Wednesday, May 15, 2024

ఇది ముమ్మాటికీ కక్షసాధింపే.. ఈడీ సమన్లను తప్పుబట్టిన కాంగ్రెస్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: నేషనల్ హెరాల్డ్ పత్రిక కేసులో విచారణకు హాజరుకావాలంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ఈడీ) జారీచేసిన సమన్లు రాజకీయ కక్షసాధింపేనని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. ఈ సమన్లనపై దేశవ్యాప్తంగా తలపెట్టిన నిరసన కార్యక్రమాల్లో భాగంగా దేశ రాజధాని ఢిల్లీలో చేపట్టిన నిరనస ప్రదర్శన ఉద్రిక్తతలకు దారితీసింది. అక్బర్ రోడ్‌లోని ఏఐసీసీ కార్యాలయం నుంచి కాలినడకన ఈడీ కార్యాలయం వరకు వెళ్లేందుకు నేతలు చేసిన ప్రయత్నాలను పోలీసులు అడ్డుకుని, అరెస్టు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో పోలీసులు కేసీ వేణుగోపాల్ సహా మరికొందరు నేతలపై దురుసుగా ప్రవర్తించడం కాంగ్రెస్ శ్రేణులకు ఆగ్రహం తెప్పించింది. బ్యారికేడ్లను దాటుకుంటూ వెళ్లే క్రమంలో జరిగిన తోపులాటలో ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కిందపడి గాయపడ్డారు. ఆయన మోకాలికి గాయం కావడంతో నడవడానికి ఇబ్బందిపడాల్సి వచ్చింది. నిరసన ప్రదర్శన సందర్భంగా మీడియాతో మాట్లాడిన కాంగ్రెస్ నేతలు కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాజకీయ ప్రత్యర్థులను వేధించడం కోసమే సీబీఐ, ఈడీ, ఇన్‌కం ట్యాక్స్ వంటి దర్యాప్తు సంస్థలను కేంద్రం ప్రయోగిస్తోందని మండిపడ్డారు.

ఈడీ అధికారులు బీజేపీ పన్నా ప్రముఖ్‌లుగా మారారు: మాణిక్యం టాగోర్

అసలు కేసే లేకుండా సమన్లు పంపి ఈడీ అధికారులు వేధింపులకు పాల్పడుతున్నారని కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్యం టాగోర్ ఆరోపించారు. బోగస్ కేసులు పెట్టి తమ నేత రాహుల్ గాంధీని, పార్టీ అధినేత్రి సోనియా గాంధీని ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రజాస్వామ్య పద్ధతిలో కనీసం తమకు నిరసన తెలియజేసే అవకాశం కూడా లేకుండా పోలీసులు ఆంక్షలు విధించడాన్ని ఆయన తప్పుబట్టారు. మోదీ-షాలు హిట్లర్-గోబెల్స్ తరహాలో వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. నేషనల్ హెరాల్డ్ కేసులో నిజం బయటపెట్టాలంటూ బీజేపీ నేతలు చేస్తున్న కామెంట్లపై స్పందిస్తూ.. ఎప్పుడూ అసత్యాలు ప్రచారం చేసే ఆరెస్సెస్-బీజేపీలకు సత్యం గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. కాంగ్రెస్ హయాంలో ఏనాడూ దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేయలేదని మాణిక్యం టాగోర్ అన్నారు. తాము ఎనాడైనా అటల్ బిహారీ వాజ్‌పాయిని, అడ్వాణీని, మోదీని ఈడీ విచారణకు పిలిచామా అంటూ ఆయన ప్రశ్నించారు. కేసులో ఏమీలేకపోయినా, అసలు ఎఫ్.ఐ.ఆరే లేకపోయినా సరే వేధింపుల కోసమే ఈడీ అధికారులు సమన్లు జారీ చేశారని ఆరోపించారు.

దేశ సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే… ఉత్తమ్ కుమార్ రెడ్డిదేశం ఎదుర్కొంటున్న అనేక సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించడం కోసమే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కారు గాంధీ కుటుంబానికి ఈడీ సమన్లు జారీ చేసిందని తెలంగాణ పీసీసీ మాజీ చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఏఐసీసీ వద్ద జరిగిన నిరసన ప్రదర్శనలో పాల్గొన్న ఆయన కేంద్ర ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. ఎలాంటి ఆధారాలు లేని పాతకేసును తిరగదోడి గాంధీ కుటుంబాన్ని అప్రతిష్టపాలుచేయాలన్న ఉద్దేశంతో ప్రధాని మోదీ – హోంమంత్రి అమిత్ షా దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తున్నారని మండిపడ్డారు. తప్పుడు కేసులతో రాజకీయ ప్రత్యర్థులను అణచివేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈ ప్రయత్నాలను ప్రజాస్వామ్య పద్ధతిలోనే ప్రతిఘటిస్తామని ఆయన తెలిపారు.

నిరసన తెలిపే హక్కు కూడా లేదా?: మధుయాష్కి

- Advertisement -

ప్రజలకు సమాచారాన్ని తెలుసుకునే హక్కును ప్రసాదించిన కాంగ్రెస్ పార్టీ ఏనాడూ ఏదీ దాచిపెట్టలేదని కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కి అన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసు గాంధీ కుటుంబాన్ని వేధించడం కోసమేనని ఆయనన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు సమాచారం తెలుసుకునే హక్కును, విద్యాహక్కును కల్పిస్తే బీజేపీ సర్కారు ప్రజలకు నిరసన తెలిపే హక్కు కూడా లేకుండా చేస్తోందని మండిపడ్డారు. ఈడీ సమన్లపై దేశవ్యాప్తంగా వెల్లువెత్తిన నిరసన కేవలం కాంగ్రెస్ పార్టీ నుంచే కాదని, సమాజంలో ప్రతిఒక్కరూ ఈ తరహా కక్షసాధింపు రాజకీయాలను వ్యతిరేకిస్తున్నారని ఆయనన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement