Tuesday, May 14, 2024

అవహేళన మాని నిధులు పెంచండి : పొన్నాల లక్ష్మయ్య

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కోసం కేంద్ర బడ్జెట్లో జరిపిన కేటాయింపులపై అధికారపక్షం అపహాస్యం మాని నిధులు పెంచాలని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య డిమాండ్ చేశారు. బడ్జెట్ కేటాయింపులపై సోనియా గాంధీ మాట్లాడినప్పుడు అధికార పార్టీ నేతలు సమాధానమిస్తూ 2005 నాటి కేటాయింపులతో బడ్జెట్ కేటాయింపులతో పోల్చి అవహేళన చేయడం తనకు చాలా బాధ కలిగించిందని అన్నారు. “2005లో దేశ బడ్జెట్ ఎంత? ఈరోజు దేశ బడ్జెట్ ఎంత? నాటి కూలీ రేట్లు ఎంత? ఇప్పుడెలా ఉన్నాయి?” అంటూ ఆయన కేంద్రాన్ని ప్రశ్నించారు. అప్పటి బడ్జెట్ కేటాయింపులతో పోల్చితే, కూలీ రేట్లు రెండింతలు అయ్యాయని, అలాగే మొత్తం దేశ బడ్జెట్ సైతం 2 రెట్లు పెరిగిందని తెలిపారు. ఆ ప్రాతిపదిక అదే నిష్పత్తిలో గ్రామీణ ఉపాధి హామీ పథకానికి బడ్జెట్ కేటాయింపులు కూడా పెరగాల్సి ఉందని అన్నారు. మరోవైపు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలు చేసిన సిఫార్సుల్లో ఉపాధి హామీ పని దినాలను పెంచాలని, బడ్జెట్ కేటాయింపులు పెంచాలని సిఫార్సులు చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.

ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చిందే పేదల కోసమని, వలసలను నిరోధించడం కోసమని పొన్నాల లక్ష్మయ్య అన్నారు. కానీ నేటి కేంద్ర ప్రభుత్వం మాత్రం సామాన్యులు వాడే గొడుగులపై పన్నులు వేస్తూ, వజ్రాల వ్యాపారులకు పన్నులు తగ్గిస్తున్నామని బడ్జెట్ ప్రసంగంలోనే చెప్పడం సిగ్గుచేటు అన్నారు. జీఎస్టీ వసూళ్లు పెరిగాయని జబ్బలు చరుచుకుంటున్న కేంద్రం, గ్యాస్ సిలిండర్ సహా సామాన్యులు వాడే వస్తువులపై పన్నులు పెంచి, రికార్డు వసూళ్లు సాధించడం ఘనకార్యమా అని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం పెట్టుబడిదారులకు కొమ్ముకాస్తోందని పొన్నాల మండిపడ్డారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement