Wednesday, May 8, 2024

రేషన్‌ బియ్యం అక్రమాలకు చెక్‌… ఇకపై 4జీ టెక్నాలజీతో పంపిణీ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ప్రజా పంపిణీ వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేసే రేషన్‌ బియ్యంతోపాటు ఇతర సరుకులను దారిమళ్లించే అక్రమాలకు చెక్‌పడనుంది. వేలిముద్రలు పడని వారికి, రేషన్‌ దుకాణం వరకూ రాలేని వారి కోసం తీసుకొచ్చిన ఓటీపీ విధానాన్ని క్షేత్రస్థాయి సిబ్బంది, కొందరు రేషన్‌ డీలర్లు తమ అక్రమాలకు ఆలవాలం చేసుకుంటున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఇంకా అనేక మార్గాల్లో రేషన్‌ బియ్యాన్ని పక్కదారిపట్టిస్తున్న డీలర్లు, అధికారుల వ్యవహారాలు నిత్యం రాష్ట్రంలో ఏదో ఒక ప్రాంతంలో వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రజా పంపిణీ వ్యవస్థలో ఎదురవుతున్న ఇబ్బందులకు చెక్‌ పెట్టేందుకు ప్రభుత్వం ఈ-పాస్‌ యంత్రాలను అందుబాటులోకి తెచ్చింది. జులై మొదటి వారం నుంచి ఆధునీకరించిన ఈ కొత్త మిషన్ల ద్వారానే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చౌకధరల దుకాణాల్లో రేషన్‌ బియ్యం పంపిణీ కానున్నాయి. ఈ-పాస్‌ యంత్రాల్లో ప్రస్తుతం వినియోగిస్తున్న 2జీ నెట్‌ వర్క్‌ స్థానంలో… 4జీ నెట్‌ వర్క్‌ ను అనుసందానించడం ద్వారా ఈ-పాస్‌ యంత్రాలను ఆధునీకరించారు.

ప్రస్తుతం అమలు చేస్తున్న 2జీ సామర్థ్యంతో కూడిన ఈపాస్‌ యంత్రాలు, ఓటీపీ ఆధారిత విధానంలో మొబైల్‌ సిగ్నల్‌ అందని మారుమూల, ఏజెన్సీ ప్రాంతాల్లో పంపిణీ చేస్తున్న బియ్యం, ఇతర సరుకులను కొందరు డీలర్లు, అధికారులు పక్కదారి పట్టిస్తున్నారు. ఈ సమస్యల నేపథ్యంలో ఏ ప్రాంతంలో ఏ కంపెనీ సెల్‌ సిగ్నల్‌ బలంగా వస్తుందో ఆ ప్రాంతంలో అదే కంపెనీ సిమ్‌కార్డుతో ఈ-పాస్‌ యంత్రాలను వినియోగించేలా ఈ-పాస్‌ యంత్రాల్లో సాంకేతికతను ఆధునీకరించారు. ప్రముఖ కంపెనీల సిమ్‌కార్డులు అందుబాటులోకి తెచ్చే బాధ్యతను టెక్‌విజన్‌ కంపెనీ నిర్వహిస్తోంది. కొత్త ఈ-పాస్‌ మిషన్లలో ప్రతి వినియోగదారుడికి కచ్చితంగా వారి వివరాలతో కూడిన ప్రింట్‌ ఇవ్వాల్సి ఉంటుంది. ఇందులో వారికి వచ్చిన బియ్యం ఎంత, ఇతర వివరాలు ఉండనున్నాయి. సదరు కంట్రోల్‌ షాపు నుంచి ఎన్నికిలోల బియ్యం తీసుకుంది..? తదితర వివరాలతో తెలుగులో వాయిస్‌ మెసేజ్‌ వస్తుంది. లబ్దిదారుడికి సరుకుల పంపిణీకి సంబంధించి ఈ-పాస్‌ మిషన్‌లో పేపర్‌ రోల్‌ ఉంటేనే ప్రక్రియ పూర్తి కానుంది. ప్రింట్‌ ఇవ్వడం, వాయిస్‌ మెసేజ్‌ రావడం పూర్తయ్యాకే మరొకరికి సరుకులు పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఆధునీకరించిన ఈ-పాస్‌ యంత్రాలను ఇప్పటికే అన్ని జిల్లాలకు చేర్చారు. ఈ యంత్రాల వినియోగంపై పౌరసరఫరాలు, రెవెన్యూశాఖల అధికారులు రేషన్‌ డీలర్లకు డివిజన్ల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 87.55 లక్షల ఆహార భద్రతా కార్డులు ఉండగా… వీటిలో 2,97కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement