Wednesday, May 8, 2024

కరోనా ఉచిత బియ్యానికి మంగళం.. సూత్రప్రాయంగా నిర్ణయించిన కేంద్రం?

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ప్రధానమంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ అన్న యోజన పథకానికి కేంద్రం మంగళంపాడనుందని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే కరోనా లాక్‌డౌన్‌ నుంచి దాదాపు రెండేళ్లుగా ప్రతి నెలా ఉచితంగా అందుతున్న రేషన్‌ బియ్యం బంద్‌ కానున్నాయి. దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ సమయంలో లాక్‌డౌన్‌ కారణంగా ఆదాయ వనరులు లేక ఇబ్బందులు పడుతున్న పౌరులకు ఉపశమనం కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. నాలుగైదు రోజుల్లో రాష్ట్రంలోని రేషన్‌ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం ఈ చేదువార్తను చెప్పనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు రాష్ట్ర సివిల్‌సప్లై శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. కరోనా వైరస్‌ మహమ్మారి సమయంలో మొదటి వేవ్‌ నపథ్యంలో మార్చి -2020లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం కింద తెలుపు రాష్ట్రంలో రేషన్‌కార్డు కలిగి ఉన్న కోటి దాకా కుటుంబాలకు ప్రతి నెలా అయిదు కిలోల ఉచిత రేషన్‌ను అందిస్తున్నారు.

అప్పటి నుంచి ఈ పథకం అనేక సందర్భాలుగా ఇప్పటి వరకు పొడిగించుకుంటూ వస్తున్నారు. తాజాగా సెప్టెంబరు వరకు కేంద్రం ఈ పథకాన్ని పొడిగించింది. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 5 కిలోల ఉచిత బియ్యానికి తోడు రాష్ట్ర ప్రభుత్వం మరో 5 కిలోలు కలిపి 10 కిలోల బియ్యాన్ని పంపిణీ చేస్తోంది. ఎలాంటి పరిమితులు లేకుండా కార్డుపై ఎందరుంటే అందరికీ 10 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేస్తోంది. ఇప్పటి వరకైతే ఈ ఏడాది డిసెంబర్‌ వరకు 10 కిలోల బియ్యాన్ని ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో మొత్తం 90, 46,000 రేషన్‌ కార్డులు ఉండగా ఇందులో కేంద్ర ప్రభుత్వం కేవలం 53లక్షల కార్డుదారులకు మాత్రమే ఉచితంగా బియ్యాన్ని పంపిణీ చేస్తోంది. మిగతా కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వమే పంపిణీ చేస్తోంది. ఉచిత రేషన్‌పథకంతోపాటు వంటగ్యాస్‌పై సబ్సీడీని కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసిన విషయం తెలిసిందే.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement