Monday, April 29, 2024

కృష్ణా బోర్డు సమావేశం జనవరి 6 నుంచి 11కు వాయిదా

అమరావతి, ఆంధ్రప్రభ: రిజర్వాయర్‌ మేనేజ్‌ మెంట్‌ కమిటీ (ఆర్‌ఎంసీ)లో ఆమోదించిన తీర్మానాలపై చర్చించి కార్యాచరణ ప్రకటించేందుకు జనవరి 6న నిర్వహించతలపెట్టిన కృష్ణా బోర్డు సమావేశం వాయిదాపడింది. కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో భోపాల్‌లో జనవరి 5, 6న నిర్వహించనున్న నేషనల్‌ వాటర్‌ మిషన్‌ సదస్సులో రెండు తెలుగు రాష్ట్రాల జలవనరుల శాఖ మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొనాల్సి ఉన్నందున 6న ఏర్పాటు-చేసిన సమావేశాన్ని జనవరి 11కు వాయిదావేసినట్టు కృష్ణా బోర్డు ప్రకటించింది. ఈ మేరకు రెండు రాష్ట్రాల జలవనరుల శాఖ ఉన్నతాధికారులకు బోర్డు సమాచారం పంపించింది. జనవరి 11న సమావేశంలో చర్చించదలుకున్న అంశాలపై ఈనెల 26 లోపు బోర్డుకు ఎజెండా పంపించాల్సిందిగా రెండు రాష్ట్రాలను కోరింది. ఈనెల 3న ఆర్‌ఎంసీ లో తీసుకున్న నిర్ణయాల అమలే ప్రధాన లక్ష్యంగా నిర్వహించనున్న సమావేశంలో చర్చించదలుచుకున్న అంశాలను ముందుగా పరిశీలించి తుది ఎజెండాను ఖరారు చేయాలని బోర్డు భావిస్తోంది.

కృష్ణాలో మళ్ళించిన వరద జలాలను కోటాలో కలపాలా, వద్దా అనే అంశంతో పాటు శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుల్లో రూల్‌ కర్వ్స్‌ అమలు, విద్యుదుత్పత్తి అంశాలపై ఆర్‌ఎంసీలో చర్చించి తీర్మానాలను ఆమోదించారు. శ్రీశైలం ప్రాజెక్టు విషయంలో ఆర్‌ఎంసీ తీర్మానాలను రెండు రాష్ట్రాలు తొలుత ఆమోదించినా నివేదికపై సంతకాలు పెట్టేందుకు తెలంగాణ నిరాకరించింది. దీంతో కేవలం ఆర్‌ఎంసీ కన్వీనర్‌ రవికుమార్‌ పిళ్ళై, సభ్యుడు మౌతాంగ్‌, ఏపీకి చెందిన ఉన్నతాధికారులు నివేదికపై సంతకాలు చేసి కృష్ణా బోర్డు చైర్మన్‌ ఎంపీ సింగ్‌కు అందించారు. జనవరి 11 సమావేశంలో మరోసారి ఆర్‌ఎంసీ తీర్మానాలపై చర్చించిన తరువాత తదుపరి కార్యాచరణను కృష్ణా బోర్డు ప్రకటించనుంది.

- Advertisement -

వాటర్‌ విజన్‌ – 2047 సదస్సు

మధ్య ప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో వాటర్‌ విజన్‌ – 2047 పేరుతో నీటి వనరులపై పాతికేళ్ళ ప్రణాళికపై చర్చించేందుకు నేషనల్‌ వాటర్‌ మిషన్‌ జాతీయ సదస్సు నిర్వహణకు కేంద్ర జల మంత్రిత్వ శాఖ భారీ ఏర్పాట్లు చేస్తోంది. జనవరి 5, 6న రెండు రోజులు పాటు- నిర్వహించనున్న సదస్సులో జల వనరులకు సంబంధించి భిన్న విషయాలపై వర్క్‌ షాపులు, సదస్సులు నిర్వహించనున్నారు. జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌, ఏపీ, తెలంగాణతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల జలవనరుల శాఖ మంత్రులు, ఉన్నతాధికారులు, వివిధ నదీ బోర్డుల ఉన్నతాధికారులు, నిపుణులు పాల్గొననున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement