Tuesday, May 14, 2024

మ‌ళ్లీ క‌రోనా కల్లోలం.. ఒక్క‌ డోస్‌ వ్యాక్సిన్‌తోనే స‌రిపెట్టుకున్న జ‌నం!

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : చైనాలో మాదిరిగా భారతదేశంలోనూ బీఎప్‌.7 వ్యాప్తి చెందనుందన్న ఆందోళనల నేపథ్యంలో కరోనా టీకా తీసుకోనివారు రాష్ట్రంలో ఇప్పటిికీ మిగిలిపోవడం వైద్య, ఆరోగ్యశాఖలో ఆందోళన రేపుతోంది. ప్రత్యేకించి కరోనా టీకా రెండు డోస్‌లు తీసుకోని వారిలో ప్రభుత్వ ఉద్యోగులు, ఇతర ప్రయివేటు ఉద్యోగాలు చేసే ఉన్నత విద్యావంతులే అధికంగా ఉండడం గమనార్హం. వివిధ శాఖల్లో పనిచేసే చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పటికీ రెండు డోస్‌ల టీకా తీసుకోలేదని, అత్యధికులు మొదటి డోస్‌తోనే సరిపెట్టారని ఉన్నతాధికారులు చెబుతున్నారు. చైనాలో బీఎఫ్‌.7 వేరియంట్‌ కల్లోలం సృష్టిస్తోన్న నేపథ్యంలో మరోసారి కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియకు ప్రాధాన్యత పెరిగింది.

భారత్‌లో అందుబాటులో ఉన్న కోవాగ్జిన్‌, కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌లు బీఎఫ్‌.7ను సమర్థంగా అరికడుతున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రెండు డోస్‌ల కరోనా టీకా తీసుకోని వారు, బూస్టర్‌ డోస్‌ టీకా తీసుకోని వారిపై వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. మొదటి డోస్‌ స్వీకరించిన వారిలో దాదాపు 50శాతం మంది ప్రభుత్వ, ప్రయివేటు ఉద్యోగులు రెండో డోస్‌ టీకా వేసుకోలేదని తెలుస్తోంది.

ఈ ఏడాది మొదట్లో ఒమిక్రాన్‌ వేరియంట్‌ విజృంభించగా ఏడాది చివర్లో ప్రస్తుతం ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్‌ బీఎఫ్‌.7 ఆందోళనలు రేపుతోంది. ఈ నేపథ్యంలో కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ మరోసారి ప్రాముఖ్యత సంతరించుకుంది. తెలంగాణలో వచ్చిన మూడు కొవిడ్‌ వేవ్‌లలో సం భవించిన మరణాల్లో అత్యధికులు వ్యాక్సిన్‌ తీసుకోనివారే. కరోనా టీకా వేసుకున్న తర్వాత వైరస్‌ సోకినా రెండు, మూడు రోజుల్లో పూర్తిగా కోలుకుంటున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

- Advertisement -

కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రుల్లో రెండు డోస్‌లు, బూస్టర్‌ డోస్‌ కలిపి 7, 71, 81, 016 డోస్‌లను పంపిణీ చేశారు. ఇందులో ప్రభుత్వ ఆధ్వర్యంలో 7, 26, 77, 557 డోస్‌లు పంపిణీ చేయగా, ప్రయివేటు ఆసుపత్రుల్లో 45, 03, 459 డోస్‌లు పంపిణీ అయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 6860 కోవిషీల్డ్‌ డోస్‌లు, 7, 34, 170 కోవిషీల్డ్‌ డోస్‌లు మొత్తం కలిపి 7, 41, 030 డోస్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటి వరకు మొదటిడోస్‌ కింద 34, 24, 36, 906 డోస్‌లను , రెండో డోస్‌ కింద 3, 15, 32, 105డోస్‌లను, ప్రికాషనరీ డోస్‌ కింద 1, 32, 12, 005 డోస్‌లను పంపిణీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement