Wednesday, May 8, 2024

ఉద్యోగులకు ఒంటిపూట విధులు.. పంజాప్‌ ప్రభుత్వం సంచలన నిర్ణయం

పంజాబ్‌ ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. వేసవి తీవ్రత నేపథ్యంలో, బడి పిల్లల మాదిరిగానే, ప్రభుత్వ ఉద్యోగులకు ఒంటిపూట ఆఫర్‌ ప్రకటించింది. వచ్చేనెల నుంచి ఉద్యోగులను ఒంటిపూట విధులకు పరిమితం చేయనుంది. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్‌ సింగ్‌ మాన్‌ శనివారం అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం అన్ని ప్రభుత్వ కార్యాలయాల పనివేళలు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతున్నాయి. మే 2నుంచి ఉదయం 7.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జులై 15 వరకు ఈ కొత్త పనివేళలు అమలులో ఉంటాయి అని సీఎం మాన్‌ ఓ వీడియో సందేశంలో వెల్లడించారు.

ప్రభుత్వ ఉద్యోగులతోపాటు నిపుణులతో చర్చించిన మీదటే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు. తాను కూడా ఉదయం 7.30 గంటలకే కార్యాలయానికి చేరుకుంటానని సీఎం చెప్పారు. ఆఫీసుల పనివేళల మార్పుద్వారా విద్యుత్‌ వినియోగం కూడా తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. మధ్యాహ్నం 1.30 గంటల తర్వాత విద్యుత్‌పై లోడ్‌ అధికంగా ఉందని, ఇప్పుడది 300-350మె.వాట్లు తగ్గుతుందని చెప్పారు. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని వాతావరణ విభాగం హెచ్చరికల నేపథ్యంలో పంజాబ్‌ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారవర్గాలు పేర్కొంటున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement