Friday, April 26, 2024

Big story : ఎదుగుదల చూసి ఓర్వలేకనే విషప్రచారం.. మోదీ పర్యటనతో ఇరకాటంలో టీఆర్ఎస్ : కిషన్ రెడ్డి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలంగాణలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎదుగుదల చూసి ఓర్వలేకనే విషప్రచారం చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) నేతలను ఉద్దేశించి కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు. గురువారం సాయంత్రం ఢిల్లీలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తన నియోజకవర్గంలో జరిగే అధికారిక కార్యక్రమాలకే పిలవకుండా అవమానిస్తూ ఇప్పుడు ప్రొటోకాల్ గురించి టీఆర్ఎస్ నేతలు మాట్లాడ్డం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. తనను పిలవకపోయినా తానెప్పుడూ మాట్లాడలేదని, జర్నలిస్టులు అడిగారు కాబట్టే ఇప్పుడు స్పందించానని చెప్పారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటనతో టీఆర్ఎస్ ఇరకాటంలో పడిందని, అందుకే ఆత్మరక్షణ ధోరణి అవలంబిస్తోందని కిషన్ రెడ్డి అన్నారు. కమ్యూనిస్టులను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తోందని, ఇటు రాష్ట్రంలో అటు దేశంలో కమ్యూనిస్టుల చరిత్ర ముగిసిపోయిందని అన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీయే కమ్యూనిస్టుల కార్మిక సంఘాలు, ఉద్యోగసంఘాలు సహా అనుబంధ సంఘాలన్నింటినీ ఆక్రమించుకుందని, అయినా సిగ్గులేకుండా టీఆర్ఎస్ పంచన చేరిన కమ్యూనిస్టులు బీజేపీని విమర్శించడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు.

రాజకీయం వద్దు.. రాష్ట్రాభివృద్ధి కోసం రండి

తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని.. ఇందులో భాగంగా చేపడుతున్న అనేక మౌలిక వసతుల కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాల్సిన అవసరం ఉందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. నవంబర్ 12వ తేదీన రామగుండంలో ప్రధానమంత్రి RFCL (రామగుండం ఫెర్టిలైజర్ అండ్ కెమికల్స్ లిమిటెడ్) ను జాతికి అంకితం చేయనున్న సందర్భంగా.. ఈ కార్యక్రమానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ పార్టీ దుష్ప్రచారం చేస్తోందని ఆయన ఆరోపించారు. ‘RFCL వల్ల మన యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. మన రైతులకు యూరియా అందుబాటులోకి వస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే మన తెలంగాణ ముఖచిత్రమే మారిపోతుంది’ అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఇలాంటి తెలంగాణ కల్పతరువైన RFCL విషయంలో టీఆర్ఎస్, వారి మిత్ర పక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రం చేస్తున్న కృషికి సహకరించాల్సిందిపోయి అర్థరహితమైన విమర్శలు చేయడం సరికాదని ఆయన హితవు పలికారు.

తెలంగాణతోపాటు, దేశంలో వివిధ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తున్నారంటూ వస్తున్న విమర్శలకు కిషన్ రెడ్డి స్పందిస్తూ.. ‘మా ప్రభుత్వానికి అలాంటి ఆలోచన లేదు. చేయాల్సిన అవసరమూ లేదు. ఉదాహరణకు సింగరేణి సంస్థలో.. కేంద్రం వాటా 49%, రాష్ట్రం వాటా 51%. రాష్ట్రానికే మెజారిటీ షేర్ ఉన్నప్పుడు మేమెలా ప్రైవేటు పరం చేస్తాం. కానీ ఇవాళ సింగరేణి బొగ్గు గనుల వద్ద.. సింగరేణి ప్రైవేటీకరణ చేయొద్దంటూ బోర్డులు పెట్టి ప్రజల్లో, కార్మికుల్లో అనవసర అనుమానాకు తావిస్తున్నారు’ అని పేర్కొన్నారు. ఏ రాష్ట్రంలో ప్రధానమంత్రి అధికారిక పర్యటన ఉన్నప్పటికీ.. నిబంధనలకు లోబడే అందరికీ ఆహ్వానాలు వెళ్తాయని, ఎవరినీ అగౌరవ పరిచే ఉద్దేశం కేంద్రానికి గానీ, అధికారులకు గానీ ఉండవని ఆయన అన్నారు. ఇదే ముఖ్యమంత్రి RFCL శంకుస్థాపనకు వచ్చినపుడు అడ్డురాని భేషజాలు.. జాతికి అంకితం చేస్తున్నప్పుడు ఎందుకొస్తున్నాయన్నారు.

- Advertisement -

తనపైనా ఎన్నో విమర్శలు చేస్తున్నారని.. వీటిని పట్టించుకోన్న కిషన్ రెడ్డి.. తెలంగాణ అభివృద్ధి, తెలంగాణ ప్రజల సంక్షేమమే తనకు ముఖ్యమన్నారు. రాజకీయాల్లో సిద్ధాంతపరమైన వైరుధ్యాలు సహజమేనని.. కానీ దేశం, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో వీటిని పక్కనబెట్టి పనిచేయాలని ఆయన సూచించారు. తెలంగాణ  ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, వారు విజ్ఞతతో ఆలోచిస్తున్నారని కిషన్ రెడ్డి అన్నారు. ప్రధానమంత్రి వచ్చినా, కేంద్ర మంత్రులు వచ్చినా, గవర్నర్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రొటోకాల్ పాటించడం లేని విషయం వాస్తవమా? కాదా? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.

ఇకనైనా రాజకీయాలు పక్కనపెట్టి ముఖ్యమంత్రి నవంబర్ 12 నాటి కార్యక్రమానికి హాజరు కావాలని కిషన్ రెడ్డి కోరారు. రాజకీయాల్లో పట్టువిడుపులు సహజమేనని, తెలంగాణ అభివృద్ధి కోసం సీఎం తన హుందాతనాన్ని నిలుపుకోవాలన్నారు. తెలంగాణకోసం ఎంతో చేస్తోందన్న కిషన్ రెడ్డి, గడువు ముగిసినప్పటికీ దేశంలో ఎక్కడాలేని విధంగా ధాన్యం సేకరణ చేస్తున్నామని, పారాబాయిల్డ్ రైస్ ను కొంటున్న విషయం ప్రజలకు తెలుసన్నారు. ప్రధానమంత్రి పార్టీ సంబంధిత కార్యక్రమానికి వస్తుంటే నిరసన తెలిపినా అర్థం ఉంటుందని, తెలంగాణ పురోగతికి సంబంధించిన ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తుంటే ఉత్సాహంగా పాల్గొనాల్సింది పోయి విమర్శలు చేయడం సరికాదన్నారు.

ముఖ్యమంత్రి ఘర్షణాత్మకమైన వ్యవహారశైలి వల్ల తెలంగాణకు నష్టమే తప్ప లాభం జరగదన్నారు. మొండి వాదన, వితండ వాదన వల్ల.. సాధించేది ఏమీ ఉండదని కిషన్ రెడ్డి సూచించారు. ఇలాంటి పరిస్థితులు తొలగిపోయి తెలంగాణ అభివృద్ధి బాటలు పట్టాలంటే.. మన రాష్ట్రంలోనూ డబుల్ ఇంజన్ సర్కారు ఉండాల్సిన అవసరం ఉందని, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు సంపూర్ణ సమన్వయంతో పనిచేసినపుడు పురోగతి సాధ్యమవుతుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రధాని కార్యక్రమాన్ని అడ్డుకోవాలంటూ కమ్యూనిస్టు పార్టీలు, కొన్ని సంఘాలను టీఆర్ఎస్ రెచ్చగొడుతోందన్న కిషన్ రెడ్డి.. తమ అస్తిత్వాన్ని ధ్వంసం చేస్తున్న కేసీఆర్ తో వామపక్షాలు అంటకాగడం.. హాస్యాస్పదమన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రధానమంత్రి చేతులమీదుగా శంకుస్థాపన/ప్రారంభం/జాతికి అంకితం కానున్న ప్రాజెక్టుల వివరాలను కిషన్ రెడ్డి వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement