Monday, April 29, 2024

Big Story | సిద్ధమైన సాగు ప్రణాళిక.. కోటి 40లక్షల ఎకరాల్లో వానాకాలం పంట

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రాష్ట్ర వ్యాప్తంగా యాసంగి సీజన్‌ పూర్తి కావడంతో రైతులు ఖరీఫ్‌ సీజన్‌ సాగుకు సన్నద్ధమవుతున్నారు. యాసంగి వరికోతలు ఇప్పటికే 90 శాతం మేర పూర్తయ్యాయి. మరో 20 రోజుల్లో 2023-24 ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం కానుంది. వానాకాలం సాగుకు అన్నదాతలు రెడీ అవుతున్న నేపథ్యంలో వ్యవసాయశాఖ వానాకాలం సాగు ప్రణాళికను సిద్ధం చేస్తోంది. ఏఏ పంటలు ఎన్ని ఎకరాల్లో వేసే అవకాశముంది..?, ఎంత మొత్తంలో ఎరువులు అవసరమవుతాయి..? తదితర వివరాలతో సాగు ప్రణాళికను సిద్ధం చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపనుంది. మూడు, నాలుగు రోజుల్లో ప్రభుత్వానికి వానాకాలం సాగు ప్రణాళిక చేరే అవకాశం ఉందని వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. గతేడాదితో పోలీస్తే ఈసారి వానాకాలంలో మరో 20లక్షల ఎకరాలు అధనంగా అంటే రాష్ట్ర వ్యాప్తంగా కోటి 40లక్షల ఎకరాలకు సాగు విస్తీర్ణం పెరగనుందని ఉన్నతాధికారులు చెబుతున్నారు.

గతేడాది 2022-23 ఖరీఫ్‌ సీజన్‌లో రాష్ట్ర వ్యాప్తంగా కోటి 20లక్షల ఎకరాల్లో వరి, పత్తి, మొక్కజొన్న తదితర పంటలు సాగయ్యాయి. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా ఎక్కువ విస్తీర్ణంలో పత్తి, ఆ తర్వాత వరి సాగుకే రైతులు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ తర్వాతి స్థానాల్లో మొక్కొజొన్న, మిర్చి, పసుపు, ఆయిల్‌పామ్‌ పంటలు సాగుకానున్నాయి. ఈ సారి కూడా రాష్ట్ర వ్యాప్తంగా పత్తి, వరి, కంది, ఆయిల్‌ఫామ్‌ పంటల సాగుకు వ్యవసాయశాఖ ప్రాధాన్యత ఇవ్వబోతోంది. గతంలో పత్తి, వరితోపాటు మొక్కజొన్న సాగు అధిక విస్తీర్ణంగాలో సాగయ్యేది. ఈసారి మొక్కజొన్న స్థానంలో కంది పంట వచ్చి చేరింది. అంచనా వేసిన పంటల విస్తీర్ణానికి అనుగుణంగా విత్తనాలు, ఎరువులను రైతులకు సకాలంలో, సక్రమంగా, అక్రమాలకు తావులేకుండా అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

- Advertisement -

తొలకరి ప్రారంభంకాగానే పచ్చిరొట్ట సాగు…

తొలకరి వర్షాలు ప్రారంభం కాగానే పంట పొలాల్లో పచ్చిరొట్ట ఎరువులను సాగు చేయాలని, వరి పొలం సిద్ధం చేసే సమయంలో వాటిని భూమిలో వేసి కలిపి దున్నాలని వ్యవసాయశాఖ రైతులకు సూచించింది. 65శాతం సబ్సీడీపై జీలుగ, పెసర, పిల్లి పెసర రకం పచ్చిరొట్ట విత్తనాలను ఇప్పటికే అందుబాటులో ఉంచింది. 40 కిలోల జీలుగల బస్తా రెండున్నర ఎకరాలకు వస్తుందని, తొలకరి ప్రారంభం కాగానే విత్తాలని వ్యవసాయశాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ విజయ్‌ కుమార్‌ తెలిపారు. వానాకాలం సాగుకు జూన్‌ చివరి నాటికి పత్తి, జులై చివరి నాటికి వరి నాట్లు పూర్తి కావాలని, వానాకాలంలో మధ్యకాలిక వరి రకాలను ఎంచుకోవాలని వ్యవసాయశాఖ రైతులకు సూచిస్తోంది. మధ్యకాలిక వరి రకాలు ఎంచుకుంటే అక్టోబర్‌, నవంబరు వరకే కొతకు వస్తాయని, దీంతో ఒక నెల ముందే యాసంగి సాగుకు భూమిని దాదాపు రెండు నెలలపాటు ఆరబెట్టేందుకు అవకాశం కలుగుతుందని పిలుపునిచ్చింది.

వెంటాడుతున్న ఎల్‌నినో భయాలు…

ఈ ఏడాది వానాకాలం సాగును ఎల్‌నినో భయాలు వెంటాడుతున్నాయి. ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో ఈసారి వరి సాగు విస్తీర్ణంగా కాస్త తక్కువగా ఉండి… పత్తి సాగు పెరిగే అవకాశం ఉందని వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఈసారి రుతుపవనాలు వారం, పది రోజులపాటు ఆలస్యం కానున్నాయన్న వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో ఈసారి కూడా పత్తి సాగు ఎక్కువ విస్తీర్ణాన్ని ఆక్రమించే అవకాశాలు ఉన్నాయి. ఈసారి కూడా పత్తికి ఆశించినస్థాయిలోనే ధర ఉన్న నేపథ్యంలో పత్తి సాగు విస్తీర్ణమే అధికంగా ఉండనున్నట్లు అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి ఎల్‌నినో ప్రభావం అంతగా లేనిపక్షంలో వరిసాగు విస్తీర్ణం గతేడాది మాదిరిగా 60లక్షల ఎకరాలను దాటే అవకాశాలు ఉండేవని ఓ అధికారి చెప్పారు. ఈ పరిస్థితుల్లో గతేడాది ఖరీఫ్‌లో సాగయిన మేరకే వరి విస్తీర్ణాన్ని కుదించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈసారి కూడా మొక్క జొన్న పంట దాదాపు 15లక్షల ఎకరాల్లో సాగవుతుందని వ్యవసాయశాఖ అంచనా వేస్తోంది. 2023-24 ఖరీఫ్‌ సీజన్‌కు 30లక్షల మెట్రిక్‌ టన్నుల ఎరువులు అవసరమవుతాయని వ్యవసాయశాఖ చెబుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement