Sunday, May 5, 2024

ప‌త్తి రైతుల‌కు ఆశ‌నిపాతం..జూట్ కార్పొరేష‌న్ లో సిసిఐ విలీనం..

అమరావతి, ఆంధ్రప్రభ: పత్తి రైతులకు కొన్ని దశాబ్దాలుగా ఆపద సమయంలో ఆలంబనగా నిలుస్తున్న కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) క్రమేపీ ప్రాభవం కోల్పోతుంది. చరిత్రలో ఒక జ్ఞాప కంగా మిగిలిపోనుంది. సీసీఐను పూర్తిగా తెరమరుగు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్దం చేస్తున్నట్టు- సమాచారం. పత్తి కొనుగోలు బాధ్యతల నుంచి పూర్తిగా తప్పుకునేందుకు సైతం ప్రణాళిక సిద్ధమైనట్టు- తెలిసింది. అతి త్వరలోనే సీసీఐను జాతీయ జనపనార సంస్థ (జ్యూట్‌ కార్పొరేషన్‌)లో విలీనం చేసేందుకు కేంద్రం వడివడిగా అడుగులు వేస్తోంది. సీసీఐను జ్యూట్‌ కార్పొరేషన్‌లో విలీనం చేయాలని గతంలోనే సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నప్పటికీ కేంద్రం ఈ ఏడాదే ఆ తంతును పూర్తి చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. దీనిలో భాగంగానే ఇటీ-వల ప్రవేశపెట్టిన 2023-24 బడ్జెట్‌ లో సీసీఐకు కేవలం లక్ష రూపాయల బడ్జెట్‌ ను మాత్రమే కేటాయించింది. విలీన ప్రక్రియను అతి త్వరలోనే పూర్తి చేసేందుకు నిర్ణయించినందువల్లనే సీసీఐకు కేవలం లక్ష రూపాయల బడ్జెతో సరిపెట్టింది. 2021-22లో సీసీఐ బడ్జెట్‌ రూ 8,331.96 కోట్లు-..2022-2023లో రూ 9,243 కోట్లు-..ఇలా ప్రతి ఏటా రూ 5 నుంచి రూ 10 వేల కోట్లను బడ్జెట్‌ లో కేటాయించే కేంద్రం కేవలం లక్ష రూపాయలతో సరిపెట్టటం ద్వారా సీసీఐపై కేంద్రం తన వైఖరిని వెల్లడించింది. 2021-22, 2022-23 బడ్జెట్‌ కేటాయింపుల్లో సగం నిధులను కూడా కేంద్రం విడుదల చేయలేదు. 2014-15 నుంచి 2020-21 వరకు సీసీఐ రూ 17,408 కోట్ల భారీ నష్టాలను మూటకట్టు-కోవటం వల్లనే ఇక ఆ సంస్థను ఆదుకోవటం తమ వల్ల కాదని కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నట్టు- తెలిసింది. జ్యూట్‌ కార్పొరేషన్‌ లో సీసీఐను విలీనం చేసిన తరువాత పత్తి కొనుగోలు ప్రక్రియ నుంచి కూడా కేంద్రం దశలవారీగా వైదొలగనుందనీ, మరికొద్ది నెలల్లోనే పత్తి మార్కెట్‌ లోప్రయివేట్‌ సంస్థలు గుత్తాధిపత్యం వహించే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు.


రైతులకు భరోసా..50 ఏళ్ళ ప్రస్థానం
కేంద్ర జౌళిశాఖ 1970 జులై 31న 1956 కంపెనీల చట్టం కింద ప్రారంభించిన కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆపద సమయంలో రైతులకు అండగా నిలబడుతోంది. కేంద్రప్రభుత్వం ప్రతి ఏటా పత్తికి మద్దతు ధర ప్రకటిస్తుంది. మార్కెట్‌ ఒడిదుడుకులతో పాటు- తీవ్ర సంక్షోభ సమయాల్లోనూ సీసీఐ మాత్రం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు కట్టు-బడి రైతుల నుంచి ముడి పత్తిని కొనుగోలు చేస్తుంది. రైతుల నుంచి కొనుగోలు చేసిన పత్తిని -టె-క్స్‌-టైల్‌ కంపెనీలకు విక్రయించటం వ్యాపార కార్యాకలాపాలు నిర్వహిస్తోంది. ముంబై ప్రధాన కార్యాలయంగా దేశవ్యాప్తంగా పత్తి పండించే ప్రాంతాలకు చేరువగా ఉన్న 19 నగరాల్లో సీసీఐ కార్యాలయాలున్నాయి. 400కు పైగా పత్తి సేకరణ కేంద్రాలను సీసీఐ ఏర్పాటు- చేసింది. పత్తిని అత్యధికంగా పండించే రాష్ట్రాల జాబితాలో ఉన్న ఏపీ, తెలంగాణలకు సీసీఐతో ప్రత్యేక అనుబంధం ఉంది. గుంటూరులోని సీసీఐ కేంద్రం పర్యవేక్షణలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పత్తి సేకరణ కేంద్రాలు నడుస్తున్నాయి. తెలంగాణలోని వరంగల్‌, మహబూబ్‌ నగర్‌, అదిలాబాద్‌ కేంద్రాల పరిధిలోని రైతులకు చేరువలో పత్తి సేకరణ కేంద్రాలున్నాయి. పత్తి రైతులకు ఏ రూపంలో మార్కెట్లో నష్టాలు ఎదురవుతున్నా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలతో సీసీఐ పంటను కొనుగోలు చేస్తోంది. ఎంతోమంది రైతులు మార్కెట్లో ధరలు కాస్త ఎక్కువున్న సందర్భాల్లోనూ ఇతర మోసాల భయంతో తమ పంటను సీసీఐ ద్వారానే అమ్మకాలు సాగిస్తుంటారు. రెండు తెలుగు రాష్ట్రాల్ల్రో పండే పత్తి పంటలో కనీసం 40 శాతం పంటను సీసీఐ కొనుగోలు చేస్తోంది. సీసీఐ రంగంలో ఉంటే మార్కెట్లో పోటీ- ఉంటు-ంది. ప్రయివేట్‌ వ్యాపారులు ఇష్టారీతిన ధరలు నిర్ణయించటం సాధ్యం కాదు..బహిరంగ మార్కెట్లో ధరలు పడిపోతే సీసీఐ ద్వారా రైతులకు కనీస మద్దతు ధర లభించటం వల్ల రైతులు కనీసం నష్టపోకుండా బయటపడే వెసులుబాటు- ఉంటు-ంది. ఈ నేపథ్యంలో సీసీఐ విలీనాన్ని రైతు సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. సీసీఐకు జవసత్వాలు సమకూర్చటం మానేసి పత్తి కొనుగోలు బాధ్యతల నుంచి పూర్తిగా వైదొలిగేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను విరమించుకోవాలని డిమాండ్‌ చేస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement