Friday, May 3, 2024

భావితరాల కోసం కులగణన చేయాల్సిందే : బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య..

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : భావితరాల బంగారు భవిష్యత్ కోసం కేంద్ర ప్రభుత్వం జనగణలో కులగణన చేపట్టి పార్లమెంట్‌లో బీసీ బిల్లు ప్రవేశపెట్టాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. లేదంటే తమ పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. గురువారం న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ దాసు సురేష్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు చర్యలు తీసుకోకపోతే దేశవ్యాప్తంగా తిరుగుబాటు తప్పదన్నారు. విద్య, ఉద్యోగ, సామాజిక, ఆర్ధిక, రాజకీయ రంగాల్లో బీసీలకు జనాభా ప్రకారం వాటా ఇవ్వాలని ఆయన కోరారు. విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించడానికి ఉన్న అభ్యంతరాలేంటో చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రతిపాదికన చట్టసభల్లో రిజర్వేషన్లు ఉన్నాయని, బీసీలకు ఆ రిజర్వేషన్లు వర్తింపజేయకపోవడం దారుణమని కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంట్ సమావేశాలు ముగిసే వరకు ఢిల్లీలోనే ఉంటూ టాలను దాసు సురేష్ ఆధ్వర్యంలో తమ పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని, అదేవిధంగా వివిధ పార్టీల ఎంపీలను కలిసి మద్దతు కోరతామని ఆయన తెలిపారు.

అనంతరం దాసు సురేష్ మాట్లాడుతూ… బీసీ గణన, బీసీ బిల్లు కోసం అన్ని ప్రముఖ పార్టీల ఎంపీల మద్దతు కూడగడతామని తెలిపారు. అన్ని రాష్ట్రాల బీసీ ఎంపీలతో త్వరలోనే రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యచరణపై చర్చిస్తామన్నారు. బీసీల ఓట్లతో అందలం ఎక్కి, బీసీ బిల్లుకు పార్లమెంట్‌లో అనుకూలంగా నిలబడని ఎంపీల, మంత్రుల ఇళ్లు ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో నిరుద్యోగ జేఏసీ అధ్యక్షులు వెంకటేశ్, బీసీ న్యాయవాదుల జేఏసీ నాయకులు జక్కుల వంశీ, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ లాల్ కృష్ణ, గొల్లపెల్లి సునీల్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement