Sunday, May 5, 2024

క‌రోనా కోత‌ల‌తో బ‌డ్జెట్ కు క‌త్తెర‌..

హైదరాబాద్‌, : వచ్చే ఏడాది బడ్జెట్‌ రూ. 1.50లక్షల కోట్లలోపే ఉండబోతోంది. ప్రస్తుత ఆర్ధిక ఏడాది రాబడుల్లో కోతల ప్రభావం వచ్చే బడ్జెట్‌పై తీవ్రంగా పడనుంది. ప్రస్తుత ఏడాది వనరులను పున:సమీక్షించుకున్న రాష్ట్ర ప్రభుత్వం రూ. 50వేలకోట్లకుపైగా కోతలు పడనున్నాయని అంచనా వేసింది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది బడ్జెట్‌ రూపలక్పన కత్తిమీద సాముగా మారింది. వనరుల వినియోగం, లభ్యత, గత అంచనాలు, కేటాయింపులు, వ్యయాలు, మిగులు నిధులు వంటి అన్ని సమగ్ర వివరాలతో శాఖలు ఆర్ధిక శాఖకు నివేదికలు అందజేయాలనే నిబంధనలు అమలు చేస్తున్నారు. దీంతో శాఖల వారీగా ప్రతిపాదనలకు కొంత జాప్యం తలెత్తుతోంది. ఈ కారణంగానే సీఎం కేసీఆర్‌ ఇంకా శాఖల వారీగా వరుస సమీక్షలు చేయడంలేదు. ఈ వారంలో బడ్జెట్‌పై కీలక సమీక్ష నిర్వహించి ఆర్ధిక శాఖకు ప్రభుత్వ ప్రాధాన్యతలు, నిధుల కేటాయింపులపై సర్కార్‌ వ్యూహం, కొత్త పథకాలు వంటి అన్ని అంశాలను వివరించానున్నారని తెలిసింది. దీంతో బడ్జెట్‌ రూపకల్పనపై ఆర్ధిక శాఖకు ఈ భేటీతో స్పష్టత రానుంది.
వచ్చే ఆర్ధిక ఏడాది బడ్జెట్‌(2021-22) రూపకల్పనకు ఆర్ధిక శాఖ కసరత్తు వేగవంతం చేసింది. కోవిడ్‌ నేపథ్యంలో 2020-21 సవరించిన బడ్జెట్‌ అంచనాలు, తగ్గిన రాబడుల అంచనాలే వచ్చే ఏడాది బడ్జెట్‌ రూపకల్పనకు కీలక ప్రాతిపదిక కానున్నాయి. ప్రస్తుతం నడుస్తున్న ఆర్ధిక ఏడాది వ్యయాల ఆధారంగానే వచ్చే ఏడాదికి అవసరమైన మొత్తాలను ప్రతిపాదించేలా కసరత్తు చేస్తున్నారు. రాబడి అంచనాల్లో భారీ కోతలు పడుతున్న నేపథ్యం, అప్పులతో ఈ ఏడాది గట్టెక్కిన అంశాలను పరిగణలోకి తీసుకుని అన్ని శాఖల ప్రతిపాదనల్లో భారీ తగ్గింపులు ఉండనున్నట్లు తెలిసింది. వచ్చే బడ్జెట్‌లో కీలకమైన ఇరిగేషన్‌, వ్యవసాయ రంగాలకు ప్రధాన్యత తప్పనిసరని, రైతుబంధు, రైతు బీమా, మూడో విడత రుణమాఫీకి నిధుల కేటాయింపు ఉంటుందని ఇప్పటికే ఆర్ధికశాఖ సూత్రప్రాయంగా వెల్లడించింది. అదేవిధంగా చివరి దశలో ఉన్న ఇరిగేషన్‌ ప్రాజెక్టుల పూర్తికి అదనపు నిధులను కేటాయిచే యోచనలో ఉంది. ఇక నిరుద్యోగ భృతి, ఇతర సంక్షేమ పథకాలను ఖచ్చితంగా కొనసాగించే ఆలోచనలో సర్కార్‌ ఉంది. ఈ దిశగా నిధుల కేటాయింపు, వచ్చే రాబడులను సమన్వయం చేసుకోనున్నారు. అయితే భారీ అంతరం నేపథ్యంలో ప్రత్యమ్నాయ మార్గంగా సొంత వనరుల పెంపునే ఫోకస్‌ పెట్టారు. ఇందులో భాగంగా ఆర్ధిక వనరుల పెంపుపై అధ్యయనం చేసిన మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన సిఫార్సులను అమలు చేసేందుకే సర్కార్‌ మొగ్గు చూపిస్తున్నది.
రాజీవ్‌స్వగృహ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ నేతృత్వంలో మున్సిపాలిటీలు, మున్సిపల్‌ కార్పొరేషన్‌లలో 32 ప్రాజెక్టులను పరిశీలిస్తున్నారు. 46,565 యూనిట్లను 4కోట్ల చదరపు అడుగుల్లో రూ. 8,504కోట్ల వ్యయంతో పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్ధేశించుకోగా 20 హౌజింగ్‌ ప్రాజెక్టులు రూ. 6301 కోట్ల వ్యయంతో 2008-2011 మధ్య కాలంలో పూర్తయ్యా యి. బ్యాంకు లింకేజీలతో ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టుకు 2011లో కార్పొరేషన్‌ ఎదుర్కొన్న ఆర్ధిక సంక్షోభం కారణంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంది. 2013లో మంత్రుల కమిటీ ఈ ప్రాజెక్టును ఇక ముందుకు కొనసాగించడం కష్టమని నిర్ణయించి ఎక్కడికక్కడే నిలిపివేసేలా నిర్ణయించింది. దీంతో కొన్ని నిర్మాణాలు అసంపూర్తిగా మిగిలిపోయాయి. కాగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెలంగాణ ప్రభుత్వం రాజీవ్‌స్వగృహ కార్పొరేషన్‌ రుణాలను తీర్చింది. మార్టిగేజ్‌లో ఉన్న ప్రాజెక్టులకు చెందిన రుణాలు రూ. 1071.39కోట్లను తెలంగాణ ప్రభుత్వం చెల్లించి ఈ ఆస్తులను బ్యాంకులనుంచి విడిపించింది. బండ్లగూడ, పోచారంలోని పూర్తయిన ఇండ్లను ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాలని 2016లో ప్రభుత్వం నిర్ణయించింది.
ఇతర భూములపై కూడా…
మిగులు, ప్రభుత్వ అసైన్డ్‌ భూములతో పక్కా విధానంతో భారీగా రాబడి సమకూర్చుకోవాలనే ప్రతిపాదన సిద్దమవుతోంది. వచ్చే ఐదేళ్లలో సుమారు రూ. 50 వేల కోట్లకుపైగా వేలంతో ఆదాయం సమకూర్చు కోవచ్చని అధికారులు అంచనా వేశారు. హైదరాబాద్‌ చుట్టూ ఉన్న హెచ్‌ఎండీఏ పరిధిలోని విలువైన భూములను ప్రత్యేకంగా తెప్పించుకుని రెవెన్యూ శాఖ అంచనాలు రూపొందించింది. ఇజ్జత్‌నగర్‌లో 36 ఎకరాలు, హైటెక్స్‌ సెంట్రల్‌ సెంటర్‌లో 8 ఎకరాలు, తెల్లాపూర్‌లో 46 ఎకరాలు, తాజాగా సుప్రీంకోర్టులో కేసు గెల్చిన ప్రభుత్వానికి స్వాధీనమైన కోకాపేటలోని 198 ఎకరాలు, మేడ్చేల్‌, శంషాబాద్‌, రాజేంద్రనగర్‌లలో ఉన్న ఎవాక్యూ భూములు, రాష్ట్రంలోని నిరుపయోగంగా ఉన్న పేదలకు పంచిన అసైన్డ్‌ భూముల వివరాలతో నివేదిక సిద్దం చేశారు. వీటి అమ్మకాలతో దశలవారీగా రూ. 50 వేలకోట్లు సమీకరించుకునే అవకాశాలను రెవెన్యూ శాఖ రూపొందించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement