Tuesday, May 14, 2024

అడవుల విధ్వంసం, మనుగడకే ముప్పు.. కాపాడుకుంటేనే బెస్ట్​..

ఎడారిలో చలికి వణుకుతున్న ఒంటెకు తలదాచుకోవడానికి అవకాశమిచ్చిన అరబ్‌ షేక్‌ చివరకు తాను నిర్వాసితుడు కావడం మనం నీతి కథల్లో చదివే ఉంటాం. అదే గతి నేడు వన్యప్రాణులకు పడుతోంది. ఒకప్పుడు భూ విస్తీర్ణంలో 70 శాతంతో కళ కళలాడిన అడవులు నేడు 23 శాతానికే పరిమితమయ్యాయి. ఫలితంగా వన్యప్రాణుల మనుగడకు ముప్పు వాటిల్లింది. మనిషి జీవనావసరాల కోసం అడవులను ధ్వంసం చేస్తూనే ఉన్నాడు. వన్యప్రాణుల ఆవాస ప్రాంతాలను కాపాడుదామని పర్యావరణ ప్రేమికులు ఎంత ఆందోళన వెలిబుచ్చినా ఇది ఆగడం లేదు. వణ్యప్రాణుల ఆవాసాల్లోకి మనం చొరబడుతున్నాం. అందుకే వణ్యప్రాణులు జనవాసాల్లోకి వస్తున్నాయని పర్యావరణ ప్రేమికులు, అటవీ అధికారులు పదేపదే చెబుతూవస్తున్నారు. అడవిపై పూర్తి హక్కు వణ్య ప్రాణులదేనని, వాటి మనుగడకు మనం అడ్డం కావ‌ద్దంటూ అటవీ అధికారులు సూచిస్తున్నారు.

విభిన్న రకాల జీవజాతులు..

కర్నూలు జిల్లాలో శ్రీశైలం, ఆత్మకూరు, వెలుగోడు, మహానంది, శిరివెళ్ల, రుద్రవరం, ఆళ్లగడ్డ మండలాల పరి ధిలోని నల్లమల అటవీ ప్రాంతం ఉంది. టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్ట్టు రోళ్లపాడు, గుండ్ల బ్రహ్మేశ్వరం అభయారణ్యాలు ఉన్నాయి. వీటిలో లెక్కలేనన్ని జీవజాతులు నివశిస్తున్నాయి. అధికారుల గణాంకాల ప్రకారం 55 జాతుల క్షీరదాలు, 2006 రకాల పక్షులు, 18 రకాల ఉభయచరాలు, 54 రకాల సరీసృపాలు, 55 జాతుల చేపలు ఉన్నాయి. వివిధ జాతుల క్రిమి కీటకాలెన్నో ఉన్నాయి. శ్రీశైలం ప్రాజెక్టు పరిధిలో బయోడైవర్సిటీ ఏర్పాటయ్యాక నల్లమల అటవీ ప్రాంతంలో కొన్ని కొత్తరకం జీవరాశులను కనుగొన్నారు. ఈ బయోడైవర్సిటీలో 2001 డిసెంబర్‌లో ఏర్పాటు చేసిన లైబ్రరీలో ఆయా జాతులకు చెందిన పూర్తి వివరాలు పొందుపరిచారు.

అటవీ నిబంధనలు పాటించాలి..

పులి, చిరుతలు తమ ప్రాణాలకు హాని జరుగుతుందేమో అన్న అనుమానం వచ్చే వరకు మనిషిపై దాడిచేయవు. అలాగే ఎలుగు బంటి కూడా, పులిని ఒక సారి మనం చూశామంటే అది వేయి సార్లు మనల్ని చూసే ఉంటుందని తెలుసుకోవాలి. అది ఎప్పుడూ మనిషిని తప్పుకునే తిరుగుతుంది. చిరుతలు మనుషుల ఆవాసాలకు సమీపంలోనే తమ ఆహారాన్ని వెతుక్కుంటాయని చాలా మందికి తెలియదు. ఇవి గ్రామ సమీపాల్లో రాత్రి పూట రహస్యంగా తిరుగుతూ తనకిష్టమైన కుక్కలను ఎత్తుకుపోతాయి. మనుషులపై దాడి చేయడం అరుదు. మనిషి నడిచి వెళితే పులులు చక్కగా గుర్తిస్తాయి. అతను తమ ఆహారపు మెనూలో లేడన్న విషయం వాటికి తెలుసు. అదే ద్విచక్ర వాహనాలపై వెళ్లినప్పుడు అది మొత్తం ఒక జంతువుగా భావించి దాడులు చేస్తాయి. అటవీ ప్రాంతాల్లో ఎట్టి పరిస్థితుల్లో వంగి నడవడం, కూర్చోవడం చేయ రాదు. అడవిలో నడిచే సమయంలో చేతిలో కర్ర ఉంచుకోవడం మంచిది. మనిషి చేతిలోని కర్ర ఎత్తినప్పుడు ఎదురుగా ఉన్న అటవీ జంతువుకు మనిషి రెండు రెట్లు ఎత్తుగా కనిపిస్తాడు. దీంతో వన్యప్రాణులు మనిషికి దూరంగా పారిపోతాయి. అటవీ ప్రాంతాల్లో నివాసం ఉండే వారు పెద్ద పెద్ద శబ్దాలు చేయకుండా పరిసరాలను ప్రశాంతంగా ఉంచాలి. వాతావరణ కాలుష్యానికి పాల్పడకుండా ఉండాలి. అటవీ నిబంధనలను తప్పకుండా పాటించాలి. వన్య ప్రాణుల ఆవాసాల్లో చొరబడి వాటిపై క్రూరత్వం ప్రదర్శించడం సరైంది కాదని వన్యప్రాణి ప్రేమికులు సూచిస్తున్నా రు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement