Monday, May 13, 2024

అన్నదాతకు తీపి కబురు.. లక్ష లోపు రుణమాఫీ ప్రక్రియ పూర్తి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : స్వాతంత్య్ర దినోత్సవానికి ఒకరోజు ముందుగానే రాష్ట్ర రైతాంగానికి తెలంగాణ సర్కారు తీపికబురు అందజేసింది. అన్నదాతల ఆర్థిక స్థితిగతులు, వారిలో పెరుగుతున్న ఆందోళనను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు తాజాగా ప్రకటించిన మేరకు రూ.లక్ష లోపు ఉన్న రుణమాఫీ ప్రక్రియను సోమవారంతో పూర్తి చేశారు. ఈ విషయాన్ని సీఎం కార్యాలయం అధికారికంగా వెల్లడించింది. ఇచ్చిన హామీ మేరకు ఒక గడువును నిర్ధేశించుకుని లక్షలాది మంది పేద రైతు కుటుంబాల్లో సంతోషాన్ని నింపారు. వ్యవసాయ రంగంలో ఉజ్వల భవిష్యత్తుపై వారిలో భరోసా కల్పించారు. ఇప్పటి వరకు 16.16 లక్షల మంది రైతు కుటుంబాలకు లక్ష రూపాయల్లోపు రుణ విముక్తి కలిగింది. మొత్తం రూ.7,753 కోట్ల మొత్తాన్ని ఆయా బ్యాంకుల రుణ ఖాతాల్లో జమ చేసి ప్రభుత్వం చిత్తశుద్ధిని నిరూపించుకుంది.

ఈ నెల గడిచిన 2న జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో రుణమాఫీపై నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్‌.. ఆగస్టు 3 నుంచి రైతుమాఫీ ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని ఆర్థికమంత్రి హరీశ్‌రావు, సంబంధిత ఉన్నతాధికారులను ఆదేశించారు. ఆ మేరకు ఆర్థిక శాఖ నిధులను విడుదల చేసింది. సోమవారం ఒకే రోజు 10,79,721 మంది రైతుల ఖాతాల్లో రూ.6,546,05 కోట్ల మొత్తాన్ని జమ చేసింది.

- Advertisement -

ఎన్ని కష్టాలొచ్చినా రైతు సంక్షేమం ఆగదు : సీఎం కేసీఆర్‌

తెలంగాణ రైతాంగ సంక్షేమం వ్యవసాయాభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఎన్ని కష్టాలొచ్చినా రైతుల సంక్షేమం కోసం ఇచ్చిన మాటకు కట్టు-బడి ఉంటామని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. రాష్ట్రంలో రుణమాఫీ ప్రక్రియ ఈ నెల 3న ప్రారంభం కాగా.. తొలిరోజు రూ.41వేల లోపు 62,758 మంది రైతుల రుణాలను ప్రభుత్వం మాఫీ చేసినట్లు తెలిపారు. విడతల వారీగా రైతుల రుణాలను మాఫీ చేస్తూ వచ్చిన తమ ప్రభుత్వం.. మిగతా రైతుల రుణాలను ఒకేసారి పూర్తి చేసిందని వెల్లడించారు. ఇచ్చిన మాట మేరకు రుణమాఫీ పూర్తి చేశామని, ఇక రైతులు తమతమ బ్యాంకులను సంప్రదించి విముక్తి పత్రాలను పొందవచ్చునని తెలిపారు.

2018 డిసెంబర్‌ 11న ప్రకటన

మలివిడత అధికారంలోకి వచ్చిన తర్వాత 2018 డిసెంబర్‌ 11 నాటికి రాష్ట్రంలో లక్ష లోపు పంట రుణాలు తీసుకున్న రైతులందరికి రుణమాఫీ చేస్తామని సీఎం కేసీఆర్‌ మాట ఇచ్చిన విషయం తెలిసిందే. ఎన్నికల హామీలలో కూడా దశలవారీగా రుణమాఫీ చేస్తామని చెప్పారు. ఆ తర్వాత రైతు రుణమాఫీకి సంబంధించిన సమగ్ర కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ గారి ఆదేశాలతో వ్యవసాయ, ఆర్థిక శాఖ అధికారులు బ్యాంకులకు ప్రత్యేకంగా లేఖలు రాసి సమగ్ర వివరాలు తెప్పించుకున్నారు.

ఇదంతా జరగడానికి ఒక ఏడాది సమయం పట్టింది. అయితే, అనూహ్యంగా ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభించడం, లాక్‌ డౌన్‌ ఉండడం, మన దేశంలో నోట్ల రద్దు పర్యవసానాలతో ఆర్థిక వ్యవస్థ ఒక్కసారిగా ఒడిదొడుకులకు గురికావడంతో ప్రభుత్వానికి వనరులు సమకూరడంలో ఇబ్బంది ఏర్పడింది. అయినప్పటికీ ఇప్పటికే 50వేల లోపు రుణాలు ఉన్న 7,19,488 మంది రైతులకు సంబంధించి 1943 కోట్ల 64 లక్షల రూపాయలను బ్యాంకులకు ప్రభుత్వం ఇదివరకే చెల్లించింది.

చెప్పింది 45 రోజులు.. చేసింది వారం లోపే..

ఈ నెల ప్రారంభంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి గరిష్టంగా 45 రోజుల్లోగా రుణమాఫీ ప్రక్రియను పూర్తిచేయాలని సీఎం కేసీఆర్‌ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఈ నెల 3నఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌ రావు బడ్జెట్‌ రీలిజింగ్‌ ఆర్డర్‌ (బీఆర్‌వో) ఇచ్చారు. అదే రోజు నుంచి రుణమాఫీకి సంబంధించిన నిధుల విడుదల ప్రక్రియ మొదలైంది. ఇచ్చిన మాట ప్రకారం, 99వేల 999 రూపాయల వరకు ఉన్న అప్పు మొత్తాన్ని తీర్చేయాలని తాజాగా ఆదేశాలు ఇచ్చారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో మొత్తంగా 16లక్షల 66వేల 899 మంది రైతులకు లబ్దిచేకూరింది.

హామీ నెరవేర్చే క్రమంలో నిరంతర పర్యవేక్షణ

సీఎం కేసీఆర్‌, ఆర్థిక మంత్రి హరీష్‌రావు నిరంతరం పర్యవేక్షిస్తూ, రుణమాఫీ హామీని నెరవేర్చేందుకు పకడ్బందీ ఏర్పాట్లు- చేశారు. ఈ నెల 3న రూ.41వేల లోపు రుణాలున్న 62వేల 758 మంది రైతులకు సంబంధించి 237 కోట్ల 85 లక్షల రూపాయలను విడుదల చేశారు. అలాగే 4న 43వేల లోపు రుణాలున్న 31వేల 339 మంది రైతులకు సంబంధించి 126 కోట్ల 50 లక్షల రుణాలను మాఫీ చేస్తూ నిధులను బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు.

తాజాగా 99వేల 999 రూపాయల వరకు ఉన్న రుణ మొత్తాలను జమ చేశారు. అధికారులు వెల్లడించిన సమాచారం మేరకు 99వేల 999 రూపాయల వరకు అప్పున్న రైతుల సంఖ్య 9లక్షల 2 వేల 843 ఉంది. మొత్తం 16 లక్షల 66వేల 899 మంది రైతులకు రూ.7753 కోట్ల 43లక్షల రూపాయలను ప్రభుత్వం రుణమాఫీ కింద నిదులను విడుదల చేసింది.

బహుళార్థక చేయూతతో రైతు రాజ్యం..

తెలంగాణ రాష్ట్రం రైతు రాజ్యమని సీఎం కేసీఆర్‌ మరోసారి నిరూపించుకున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సాగునీటి వసతులు కల్పించి రైతాంగంలో చైతన్యం నింపారు. మిషన్‌ కాకతీయ పేరుతో 35వేల చెరువులను బాగు చేయడంతో పాటు- కాళేశ్వరం వంటి బహుళార్థక సాధక ప్రాజెక్టు కట్టి సాగునీటి రంగంలో అద్భుతం సృష్టించారు. రైతులకు సకాలంలో ఎరువులను అందుబాటులొ పెట్టడం, విత్తనాలు అందించడం, నకిలీ విత్తనాలు బెడద రైతులకు రాకుండా నకిలీ విత్తనాల తయారీ, సరఫరాదారులపై పీడీ చట్టం ప్రయోగించి వారిని జైళ్లకు పంపడం, రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయడం, రైతులకు మార్కెటింగ్‌ సౌకర్యాలు కల్పించడం.. ఇలా ఎన్నో.. ఎన్నెన్నో అద్భుతాలను రైతుల అభ్యున్నతి కోసం కేసీఆర్‌ సర్కారు చేపట్టింది.

రాష్ట్ర ఏర్పడిన కొత్తలో రూ.లక్ష మాఫీ

2014 నాడు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మొట్టమొదటి ముఖ్యమంత్రిగా సీఎం కేసీఆర్‌ అప్పటి వరకు బ్యాంకులకు రైతులు బకాయిపడ్డ రూ.లక్ష వరకు ఉన్న రుణాలను మాఫీ చేశారు. ఈ నిర్ణయంతో 35 లక్షల 32వేల మంది రైతులకు నేరుగా లబ్ది చేకూరింది. అందుకు ప్రభుత్వం అక్షరాల 16వేల 144 కోట్లను వెచ్చించింది. ఒక రాష్ట్ర ప్రభుత్వంగా కేంద్ర ప్రభుత్వంపై ఆధారపడకుండానే ఈ మొత్తాన్ని బ్యాంకులకు చెల్లించి రైతులను రుణ విముక్తులను చేసింది. 2014లో రైతు రుణమాఫీ చేసిన విధంగానే 2018లో అధికారంలోకి వస్తే కూడా రైతులకు సంబంధించి రూ.లక్ష వరకు ఉన్న బ్యాంకు రుణాలను మాఫీ చేస్తామని ఎన్నికల సందర్భంగా కేసీఆర్‌ ప్రకటించారు. ఇచ్చిన మాటకు కట్టు-బడుతూ రైతు రుణమాఫీ చేస్తున్నారు. నేటి వరకు 16 లక్షల 66వేల 899 మంది రైతులకు సంబంధించి 7753 కోట్ల 43 లక్షల రుణాలను మాఫీ చేసింది.

తెలంగాణ ప్రతిష్టను పెంచిన ‘రైతుబంధు’

దేశ రైతాంగ చరిత్రలోనే రైతు బంధు అతి గొప్ప సంస్కరణ. రాష్ట్రంలో 65 లక్షల మంది రైతులకు ప్రత్యక్ష ప్రయోజనం కలిగేలా పథకాన్ని రూపొందించారు. ఎకరానికి సాలీనా రూ.10వేల చొప్పున ఇప్పటి వరకు గడిచిన 11 విడుతలలో కలిపి రూ.71వేల 552 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసింది. ప్రతీ సంవత్సరం రైతు బంధు అందుకునే రైతుల సంఖ్య పెరుగుతున్నది. ఈసారి కొత్తగా పోడుపట్టాలున్నరైతులకు కూడా రైతుబంధు, రైతు బీమా వర్తింప చేశారు. దీంతో లక్షా 51వేల 469 మంది గిరిజన రైతులకు 4 లక్షల 6వేల ఎకరాలకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే రూ.200 కోట్లను విడుదల చేసింది. ఇది ఈ సీజన్‌కు మాత్రమే. ఏడాదికి రూ.నాలుగు వందల కోట్లను కేవలం పోడు రైతులకు రైతుబంధు కింద అందించనున్నారు.

రైతు బీమా.. చెరగని ధీమా

పుట్టెడు దు:ఖంతో ఉన్న రైతు కుటుంబాలను ఆదుకోవాలన్న లక్ష్యంతో కేసీఆర్‌ ప్రభుత్వం రైతు బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. ఏ కారణంతోనైనా రైతు మరణిస్తే వారి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించాలన్న లక్ష్యంతో రాష్ట్రంలోని ప్రతీ రైతుకు బీమా సౌకర్యం కల్పిస్తున్నది. ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తున్నది. రాష్ట్రంలో వివిధ కారణాలతో ఇప్పటి వరకు మరణించిన రైతులకు సంబంధించి 1,08,051మంది రైతు కుటు-ంబాలకు అండగా నిలిచింది. 5,402.55కోట్లను పరిహారంగా అందించింది. రైతు మరణించిన కేవలం 15 రోజుల్లోనే బీమా సొమ్ము రైతులకు అందేలా ఏర్పాట్లు- చేసింది. ఇది దేశంలోని మరే రాష్ట్రంలో లేదని డంకా బజాయించి ప్రకటించుకుంది.

వెలుగులు నింపిన ఉచిత విద్యుత్తు

దేశంలో రైతులకు 24 గంటలపాటు ఉచిత నాణ్యమైన విద్యుత్తు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే. రాష్ట్రంలో 27 లక్షల 49వేల వ్యవసాయ కనెక్షన్లకు ఉచిత విద్యుత్తు అందిస్తున్నది. ఉచిత విద్యుత్తు అందించేందుకు గడిచిన తొమ్మిదిన్నర సంవత్సరాల్లో 96 వేల288 కోట్ల రూపాయల ఖర్చును ప్రభుత్వం భరిస్తున్నది. రాష్ట్రం ఏర్పడ్డనాటి నుంచి విద్యుత్తు రంగంలో మౌళిక వసతుల కల్పన కోసం అక్షరాల 32వేల 700 కోట్లను ఖర్చు చేసింది. కేవలం తొమ్మిదిన్నరేళ్లలో ఈ స్థాయిలో విద్యుత్తు రంగంపై ఖర్చు చేసిన రాష్ట్ర ప్రభుత్వం మరొకటి లేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement