Tuesday, May 7, 2024

కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేం, అవసరానికి తగినన్ని ఉన్నాయి : అశ్విని వైష్ణవ్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలంగాణలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు కేఆర్ సురేశ్ రెడ్డి శుక్రవారం సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ లిఖితపూర్వకంగా బదులిస్తూ ఈ విషయం పేర్కొన్నారు. కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలంటే దేశంలో రైల్వే కోచ్‌లకు తగినంత డిమాండ్ ఉండాలని, కానీ దేశంలో ఇప్పటికే ఉన్న కోచ్ ఫ్యాక్టరీలు, ప్రస్తుత అవసరాలతో పాటు సమీప భవిష్యత్తు అవసరాలను సైతం తీర్చగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని ఆయన వెల్లడించారు. ఈ పరిస్థితుల్లో కొత్తగా కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు. 

పునఃపరిశీలనలో విజయవాడ-గుంటూరు వయా అమరావతి రైల్వే లైన్

మరోవైపు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం – 2014 ప్రకారం ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానితో హైదరాబాద్ నగరాన్ని అనుసంధానిస్తూ ఏర్పాటు చేయాల్సిన రైల్వే లైన్ల గురించి ప్రశ్నించగా.. 2017-18 బడ్జెట్లో విజయవాడ నుంచి అమరావతి మీదుగా గుంటూరు వరకు సింగిల్ లైన్‌తో రైల్వే లైన్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని తెలిపారు. ఈ క్రమంలో ఎర్రుపాలెం – నంబూరు మధ్య 56.53 కి.మీ రైల్వే లైన్ ఏర్పాటుకు రూ. 1,732.56 కోట్ల అంచనాలతో సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) సిద్ధం చేశామని వెల్లడించారు. అయితే ఈ లైన్ మీదుగా రైల్వే ట్రాఫిక్ తగినంత ఉండే అవకాశం లేదని, పెట్టిన ఖర్చుకు తగినంత ఆదాయం తిరిగొచ్చే పరిస్థితి లేదని కేంద్ర ప్రభుత్వం అంచనాలు వేసిందని, ఈ క్రమంలో ప్రాజెక్టు నిర్మాణ వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత భరించాలని కోరామని అశ్విని వైష్ణవ్ తెలిపారు.

కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు అంగీకరించలేదని, ఫలితంగా ఈ ప్రాజెక్టు చేపట్టలేకపోయామని వివరించారు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజా ప్రతినిధుల నుంచి పదే పదే వస్తున్న విజ్ఞప్తుల నేపథ్యంలో ఈ ప్రాజెక్టును మరోసారి పరిశీలించి, తాజా రేట్లతో కొత్త డీపీఆర్ సిద్ధం చేయాలని జోనల్ రైల్వేకు సూచించామని, జోనల్ రైల్వే విభాగం ఆ పని చేపట్టిందని తెలిపారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement