Sunday, April 28, 2024

శాంతిస్తున్న గోదావరి వరద.. మూడో ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ

భద్రాద్రి కొత్తగూడెం, ప్రభన్యూస్‌ ప్రతినిధి : గోదావరి ఎగువ ప్రాంతాలలో కురిసిన వర్షాలు, జలాశయాల నుంచి భారీగా నీటిని విడుదల చేయడంతో భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపంతో ప్రవహించింది. గత వారం రోజులుగా పెరుగుతూ తగ్గుతూ వస్తున్న గోదావరి నీటిమట్టం గత నాలుగు రోజులుగా భారీగా వరద నీరు చేరి భద్రాచలం వద్ద వరద పోటెత్తింది. గోదావరి వరద ఉగ్రరూపంతో ప్రవహించడంతో గోదావరి పరివాహక ప్రాంతంలోని ఏడు మండలాల్లోని వందలాది గ్రామాలు వరద ముంపునకు గురయ్యాయి. శనివారం రాత్రి 11 గంటలకు 56.10 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం అర్ధరాత్రి 1గంట వరకు నిలకడగా ఉంది.

రాత్రి 2గంటలకు 50 అడుగులకు చేరిన నీటి మట్టం తగ్గుతూ వస్తోంది. ఆదివారం మధ్యాహ్నం 2గంటలకు 52.60 అడుగులకు తగ్గడంతో భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. ఆదివారం సాయంత్రం 7 గంటలకు 50.40 అడుగులకు నీటిమట్టం చేరింది. గోదావరి తీరంలోని ఏడు మండలాలు, కిన్నెరసాని, ముర్రేడువాగు పరివాహక ప్రాంతంలోని మరో నాలుగు మండలాలతో కలిపి 11 మండలాలు వరద ముంపునకు గురయ్యాయి. వరద ముంపునకు గురైన 11 మండలాల బాధితుల కోసం 41 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. పునరావాస కేంద్రాలకు 4,121 కుటుంబాలకు చెందిన 13వేల 56 మందిని తరలించారు.

గోదావరి వరద పూర్తి స్థాయిలో తగ్గకపోవడంతో వరద బాధిత కుటుంబాలు పునరావాస కేంద్రాలలోనే తలదాచుకుంటున్నాయి. పునరావాస కేంద్రాలలోని వరద బాధితులను మాజీ పీసీసీ అధ్యక్షులు, మాజీ రాజ్యసభ సభ్యులు వీ. హనుమంతరావు, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్యలు పరామర్శించి.. వారికి అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. భోజనం నాణ్యతగా లేకపోవడంతో ఈ విషయాన్ని జిల్లా అధికార యంత్రాంగం దృష్టికి తీసుకెళ్లారు. భోజనంలో సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే వీరయ్య వరద బాధిత కుటుంబాలకు పునరావాస కేంద్రంలో భోజనం వడ్డించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement