా మాట్లాడాలని పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు జితేందర్‌రెడ్డి ట్వీట్‌పై బీజేపీ సీనియర్‌ నేత, పార్టీ చేరికల కమిటీ ఛైర్మన్‌ ఈటల రాజేందర్‌ వ్యాఖ్యానించారు. ఈ మేరకు శుక్రవారం జితేందర్‌రెడ్డి ట్వీట్‌పై స్పందించారు. జితేందర్‌రెడ్డి ఎందుకలా ట్వీట్‌ చేశారో ఆయననే అడగాలన్నారు. వయసు అనుభవం ఉన్నవారు జాగ్రత్తగా మాట్లాడాలని హితవు చెప్పారు. ఎవరి గౌరవానికి భంగం కలగకుండా చూసుకోవాలన్నారు. ఇతరుల స్వేచ్ఛ, గౌరవం తగ్గించకూడదని ఘాటుగా జితేందర్‌రెడ్డికి కౌంటర్‌ ఇచ్చారు.

వ్యక్తిగత ఏజెండాను పార్టీపై రుద్దొద్దు… సీనియర్‌ నేత కృష్ణసాగర్‌రావు వార్నింగ్‌

బీజేపీలో నేతలు క్రమశిక్షణ తప్పుతుండడంతో ముఖ్య అధికార ప్రతినిధి కృష్ణసాగర్‌రావు వార్నింగ్‌ ఇచ్చారు. బీజేపీలో నేతల క్రమశిక్షణా రాహిత్యం, నిర్లక్ష్యపూరిత వైఖరిని సహించేది లేదని స్పష్టం చేశారు. పార్టీపైనా, పార్టీ నాయకత్వంపైనా బాధ్యారాహిత్యంగా ప్రకటనలు చేస్తే పార్టీకి నష్టం చేసినట్లేనని తేల్చి చెప్పారు. పార్టీ ఎజెండా కంటే వ్యక్తిగత ఏజెండాలు ఎక్కువ కావని అసంతృప్త నేతలకు స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement