Monday, April 29, 2024

పెద్ద నోటు, ఎవరికి చేటు.. రాజకీయ రంగంలోనే ఆందోళన

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : గడిచిన దశాబ్ధ కాలంలో రెండు పర్యాయాలు పెద్ద నోట్ల రద్దు అంశం దేశ ఆర్థిక వ్యవస్థలో అత్యంత కీలకమే.. అయినప్పటికీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో మిడిల్‌ క్లాన్‌ నుంచి కిందిస్థాయి వరకు ఎలాంటి ప్రభావం చూపడం లేదన్నది ఆర్థకరంగ నిపుణుల అంచనా. వాస్తవ పరిస్థితులు కూడా అందుకు బలం చేకూరుస్తున్నాయి. గ్రామాల్లో రైతులు, వ్యవసాయ రంగ కార్మికులు, కూలీలు, అసంఘటిత రంగంలో పనిచేసే వారంతా.. ఆ విషయం మాకెందుకులే! అని రూ.2వేల నోటు రద్దు అంశాన్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. చిన్న, మధ్యతరహా వ్యాపార రంగంలో కొంత మేరకు నిధులు నిల్వకు అవకాశం ఉండడంతో దాచిన సొమ్మును బట్వాడా చేసేందుకు కసరత్తు మొదలుపెట్టారు. పెద్ద పోట్లు మార్చుకునేందుకు ఈ ఏడాది సెప్టెంబర్‌ 30 వరకు ఆర్భీఐ అవకాశం ఇవ్వడంతో వ్యాపారులు కూడా భరోసాతో ఉన్నారు.

రిటైల్‌ రంగంలో పనిచేసే వారిద్వారా వ్యాపార లావాదేవీల్లో రూ.2వేల నోట్లన్నీ చెలామణి చేస్తామని వ్యాపారులు చెబుతున్నారు. ఈ క్రమంలో ‘పెద్ద నోటు రద్దు ఎవరికి చేటు’.. అన్న ప్రశ్న నేటి సమాజంతో గత రెండు రోజులుగా విస్తృతంగా చెలామని అవుతోంది. ఆర్థిక నిపుణుల అంచనా ప్రకారం రూ.2వేల నోటు రద్ధు అనేది రాజకీయ రంగంపైనే ఎక్కువగా ఉంటుంది. రకరకాల మార్గాల్లో కూడబెట్టిన భారీ సొమ్మంతా రాజకీయ నాయకుల వద్దే ఉందన్న వాదన బలంగా వనిపిస్తోంది. ఆయా రాజకీయ పార్టీల అధినేత లెవరూ ఈ అంశంపై ఘాటుగా స్పందించకపోవడానికి కూడా అదే కారణమని తెలుస్తోంది. రాజకీయ రంగం తర్వాత రియల్‌ ఎస్టేట్‌ రంగంపై రూ.2వేల నోటు రద్దు కొంత ప్రభావం చూపుతోంది. ఆర్థిక లావాదేవీల లెక్కలు భారీగా తగ్గించి చూపడంతో స్థిరాస్తి వ్యాపారులది అందెవేసిన చెయ్యి కావడంతో వారిలోనే కొంతమేరకు ఆందోళన కనిపిస్తోంది.

- Advertisement -

బహుళ అంతస్తుల భవనాలు, విల్లాల నిర్మాణానికి మెటీరియల్‌ కొనడం మొదలుకుని, రకరకాల చెల్లింపులు, క్రయ విక్రయాల్లో లెక్కలన్నీ వేరేరకంగా ఉండే రంగం కావడంతో నల్లధనం కూడబెట్టేందుకు అవకాశాలు అక్కడే ఉంటాయి. అయినప్పటికీ, ఆ మేరకు మార్గాలను కనుగొనడం కూడా స్థిరాస్తి వ్యాపారులకు సులువేనన్న వాదన ఉంది. ఈ ఏడాది ఆఖరులో 5 రాష్ట్రాలకు సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. వరసబెట్టి అసెంబ్లీ ఎన్నికలు, ఆ తర్వాత వచ్చే ఏడాది ఏకంగా లోక్‌ సభ ఎన్నికలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో నోట్ల కట్టలతో రాజకీయ పార్టీలకు, బరిలో దిగే నేలతకూ చాలా పని ఉంది. గుట్టలు గుట్టలు దాటు-కుని వచ్చే నోట్లతో చాలా మంది నాయకుల జయాపజయాలు ఆదారపడి ఉన్నాయి. పెద్ద నోట్ల విషయంలో ఇప్పటికే బోలెడు ఆరోపణలు ఉన్నాయి. బీజేపీ నేతలు అయితే ఏపీలో పెద్ద నోట్లు- రెండు వేల రూపాయలు కనిపించడంలేదని దాన్ని ఎన్నికల కోసం దాచిపెట్టారని ఆరోపిస్తున్నారు. అంతే కాదు దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా రెండు వేల నోటు తళతళ మెరిసిపోవడం ఇప్పటివరకు మనం చూసిందే.

గతంలో ఉన్న అయిదు వందలు వేయి రూపాయల నోట్లు చిన్నబోయాయి. ఇపుడు పింక్‌ కలర్‌ రెండు వేల నోటే నల్ల సమాజాన్ని శాసిస్తోంది. కర్నాటక ఎన్నికల్లో బీజేపీ ఓటమికి కారణం ప్రభుత్వ వ్యతిరేకత ఒక వైపు ఉంటే మరో వైపు ధన ప్రవాహం కూడా చాలానే పారిందని ప్రచారం జరిగింది. రెండు వేల నోటు అలా చక్కర్లు కొట్టిందని కూడా టాక్‌ నడిచింది. ఈ క్రమంలో రూ.2వేల నోటు రద్దవడం త్వరలో ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీలకు మింగుడుపడడం లేదన్నది కొంతమేరకు వాస్తవం. బీజేపీ సైతం ఇదే ఇపుడు పునరాలోచిస్తూ అంతర్మధనం చెందుతోంది. అందుకే కర్నాటక ఎన్నికల ఫలితాలు వచ్చి వారం కూడా కాలేదు రెండు వేల రూపాయలు మార్కెట్‌ నుంచి గాయబ్‌ అయిపోయింది. నిజానికి చలామణీలో రెండు వేల నోట్లు- లేకపోవచ్చు కానీ రాజకీయ నేతల వద్ద గుట్టలుగా ఉందని అంటున్నారు. దాని అవసరం పడినపుడు అది అలా బయటకు వస్తోంది. తాజాగా బలాబలాలు, ఎత్తులు, పైఎత్తుల నేపథ్యంలో కర్నాటకలో ఎన్నికల ప్రక్రియ ముగిసిపోయింది. మిగిలిన రాష్ట్రాల్లో అసెంబ్లీలకు, పార్లమెంట్‌ ‘కీ’ ఎన్నికలు ఉన్న నేపధ్యంలో బీజేపీ రెండు వేల నోటు ఇక వద్దు రద్దు అనిపించేసింది.

దీంతో ఎన్నికల కోసం పోగేసుకున్న నల్లధనం కాస్తా ఇక చెల్లని చిత్తు కాగితం అవుతుందా అన్న చర్చ సాగుతోంది. మార్కెట్‌ లో లేని ఈ మొత్తం అంతా ఎన్నికల వేళ విచ్చలవిడిగా పురి విప్పుకుంటు-ంది. అందుకే విపక్షానికి గట్టి దెబ్బ వేసేందుకే బీజేపీ రెండు వేల నోటు రద్దుపై కీలక నిర్ణయం తీసుకుందని అంటున్నారు. ఈ నిర్ణయంలో విపక్ష పార్టీలను హ్యాండ్సప్‌ చేయవచ్చు అన్నదే కాషాయం పార్టీ ప్లాన్‌. ఈ దెబ్బకు అంతా గప్‌ చుప్‌ అవుతారని కూడా తలపోస్తోంది. బయటకు బ్లాక్‌ మనీ కంట్రోలింగ్‌ అని చెబుతున్నా అసలు విషయం ఇదేనని రాజకీయ అర్ధాలు చాలానే దీని వెనక ఉన్నాయని విపక్షాల నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక దేశంలో ఎన్నికలు అంటే ఫండ్స్‌ పెద్ద ఎత్తున వచ్చి వాలతాయి. అది కూడా లెక్కా జమా లేని నిధులే ఎక్కువగా వస్తాయి. వాటి మీదనే ఆధారపడి ఎన్నికల రాజకీయం మొత్తం సాగుతుంది. దాంతో అలా వచ్చే ఫండింగ్‌కి అడ్డు కట్ట పడిపోతుంది.

ఇక నగదు అటూ ఇటూ రవాణా కాకుండా చూస్తారు. ఎక్కడ నుంచి ఎటు కదిలినా గట్టి నిఘా పెట్టి దర్యాప్తు సంస్థలతో వారి ఆట కట్టిస్తారు. ఆపైన కేసులు కూడా నమోదు చేసి విచారించేందుకు అవకాశం ఉంటు-ంది. అలాగే నల్లధనం అని తేలిన వారి బ్యాంక్‌ లావాదేవీలను జప్తు చేసి వారి మీద ఉక్కు పాదం మోపేందుకు ఆస్కారం ఉంటు-ంది. ఇవన్నీ బీజేపీ వ్యూహాలే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ విపక్షం చేతిలో చిల్లి గవ్వ కూడా లేకుండా చేసే యత్నంగా అనుమానిస్తున్నారు. మొత్తానికి మొత్తం ఆర్ధిక వ్యవస్థను తమ గుప్పిట్లో ఉంచుకోవడానికే ఈ పెద్ద నోట్ల రద్దు అంశాన్ని తెర మీదకు తెచ్చారని అంటున్నారు. విపక్షాల చేతికి బ్లాక్‌ మనీ అందకుండా చేయాలని బీజేపీ మాస్టర్‌ ప్లాన్‌ వేసింది అని స్పష్టం చేస్తున్నారు.

బహిరంగ మార్కెట్లో సామాన్యులకు తప్పని తిప్పలు

నల్లధనం మాట దేవుడెరుగు కానీ.. రూ.2 వేల నోటు రద్దుతో బహిరంగ మార్కెట్లో సామాన్యులకు చుక్కలు కనిపిస్తున్నాయి. చిరు వ్యాపారులు అవగాహన లేక రూ.2 వేల నోటు చూస్తుంటే అల్లంత దూరం పారిపోతున్నారు. ఎక్కడా స్వీకరించేందుకు ఇష్టపడడం లేదు. దీంతో ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఇలా ప్రకటన వచ్చిందో లేదో అలా దేశ వ్యాప్తంగా సర్క్యూలేట్‌ అయ్యింది. అయితే ఆర్బీఐ ఆదేశాలు, మార్గదర్శకాలపై అవగాహన లేక చాలా మంది రూ.2 వేల నోటు అంటేనే ఆందోళన పడుతున్నారు. ఎందుకొచ్చింది గొడవ అంటూ తిరస్కరిస్తున్నారు.

వాస్తవానికి రూ.2వేల నోటును ఉపసంహరించుకున్న రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా.. ఆ నోట్లను దేశంలోని 19 ప్రాంతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా శాఖల్లో మార్చుకునే అనుమతి ఇచ్చింది. అంతేకాదు బ్యాంకులు సైతం రూ.2 వే నోటును సర్కులేషన్‌ లో పెట్టవద్దని ఆదేశాలు జారీ చేసింది. రూ.2 నోట్లు ఉన్నవారు వచ్చే సెప్టెంబర్‌ 30 లోగా బ్యాంకుల్లో సబ్మిట్‌ చేసి మార్చుకోవాలని స్పష్టం చేసింది. ఒక్కొక్కరూ ప్రతి విడతలోనూ రూ.20 వేలు విలువైన నోట్లు మార్చుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఈనెల 23 నుంచి రూ.2 వేల నోటు మార్చుకునేందుకు వెసులుబాటు కల్పించింది.

సెప్టెంబరు 30 వరకూ నోట్ల మార్పిడికి ఆర్బీఐ అవకాశం ఇచ్చినప్పటికీ ఎక్కడికక్కడే వ్యాపారులు తీసుకోవడం లేదని ఫిర్యాదులు వెల్లవెత్తుతున్నాయి. దీంతో ఆర్బీఐ సీరియస్‌ ఆదేశాలు జారీచేసింది. రూ.2 వేల నోటు లీగల్‌ టె-ండరుగానే కొనసాగుతోందని స్పష్టం చేసింది. ఏ కారణం చేతనైనా తీసుకోకపోతే కేసులు నమోదుచేస్తామని హెచ్చరించింది. పెద్ద నోట్ల రద్దు సమయంలో ఈ రకమైన ఇబ్బందులు వచ్చాయి. ఇప్పుడు తాజాగా అటు-వంటివే ఎదురవుతున్నాయి. దీనిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బ్లాక్‌ మనీ మాటేమిటో కానీ.. సామాన్యులకు ఇబ్బందులు తప్పడం లేదన్న నిట్టూర్పులు ఎదురవుతున్నాయి. అయితే ఇది అంతిమంగా కేంద్ర ప్రభుత్వంపై అపవాదు పడుతోంది. దీనిని ఎలా అధిగమిస్తారో చూడాలంటున్నారు ఆర్థిక రంగ నిపుణులు.

రద్దు వెనక ‘క్లీన్‌ నోట్‌ పాలసీ’

ప్రజలకు మంచి నాణ్యమైన నోట్లు అందుబాటులో ఉండేలా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అనుసరించే విధానమే ‘క్లీన్‌ నోట్‌ పాలసీ’. 2016లో అప్పటి పెద్ద నోట్ల రద్దు తరువాత ఆర్భీఐ రూ.2 వేల నోటును ప్రవేశపెట్టింది. అయితే, ఇతర డినామినేషన్లలోని నోట్లు తగిన పరిమాణంలో అందుబాటు-లోకి వచ్చిన తర్వాత.. 2018-19లో రూ.2వేల నోట్ల ముద్రణ నిలిపివేసినట్టు ఆర్బీఐ పేర్కొంది. 2017 మార్చిలో 89 శాతం జారీ చేయగా వాటి జీవిత కాలం 4 నుంచి 5 సంవత్సరాలుగా అంచనా వేసింది. 2018 మార్చి 31, నాటికి గరిష్టంగా ఉన్న రూ.6.73 లక్షల కోట్ల (చెలామణిలో ఉన్న నోట్లలో 37.3 శాతం) మొత్తం విలువ రూ.3.62 లక్షల కోట్లకు తగ్గింది. ఇది కేవలం 10.8 శాతం మాత్రమేనని నిపుణులు చెబుతున్నారు. 2016 నవంబరులో అప్పటిదాకా చలామణిలో ఉన్న పెద్ద నోట్లు రూ.500, రూ.1,000 నోట్లను ఆర్భీఐ రద్దు చేసింది. తదనంతర పరిణామాల క్రమంలో తాజాగా రూ.2వేల నోటు రద్దయ్యింది

Advertisement

తాజా వార్తలు

Advertisement