Wednesday, May 15, 2024

సైకిల్​పై మంత్రి పువ్వాడ-ఖమ్మం వీధుల్లో పర్యటన

పల్లెలు, పట్టణాలు స్వీయ నేతృత్వంలో బాగుచేసుకోవాలనే సంకల్పంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సైకిల్ పై కార్పోరేషన్ పరిధిలోని పలు డివిజన్లలో పర్యటించారు..ప్రజల వద్దకు నేరుగా వెళ్లి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఖమ్మం నగరంలో జిల్లా కలెక్టర్ VP గౌతమ్ , మేయర్ పునుకొల్లు నీరజ , మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి , మున్సిపల్, విద్యుత్ ఉన్నతాధికారులతో కలిసి సైకిల్​పై పర్యటించారు.నగర వీధుల్లో తిరుగుతూ.. పారిశుధ్యం, విద్యుత్ స్తంభాలు, రోడ్డుకు అడ్డుగా ఉన్న హ్యాండ్ బోర్లు, డివైడర్లు, సెంట్రల్ డివైడర్లలో ఉన్న మొక్కలు, మురుగు కాల్వలు పరిశీలించి అక్కడ చెత్తను స్వయంగా తొలగించి స్ధానిక ప్రజలతో మాట్లాడారు.

ప్రజల వద్దకు నేరుగా వెళ్లి వారి సమస్యలు తెలుసుకుని, పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమంలో చేపట్టాల్సిన పనులు, గత పట్టణ ప్రగతిలో చేపట్టిన పనుల గూర్చి స్వయంగా తెలుసుకుని పరిష్కరించేందుకు సైకిల్ పై పర్యటిస్తున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు.సుమారు రెండు గంటల పాటు ఒకటో పట్టణం, రెండవ పట్టణ ప్రాంతాల్లో పర్యటించారు. రోడ్లు, మురుగు కాలువలు, ఇంకా అభివృద్ధి చేయాల్సిన పనులపై అధికారులతో చర్చించారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుండి ప్రతి మూడు నెలలకు ఒకసారి సైకిల్‌పై క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలు తెలుసుకుంటున్నామని పువ్వాడ తెలిపారు. స్వయంగా పరిశీలించడం ద్వారా ఇప్పటి వరకు చాలా సమస్యలు పరిష్కరించామని చెప్పారు.ప్రజాసమస్యలను తెలుసుకుని అక్కడికక్కడే పర్యటించడమే ఈ పర్యటన ఉద్దేశమని, ఖమ్మం నగరాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తామని వివరించారు.నేడు గుర్తించిన ప్రతి పనిని ప్రస్తుత పట్టణ ప్రగతిలో పరిష్కరిస్తామని, ఇలాంటి పనులు పరిష్కరించుకోవడానికి పట్టణ ప్రగతి మంచి అవకాశమని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement