Monday, May 6, 2024

Delhi | ప్రధాని కార్యక్రమానికి రాలేనంత ముఖ్యమైన పని కేసీఆర్‌కు ఏముంది? తెలంగాణ సీఎంపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ధ్వజం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ప్రధానమంత్రి తెలంగాణ పర్యటనకు వచ్చినా ఆయన కార్యక్రమానికి హాజరు కాలేనంత ముఖ్యమైన పని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఏముందో ప్రజలకు చెప్పాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి  డిమాండ్ చేశారు. బీజేపీలో చేరిన మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డితో తన నివాసంలో సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ నగర పర్యటనపై స్పందించారు. మోదీ తెలంగాణ పర్యటన విజయవంతం అయిందని, ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. చాలా తక్కువ సమయంలో ప్రభుత్వ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో జనం వచ్చారని చెప్పారు. తెలంగాణకు మేలు జరిగే అనేక మౌలిక వసతుల ప్రాజెక్టులను మోదీ ప్రారంభించారని, రూ. 11,500 కోట్ల విలువైన ప్రాజెక్టులను ఆయన చేపట్టారని వెల్లడించారు. ఉభయ రాష్ట్రాలకు మేలు జరిగే రాజమండ్రి – హైదరాబాద్ వయా ఖమ్మం జాతీయ రహదారి, వందే భారత్ 14వ రైలు (సికింద్రాబాద్ – తిరుపతి) ఇచ్చారు, 14 రైళ్లలో రెండు తెలంగాణకు ఇచ్చారని వివరించారు.

- Advertisement -

వందే భారత్ రైలును ప్రారంభించి బుకింగ్ ఓపెన్ చేస్తే 10 నిమిషాల్లో టికెట్స్ అయిపోయాయని కిషన్‌రెడ్డి చెప్పారు. రీజినల్ రింగ్ రోడ్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేదని, భూసేకరణలో కూడా సగం కేంద్రం భరిస్తున్నా సరే రాష్ట్ర ప్రభుత్వం సపోర్ట్ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ, ఎయిమ్స్ ఆస్పత్రి పనులు సహా అనేక ప్రాజెక్టులు ప్రారంభోత్సవానికి ఉన్నాయని, ఇన్ని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి రావడానికి సీఎం కేసీఆర్‌కు సమయం లేదని కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. వేదిక మీద సీఎం కోసం కుర్చీ కూడా సిద్ధం చేసి ఉంచినా సరే ఆయన రాలేదని చెప్పుకొచ్చారు. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను ఎలా జైల్లో పెట్టాలి అన్న విషయం మీదే ఆయన దృష్టి ఉందని విమర్శించారు. కేసీఆర్ వందల వేల ఎకరాల భూములను సెటిల్ చేస్తూ వేల కోట్లు పోగేస్తున్నారని ఆరోపించారు. దేశంలో అన్ని పార్టీల ఎన్నికల ఖర్చు భరిస్తా అని కేసీఆర్ చెప్పారని, అంత డబ్బు ఆయనకు ఎక్కడిదని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు.

రామగుండం ఎరువుల కర్మాగారం ప్రారంభించడానికి మోదీ వస్తే అప్పుడు కూడా కేసీఆర్ రాలేదని గుర్తు చేశారు. తెలంగాణ అభివృద్ధి గురించి ఆయనకు ఏమాత్రం ఆలోచన లేదని, తాను పీఎం కావాలని, తన కొడుకు సీఎం కావాలన్న తాపత్రయం తప్ప మరేమీ లేదని మండిపడ్డారు. ఎంతో పని ఒత్తిడి ఉన్నప్పటికీ ప్రధాని తెలంగాణకు వచ్చారని చెప్పుకొచ్చారు. కనీస సంప్రదాయాలు పాటించకుండా కేసీఆర్ వ్యవహరించిన తీరును తెలంగాణ సమాజం గమనిస్తోందని కిషన్‌రెడ్డి దుయ్యబట్టారు. బాధ్యతారహితంగా వ్యవహరించిన సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ ఎప్పుడూ ప్రజల్లో ఉంటారన్న ఆయన, కేసీఆర్ ఫాం హౌస్ లేదా ప్రగతి భవన్ వీడి బయటకు రారని ఎద్దేవా చేశారు. అలాంటి వ్యక్తి మంత్రులతో ప్రధానిని తిట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. తమకు కేసీఆర్‌తో వైరం లేదని, తెలంగాణ ప్రజలతో ఆయనకు వైరం ఉందని వ్యాఖ్యానించారు. అన్ని ప్రభుత్వ వేదికల మీద రాష్ట్ర ప్రభుత్వం ప్రధానిని విమర్శిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి అవినీతి, అహంకార, కుటుంబ పాలనను కూకటివేళ్లతో పెకిలించాలని కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement