Tuesday, May 21, 2024

2 వారాల్లో హైదరాబాద్ – విజయవాడ 6 వరుసల రహదారి పనులు : ఉత్తమ్ కుమార్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : హైదరాబాద్ – విజయవాడ (నేషనల్ హైవే 65)ను 6 వరుసల రహదారిగా విస్తరించే పనులు 2 వారాల్లో ప్రారంభమవుతాయని నల్గొండ ఎంపీ (కాంగ్రెస్) ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసిన అనంతరం ఓ ప్రకటన విడుదల చేసిన ఆయన ఈ విషయం వెల్లడించారు. ఈ రహదారి కేవలం విజయవాడ – హైదరాబాద్ నగరాలను మాత్రమే అనుసంధానం చేయడం లేదని, తన నియోజకవర్గంలోని హుజూర్‌నగర్, కోదాడ, సూర్యాపేట, నల్గొండ పట్టణాలను హైదరాబాద్ నగరానికి అనుసంధానం చేయడంలోనూ కీలకంగా వ్యవహరిస్తోందని చెప్పారు. 247 కి.మీ పొడవైన 4 వరుసల రహదారిని 2012 అక్టోబర్‌లో జీఎంఆర్ సంస్థ బీవోటీ (బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్‌ఫర్) పద్ధతిలో ప్రారంభించిందని గుర్తుచేస్తూ, ఆ సంస్థతో చేసుకున్న ఒప్పందం ప్రకారం 2024 ఏప్రిల్ నాటికి 6 వరుసల రహదారిగా విస్తరించాల్సి ఉందని వివరించారు. ప్రస్తుత గణాంకాల ప్రకారం హైవే మీద ట్రాఫిక్ 50,000 ప్యాసెంజర్ కార్ యూనిట్లకు పైగా ఉందని తెలిపారు.

అయితే వేర్వేరు కారణాలతో ట్రాఫిక్ తగ్గి తమ ఆదాయం తగ్గిందని, తమకు పరిహారం ఇవ్వాలని కోరుతూ జీఎంఆర్ సంస్థ కోర్టుకు వెళ్లిందని అన్నారు. ఈ క్రమంలో రహదారిని 6 వరుసలుగా విస్తరించేందుకు ఆ సంస్థ ఎలాంటి చర్యలు చేపట్టలేదని వెల్లడించారు. ఈ క్రమంలో తన సహచర ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తరచుగా ఈ అంశంపై కేంద్ర మంత్రిని కలిస్తూ, ఒత్తిడి చేయడంతో కేంద్ర మంత్రి జీఎంఆర్ సంస్థ ప్రతినిధులను పిలిచి సమావేశం ఏర్పాటు చేశారని తెలిపారు. కోర్టు కేసును ముగించి, వీలైనంత త్వరగా 6 వరుసల విస్తరణ పనులను ప్రారంభించేందుకు జీఎంఆర్ సంస్థ అంగీకరించిందని వివరించారు. 2009లో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 4 వరుసల ఈ రహదారి మంజూరవగా, ఇప్పుడు 6 వరుసలుగా విస్తరించే సమయంలో ఎంపీగా ఉండడం తనకెంతో సంతృప్తిగా ఉందని ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement